సామాన్యులకు జెడ్పీ చైర్మన్ పీఠం | common people get ZP chairperson seat | Sakshi
Sakshi News home page

సామాన్యులకు జెడ్పీ చైర్మన్ పీఠం

Published Sun, Jul 6 2014 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 AM

common people get ZP chairperson seat

 జనశక్తి నుంచి జెడ్పీకి

 సాక్షి, కరీంనగర్: సాదాసీదా గొర్రెలకాపరి కుటుంబం నుంచి ఎదిగిన తుల ఉమ కరీంనగర్ జెడ్పీ పీఠాన్ని అధిరోహించిన తొలి మహిళగా రికార్డు నెలకొల్పారు. చిన్నప్పుడే అడవి బాట పట్టిన ఉమ.. పదేళ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపారు. సీపీఐ (ఎంఎల్) జనశక్తి విప్లవోద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. అనారోగ్యంతో 1994లో లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. అదే ఏడాది సీపీఐ(ఎంఎల్) తరఫున జగిత్యాల  నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు.
 
 గృహిణి చేతికి పగ్గాలు

 సాక్షి, ఆదిలాబాద్: శోభారాణిది రాజకీయ కుటుంబమే.   ఆమె నిర్మల్‌లోని సాయి కృప ఎడ్యుకేషనల్ సొసైటీ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. భర్త వల్లకొండ సత్యనారాయణగౌడ్ టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆదిలాబాద్ జెడ్పీ చైర్‌పర్సన్ పదవిని ఈసారి బీసీ మహిళకు కేటాయించడంతో నిర్మల్ జెడ్పీటీసీగా గెలిచిన శోభారాణికి ఈ అవకాశం దక్కింది.

 అందలమెక్కిన అంగన్‌వాడీ టీచర్

 సాక్షి, వరంగల్ : వరంగల్ జిల్లా జనగామ నియోజకవర్గంలోని నర్మెట మండలం గండిరామారం గ్రామానికి చెందిన గద్దల పద్మ నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు.  2001లో టీఆర్‌ఎస్ తరఫున అబ్దుల్ నాగారం ఎంపీటీసీ సభ్యురాలుగా గెలిచారు. అనంతరం అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేసేవారు.  తాజాగా నర్మెట జెడ్పీటీసీ స్థానం నుంచి పోటీచేసి గెలుపొందారు. పలు సమీకరణాల నేపథ్యంలో వరంగల్ జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యా రు.

 ఎంపీటీసీ నుంచి రాజు ప్రస్థానం మొదలు

 సాక్షి, నిజామాబాద్: దఫేదార్‌రాజు 2001లో నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలం గున్కుల్ ఎంపీటీసీగా టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2006లో గున్కుల్ గ్రామ సర్పంచ్‌గా గెలిచారు. 2013లో గున్కుల్ సింగిల్ విండో చైర్మన్‌గా పని చేశారు. సాధారణ ఎన్నికలకు పది నెలల ముందు,  రాజు టీఆర్‌ఎస్‌లో చేఆరు. నిజాంసాగర్ మండల జెడ్పీటీసీ సభ్యుడిగా టీఆర్‌ఎస్ నుంచి ఎన్నికయ్యారు. ఇందూరు జెడ్‌పీ చైర్మన్ పదవి బీసీ జనరల్‌కు రిజర్వ్ కావడంతో రాజును జెడ్‌పీ చైర్మన్ పదవి వరించింది.
 
 సర్పంచ్ నుంచి జెడ్పీ పీఠం వరకు..

 సాక్షి, నర్సాపూర్: మెదక్ జెడ్పీ చైర్‌పర్సన్ గా ఎన్నికైన ఎ.రాజమణి సాధారణ గృహిణి. నర్సాపూర్ మేజర్ పంచాయతీ సర్పంచ్ (టీడీపీ)గా 2007లో ఎంపికై 2012 వరకు కొనసాగారు. 2009లో టీఆర్‌ఎస్‌లో చేరారు. నర్సాపూర్ జెడ్పీటీసీ స్థానం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. ఆమె భర్త ఎ.మురళీధర్‌యాదవ్ 1995, 2000 ఎన్నికల్లో నర్సాపూర్ మేజర్ గ్రామ పంచాయతీకి సర్పంచ్‌గా గెలుపొందారు.

 ఎన్‌ఎస్‌యూఐ నుంచి ఎదిగిన బాలు

 సాక్షి, నల్లగొండ: బాలునాయక్ స్వస్థలం ముదిగొండ పంచాయతీలోని సూర్యాతండా. 1994లో దేవరకొండ ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, డీసీసీ కార్యదర్శిగా పనిచేసి, 2004లో దేవరకొండ జెడ్పీటీసీగా నెగ్గారు. 2007లో దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో దేవరకొండ ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. ప్రస్తుతం చందంపేట జెడ్పీటీసీ సభ్యుడిగా గెలిచి, నల్లగొండ జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.

 నాడు రైల్వే హమాలీ.. నేడు జెడ్పీ చైర్మన్

 సాక్షి, గద్వాల : ఒకనాడు కర్నూలు రైల్వే వ్యాగన్ హమాలీగా పనిచేసిన బండారి భాస్కర్ నేడు మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ చైర్మన్ స్థాయికి ఎదిగారు. టీఆర్‌ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి కృష్ణమోహన్‌రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉండేవారు. ఈ నేపథ్యంలోనే 2001 నుంచి 2006వరకు గద్వాల మండలం కాకులారం సర్పంచ్‌గా పనిచేశారు. తాజాగా గద్వాల నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా నెగ్గారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement