కంసాన్‌పల్లి(బి)లో మాట్లాడుతున్న కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్, పక్కన ఎంపీపీ కరుణ
సాక్షి, వికారాబాద్: ఇంట్లో ఇంకుడు గుంత లేనివారికి ఉపాధి పనులు కల్పించేది లేదని కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్ ప్రకటించారు. సంక్రాంతి తర్వాత జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీలో వంద రోజుల కొత్త పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఆలోపు కూలీలు తమ ఇళ్లలో ఇంకుడుగుంతలు తవ్వుకోవాలని పిలుపునిచ్చారు. రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం ఆమె మంతన్‌గౌడ్‌తండా, ఎక్మాయి, కంసాన్‌పల్లి(బి), మైల్వార్, నీళ్లపల్లి, జలాల్‌పూర్ గ్రామాల్లో పర్యటించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను పరిశీలించారు.
పారిశుద్ధ్యం, మురుగు కాలువలు, అంతర్గత రోడ్లు, విద్యుత్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఇంట్లో టీవీలు ఉంటాయ్.. స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. బైక్‌లు, ట్రాక్టర్లు ఉన్నవారు సైతం ఇంకుడుగుంతలు, మరుగుదొడ్డి కట్టుకోమంటే బిల్లులు రావడం లేదని చెప్పడం సమంజసనమేనా..? ఇంట్లోని వస్తువులన్నింటినీ ప్రభుత్వమే కొనిచ్చిందా..? మరుగుదొడ్డి, ఇంకుడు గుంత కూడా మీ కోసం నిర్మించుకోవాలి.. ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు ఆలస్యమైనా తప్పకుండా వస్తాయి.. సంక్రాంతి తర్వాత ఎవరి ఇంట్లోనైనా ఇంకుడు గుంత, మరుగుదొడ్డి నిర్మించుకోకపోయినా, రోడ్లపైకి మురుగు నీళ్లు వదిలినా..? రహదారుల పక్కన మలమూత్రాలు విసర్జించినా కొత్త పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 52, 88 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం.
వారికి జరిమానాలు కూడా విధిస్తాం. ఫైన్లు కట్టనివారి ఇంటి ఆస్తులు వేలం వేసి పంచాయతీలతో పారిశుద్ధ్య పనులు చేయిస్తాం’ అని హెచ్చరించారు. పారిశుద్ధ్యం బాగుంటే విషజ్వరాలు రాకుండా ఉంటాయన్నారు. దీని కోసం సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఒక్క మొక్క కనిపిస్తలేదు..
మండలంలోని నీళ్లపల్లిలో పర్యటించిన కలెక్టర్‌కు సర్పంచ్ సువర్ణ, గ్రామస్తులు డప్పులతో ఘనంగా స్వాగతంపలికారు. అయితే కాలనీల్లో పర్యటించిన కలెక్టర్‌కు ఎక్కడా మొక్కలు కనిపించకపోవడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ గ్రామంలో హరితహారం నిర్వహించలేదా..? ఒక్క మొక్క కూడా లేదు.. నీటిని వృథా చేస్తున్నారు..? రోడ్ల పక్కనే చెత్త, మురుగు వేశారు.. ఇలాగైతే ఎలా అని పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ గ్రామంలో శ్మశానవాటిక, డంపింగ్ యార్డు తప్పని సరిగా ఉండాలని అధికారులకు సూచించారు. పల్లె ప్రగతి పనుల పరిశీలనకు కలెక్టర్ తనతో పాటు వివిధ శాఖల అధికారులను తీసుకువస్తున్నారు.
తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించాలని అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేస్తున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కరుణ, తాండూరు ఆర్డీఓ వేణుమాధవ్‌రావు, మండల ప్రత్యేక అధికారి రవి, జిల్లా అధికారులు మనోహర్‌రావు, బాబు శ్రీనివాస్, జానకిరామ్, ఎంపీడీఓ ఉమాదేవి, తహసీల్దార్ ఉమామహేశ్వరి, సర్పంచులు గాయిత్రి చౌహన్, నారాయణ, వెంకటయ్య, సీమా సుల్తాన, సువర్ణ, వసంతమ్మ, వివిధ శాఖల మండల అధికారులు, ఉపాధి, రెవెన్యూ సిబ్బంది, పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment