కో ఆప్షన్ ఎన్నికల్లో గులాబీ జయకేతనం
కామారెడ్డి/కామారెడ్డిటౌన్: కామారెడ్డి మున్సిపల్ కో ఆప్షన్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయకేతనం ఎగురవేసింది. కో ఆప్షన్ ఎన్నికలను వాయిదా వేయాలని కాంగ్రెస్ కౌన్సిలర్లు చేసిన డిమాండ్‌ను ఎన్నికల పరిశీలకులు ఒప్పుకోకపోవడంతో చైర్‌పర్సన్ సుష్మ ఎన్నికను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు చెందిన నిట్టు క్రిష్ణమోహన్‌రావు, మహ్మద్ సాజిద్, అప్సరీ బేగం ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు మున్సిపల్ చైర్‌పర్సన్ పిప్పిరి సుష్మ ప్రకటించారు.
ఎన్నికకు హాజరైన సభ్యులు
ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌తో పాటు టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు, ఇండిపెండెంట్‌లు,కాంగ్రెస్ కౌన్సిలర్ లు హాజరుకాగా, కాంగ్రెస్ 32వ వార్డు కౌన్సిలర్ రామ్మోహన్ గైర్హాజరయ్యారు. అలాగే అఫిషియో ఓటు కలిగిన ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ సైతం హాజరుకాలేరు. దీంతో కాంగ్రెస్ వర్గానికి 15, టీఆర్‌ఎస్ వర్గానికి 18 మెజార్టీ ఓట్లు దక్కాయి.
ఎన్నికలు వాయిదా వేయాలని బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్ల వాకౌట్
హైకోర్టు ఆదేశాల మేరకు హాజరైన ఎన్నికల పరిశీలకుడు దివ్యదత్త, సమిరాఛామాలు ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. మొదటగా కాంగ్రెస్ కౌన్సిలర్లు దామోదర్‌రెడ్డి, బీజేపీ కౌన్సిలర్ మోతేక్రిష్ణాగౌడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన బాలాజీనాయక్ క్రిమినల్ కోర్టుకు వెళ్లారని, ప్రస్తుతం కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న విక్రమసింహారెడ్డి కమిషనర్‌గా అనర్హుడని ట్రిబ్యునల్ కోర్టు జీవోనంబర్ 168ను జారీ చేసిందని, ఎన్నికల అధికారి కమిషనర్ కాబట్టి వాయిదా వేయాలని వారు పట్టుబట్టారు.
ఎన్నికలు వాయిదా వేయాలని పరిశీలకులకు వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదని, ఎన్నికలు హైకోర్టు ఆదేశాల మేరకు జరిపించాలని ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ వాదించారు. ఇరువర్గాల మధ్య గంట పాటు వాగ్వాదం జరిగింది. హైకోర్టు ఆదేశాలు, కోరం ఉన్నందున ఎన్నికలు నిర్వహించాలని పరిశీల కుడు ప్రకటించా రు. దీంతో మొదటగా బీజేపీ కౌన్సిలర్లు మోతే క్రిష్ణాగౌడ్, భారతమ్మలు వాకౌట్ చేసి వెళ్లిపోగా కాసేపు వాగ్వాదం చేసిన అనంతరం కాంగ్రెస్ కౌన్సిలర్లు సైతం వాకౌట్ చేశారు.
వాయిదా వేసేందుకు ఇంటి వ్యవహారం కాదు : ప్రభుత్వ విప్ గోవర్ధన్
మున్సిపల్ చైర్‌పర్సన్ పిప్పిరి సుష్మ ట్రిబ్యునల్ కోర్టు ఆదేశాలు, జీవో నంబర్ 168 ప్రకారం కమిషనర్ అనర్హుడని కోర్టు ఆదేశాలను పాటిస్తానని ఎన్నికలను వాయిదా వేస్తాననడంతో ఎమ్మెల్యేతో పాటు సభ్యులూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల పరిశీలకులు కూడా చైర్‌పర్సన్‌కు నచ్చచెప్పారు. పదినిమిషాలు సభను వాయిదా వేస్తున్నానని మళ్లీ ప్రకటించడంతో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చైర్‌పర్సన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది నీ ఇంటి వ్యవహారం కాదని, చట్టం, రాజ్యాంగ పరంగా ఎన్నికలు నిర్వహించాలని కోరమ్ సభ్యులు ఉన్నామని, కారణం లేకుండా సభను ఎందుకు వాయిదా వేస్తావని మండిపడ్డారు. ఇన్ని రోజులుగా ప్రశాంత వాతావరణంలో కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు జరుపాలని పరిశీలకులు ఎమ్మెల్యే విన్నవించారు. తనకు పదినిమిషాల సమయం ఇవ్వాలని, బయటకు వెళ్లి వచ్చి ఎన్నికలు నిర్వహిస్తామని చైర్‌పర్సన్ విన్నవించుకున్నారు. బయటకు వెళ్లేది లేదని సభ్యులు స్పష్టం చేశారు. గత ఎన్నికలు కూడా వాయిదాలు వేస్తు సభను అవమానపర్చారని, ఇప్పుడు కూడా అలాగే చేయాలని చైర్‌పర్సన్ చూస్తున్నారని ఎమ్మెల్యే పరిశీలకుల దృష్టికి తీసుకెళ్లారు. బయటకు వెళ్తే ప్యానల్ చైర్మన్‌తో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని పరిశీలకులు చైర్‌పర్సన్‌కు తెల్పడంతో చివరికి చేసేదేమి లేక ఎన్నికలు జరుపాలని చైర్‌పర్సన్ ప్రకటించారు.