చలికి 17 మంది బలి
రాష్ట్రవ్యాప్తంగా భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
ఉదయం 10 గంటలు దాటినా తగ్గని తీవ్రత
మరో 2 రోజుల పాటు కొనసాగనున్న చలి
ఆదిలాబాద్‌లో అతి తక్కువగా 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. ఉత్తర భారతం నుంచి వీస్తున్న శీతల గాలులతో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఉదయం 10 గంటలు దాటినా చలి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. చలి తీవ్రతకు రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లోనే ఏకంగా 17 మంది బలయ్యారు. ఇందులో ఒక్క వరంగల్ జిల్లాలోనే ఎనిమిది మంది మరణించడం ఆందోళనకరమైన అంశం. వృద్ధులు, అనాథలు, రోడ్లపైన నిద్రించేవారు ఎక్కువగా చలి బారిన పడి మృతి చెందుతున్నారు.
ఇక మరోవైపు సంక్రాంతి సందర్భంగా రైళ్లు, బస్సుల్లో ప్రయాణించేవారు చలి కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్, భద్రాచలం, ఏటూరునాగారం తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు అల్లాడిపోతున్నారు. దట్టంగా కప్పుకున్న పొగ మంచు కారణంగా ఆయా ప్రాంతాల్లో 10 గంటలు దాటినా సూర్యుడు కనిపించని పరిస్థితి నెలకొంది. చలికాలంలో గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం రగ్గులు, దుప్ప ట్లను పంపిణీ చేయాల్సి ఉండగా... సరిగా సరఫరా కావడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
వరంగల్ జిల్లాలో చెన్నారావుపేట వుండలం లింగగిరి గ్రావూనికి చెందిన నాంపెల్లి చంద్రవ్ము(75), తోపనగడ్డతండాకు చెందిన బూక్యా భోజ్యా(78), మహబూబాబాద్ మండలం వేంనూరుకు చెందిన బానోతు చిన్నలింగ్యా(85), అడ్డాసికుంటతండాకు చెందిన గుగులోతు చాంప్లి(60), ఉత్తర తండాకు చెందిన అంగోతు బాజు(70), మరిపెడ మండలంలోని ఉగ్గంపల్లికి చెందిన ధారమల్ల తిరుపతమ్మ(75), ఆర్లగడ్డ తండాకు చెందిన బానోతు మౌళి(60), లూనావత్ జమ్కి (75) మంగళవారం రాత్రి, బుధవారం తెల్లవారుజామున మరణించారు. ఇక నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన స్వాతంత్య్ర సమరయోధురాలు లక్కరాజు లలితాబాయి(86), మెదక్ జిల్లా నంగునూరు మండలం వెల్గటూర్‌లో లక్ష్మి (55) చలిని తట్టుకోలేక మరణించారు. ఆదిలాబాద్ జిల్లాలోనూ నలుగురు చలి ధాటికి మృతి చెందగా.. చలి మంటల్లో పడి ముగ్గురు చనిపోయారు.
ఆదిలాబాద్‌లో అతి తక్కువగా..
రాష్ట్రంలోనే అత్యంత తక్కువగా ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అక్కడ బుధవారం ఎనిమిది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో 9 డిగ్రీలు, రామగుండంలో 10, హన్మకొండ, హైదరాబాద్‌ల్లో 11, నిజామాబాద్‌లో 12, హకీంపేట, నల్లగొండలో 13, మహబూబ్‌నగర్‌లో 14, భద్రాచలంలో 15 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ చలి తీవ్రత మరో రెండు రోజుల పాటు ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు.
తెలంగాణలోని అన్ని జిల్లాల్లో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయని ఆయన తెలిపారు. సంక్రాంతి తర్వాత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. గత ఏడెనిమిదేళ్లతో పోలిస్తే ఈ సారి కనిష్ట ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయని వాతావరణ శాస్త్రవేత్త సీతారాం తెలిపారు. కాగా.. చలి మరణాలతో ఆయా జిల్లాల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై పలు చర్యలు చేపడుతోంది. పలు చోట్ల కొన్ని స్వచ్ఛంద సంస్థలు దుప్పట్లు, రగ్గులను పంపిణీ చేస్తున్నాయి.