చెత్త కుప్పలను చూసి కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కలెక్టర్
చెన్నూర్: చెన్నూర్ మున్సిపాలిటీలో పారిశుధ్య పనుల నిర్వహణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఎన్ని సార్లు చెప్పినా మార్పు రావడం లేదని అధికారుల తీరుపై జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన నర్సరీని పరిశీలించారు. అనంతరం 18వ వార్డులో జరుగుతున్న ప్రత్యేక పారిశుధ్య పనులను తనిఖీ చేశారు. జగన్నాథాలయం వెనుక గల చెత్త కుప్పలు, పాత కూరగాయల మార్కెట్ వద్ద కుక్క కళేబరాన్ని చూసి ఇదేమిటని కమిషనర్ బాపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఈ నెల 1 నుంచి 8 వరకు ప్రత్యేక పారిశుధ్య వారోత్సవాలను నిర్వహిస్తుంటే, చెన్నూరు మున్సిపాలిటీలో పారిశుధ్య పనులు కానరావడం లేదన్నారు. పారిశుధ్య పనుల నిర్వహణపై నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు. ఈ నెల 20 నుంచి ఆరో విడత హరితహారం పారంçభం కానుందని, నర్సరీలో పెంచుతున్న మొక్కలు నాటేందుకు పనికి రావని తెలిపారు. కాలనీల్లో ఖాళీ స్థలం ఉన్న చోట మొక్కలు నాటాలని పేర్కొన్నారు. ఖాళీ స్థలాల్లో చెత్త వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కమిషనరే కాకుండా వార్డుల్లో పర్యటించి పారిశుధ్య లోపం లేకుండా చూడాల్సిన బాధ్యత కౌన్సిలర్ల పై ఉందన్నారు. వార్డుల్లో ప్రత్యేక పారిశుధ్య పనులను ముమ్మరం చేయాలన్నారు. మళ్లీ వచ్చే సరికి మార్పు రాకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ బాపు, వైస్ చైర్మన్ నవాజోద్దిన్, కౌన్సిలర్లు శాంతారాణి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
భీమారం మండలంలో..
భీమారం(చెన్నూర్): మండలంలోని కాజిపల్లి, భీమారం గ్రామాల్లో జిల్లా కలెక్టర్ భారతీ హోళీకేరీ బుధవారం ఆకస్మికం తనిఖీలు నిర్వహించారు. భీమారం బస్టాండ్ ప్రాంతంలో పర్యటించారు. రోడ్డుకి పక్కనే పండ్ల దుకాణాలు నిర్వహించడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కొబ్బరిబోండాలను తాగిన తర్వాత అక్కడే పడేయడం ద్వారా అందులో నీళ్లు నిల్వ ఉండి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని కలెక్టర్ హెచ్చరించారు. వెంటనే వాటిని తొలగించాలని మరోసారి అపరిశుభ్రంగా ఉంటే జరిమానా వేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. రోడ్డు పక్కనే షాపులు నిర్వహంచరాదని కొంత లోపలికి పెట్టుకోవాలని వ్యాపారులను కలెక్టర్ ఆదేశించారు. కాజిపల్లి గ్రామంలో పలువీధుల్లో నడుచుకుంటూ వెళ్లారు. ఎక్కడ చూసినా పరిశుభ్రత కానరాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డు సభ్యుడికి చెందిన టెంట్ హౌస్ సామగ్రి ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై ఉండటం చూసి వార్డు సభ్యున్ని మందలించారు. ఒక ప్రజాప్రతినిధి అయుండి స్వచ్ఛకాజిపల్లికి సహకరించనందుకు రూ.1000, మరొకరికి రూ500 జరిమానా విధించాలని కార్యదర్శిని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ విజయానందం, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో శ్రీపతిబాపు, సర్పంచ్‌లు గద్దె రాంరెడ్డి, తిరుపతి, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.
దక్కన్ గ్రామీణ బ్యాంక్‌ను సందర్శించిన కలెక్టర్
చెన్నూర్: పట్టణ పర్యటనలో భాగంగా స్థానిక దక్కన్ గ్రామీణ బ్యాంక్‌ను కలెక్టర్ భారతి హోళి కేరి సందర్శించారు. బ్యాంక్‌లో రైతులు కిక్కిరిసి ఉండటం చూసి ఇదేంటని ప్రశ్నించారు. లాక్‌డౌ న్ నిబంధనలకు విరుద్ధంగా మాస్కులు ధరించట్లేదని, భౌతికదూరం పాటించడంలేదని ఆధికా రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ కనీసం నిబంధనలు పాటించకుంటే ఎలా అని అధికారులను ప్రశ్నించారు. రైతులు మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించే విధంగా బ్యాంకు వద్ద కానిస్టేబుల్‌ను ఉంచాలని ఎస్సై విక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment