
► హైదరాబాద్‌లో ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతడు నివసిస్తున్న అపార్టుమెంట్‌లో ఉండే ఓ వ్యక్తి తనకు కూడా వైరస్ సోకిందేమోనని సందేహించాడు. తనకు కూడా పరీక్షలు చేయాలంటూ దగ్గరలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు వెళ్లాడు. అక్కడ ఉన్న సిబ్బంది అతడికి పరీక్షలు నిర్వహించేందుకు నిరాకరించారు. ఏవైనా లక్షణాలు ఉంటేనే రావాలని తిప్పి పంపారు. ఇప్పటికీ అతడిలో కరోనా వైరస్ గిలి అలానే ఉండిపోయింది.
► ఓ మీడియా సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి బంధువుకు పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆ ఉద్యోగీ పరీక్షలకు వెళ్లి భంగపడ్డాడు. మరో సంస్థకు చెందిన వ్యక్తి దగ్గు, గొంతు నొప్పి అంటూ వెళ్తే యాంటీ బయాటిక్స్ వేసుకుని అప్పటికీ తగ్గకపోతే 10 రోజులు ఆగి రావాలని ఉచిత సలహా ఇచ్చి పంపిన వైద్య సిబ్బంది పరీక్షలే చేయలేదు.
సాక్షి, హైదరాబాద్ : ..ఈ ఉదాహరణలను బట్టి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చిపెడుతోం దని అర్థమవుతోంది. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. అవసరం అనుకుని పరీక్షల కోసం వస్తున్న వారికి పరీక్షలు చేయకుండా నిరాకరిస్తుండటం ప్రజల్లో విమర్శలకు తావిస్తోంది. పరీక్షలు చేసేం దుకు ప్రైవేట్ ల్యాబ్‌లకు ప్రభుత్వ అనుమతి లేకపోవడం, ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తే తిప్పి పంపిస్తుండటంతో సాధారణ ప్రజానీకానికి పాలు పోవట్లేదు. అదే సమయంలో పలుకుబడి ఉన్న వారికి, కొందరు ప్రజాప్రతినిధులకు అడిగిన వెంటనే పరీక్షలు చేస్తుండటంతో సామాన్యులను పట్టించుకోవట్లేదనే చర్చ జరుగుతోంది. ఈ పరీక్షల విషయంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతోంది.
► గాంధీ, ప్రభుత్వ, ప్రైవేటు పరీక్ష కేంద్రాలకు రోజూ టెస్టుల కోసం వస్తున్న వారు - 2,000
రోజూ వేల మంది..
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు జరుపుతున్న కరోనా టెస్టుల సంఖ్యతో పోలిస్తే మన రాష్ట్రంలో జరుగుతున్న టెస్టుల సంఖ్య చాలా తక్కువ అనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయంలో అటు కోర్టులు, ఇటు కేంద్రం కూడా రాష్ట్ర వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రభుత్వం మాత్రం అనవసరంగా టెస్టులు చేయొద్దనే విధానంతో ముందుకెళ్తోంది. ఐసీఎంఆర్ కూడా రాష్ట్రంలో వైరస్ కమ్యూనిటీ స్ప్రెడ్ కాలేదని, ప్రమాదం లేదని తేల్చింది. రాష్ట్రంలో ఆర్–నాట్ శాతం కూడా 180 నుంచి 110కి తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. అంతవరకు బాగానే ఉంది.. కానీ అవసరం అనుకున్న వారికి టెస్టులు చేయకపోవడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. అడిగిన అందరికీ కాకపోయినా అవసరం అనుకున్న వారికి, కరోనా సోకిన వారితో సహజీవనం చేయాల్సిన వారికి పరీక్షలు చేయాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. కాగా, తమకు పరీక్షలు చేయాలంటూ రోజూ 2 వేల మందికి పైగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారని అంచనా. ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పరీక్షలు చేసేందుకు తమకు అనుమతి లేదంటూ ప్రైవేట్ వర్గాలు తిప్పి పంపడం, ప్రభుత్వ వర్గాలు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం, ఐసొలేషన్‌లో ఉండాలంటూ ఉచిత సలహాలు ఇస్తుండటంతో వారికి ఏం చేయాలో పాలు పోవట్లేదు.
వీరికి ఇలా.. వారికి అలా..
సామాన్యులను వెనక్కి పంపిస్తున్న ప్రభుత్వ వైద్య వర్గాలు.. పలుకుబడి ఉన్న వారికి మాత్రం అడిగిందే తడవుగా పరీక్షలు చేయడం మరిన్ని విమర్శలకు కారణం అవుతోంది. ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులకు ఒక విధానం, మాకు మరో విధానమా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో పరీక్షలు చేయడం సాధ్యం కాకపోయినా నిజంగా అవసరమైన వారిని వెనక్కి పంపొద్దని పలువురు కోరుతున్నారు. కరోనా వ్యాధిగ్రస్తులతో సహజీవనం చేయడం కన్నా.. తమకు వైరస్ ఉందో లేదో తెలియకుండా జీవించడం నరకాన్ని తలపిస్తోందని, కుటుంబసభ్యులతో మానసిక ప్రశాంతత ఉండకుండా పోతోందని వాపోతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే.
ప్రైవేటు ల్యాబ్స్‌కు అనుమతిస్తే సరి!
ప్రైవేటు ల్యాబ్స్‌లో కరోనా టెస్టులు చేసేందుకు ఐసీఎంఆర్ కొన్ని ల్యాబ్‌లకు అనుమతి ఇచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాటిల్లో టెస్టులకు అనుమతి ఇవ్వలేదు. ప్రైవేటు ల్యాబ్‌లకు అనుమతి ఇస్తే సమస్యలు వస్తాయని వాదిస్తోంది. ఇప్పటికే ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్స అనుమతించగా సమస్యలు వస్తున్నాయి. ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టానుసారంగా లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటం, కరోనా సోకిన వారితో సహజీవనం చేసే వారికి పరీక్షలు నిర్వహించేందుకు ప్రైవేటు ల్యాబ్స్‌కు పరీక్షలు చేసే అవకాశం ఇస్తేనే ఉపయోగమన్న వాదనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ప్రై వేటు ల్యాబ్‌లు పరీక్షలకు ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేయకుండా ప్రభుత్వమే ఓ విధానం రూపొందించి, దాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ పరీక్షలు నిర్వహించేలా అనుమతిస్తే ఉపయోగకరంగా ఉంటుందని, అనుమానం ఉన్నవారు పరీక్షలు చేయించుకునే అవకాశం ఉంటుందన్న వాదనలు ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment