కమ్యూనిస్టులకు ఆదర్శం కేవల్ కిషన్
* పోరాటయోధుడిని మరువని జనం
* 54 ఏళ్లుగా పోలంపల్లి శివారులో జాతర
* రేపు ఆయన వర్ధంతి
చిన్నశంకరంపేట: పేదల సంక్షేమం కోసం పరితపించిన పోరాట యోధుడు కేవల్ కిషన్ మరణించి నేటికి 54 ఏళ్లు. అయినా ఆయన జ్ఞాపకాలు జనం గుండెల్లో పదిలంగా ఉన్నాయి. డిసెంబర్ 26న ఆయన వర్ధంతి సందర్భంగా ప్రజలు ఆయనను స్మరించుకునేందుకు మరోసారి సిద్ధమవుతున్నారు. ఏటా పొలంపల్లి గ్రామశివారులో నిర్వహించే జాతరలో ఆయన సమాధి చుట్టూ స్థానికులు బండ్లు తిప్పి ఆయనను ఆరాధ్యదైవంగా కొలుస్తారు. ప్రజల కోసం మరణిస్తే వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారనడానికి కేవల్ కిషన్ నిలువెత్తు సాక్ష ్యం. 1922 మే 10న చిన్నశంకరంపేట మండలం తుర్కల మందాపూర్ గ్రామంలో కేవల్ నారాయణ, మున్నాబాయి దంపతులకు కేవల్ కిషన్ జన్మించారు.
మెదక్‌లో ఉంటూ విద్యభ్యాసం చేసిన ఆయన హైదరాబాద్‌లో బీఏ చదువుతూ టాపర్‌గా నిలిచారు. కమ్యూనిస్టు ఉద్యమకారులతో పరిచయాలు పెంచుకున్న ఆయన తన మార్గాన్ని ప్రజ ఉద్యమాలవైపు మళ్లించారు. మెదక్ ప్రాంతంలోని జమిందారుల ఆగడాలతో విసిగి వేసారిన పేదలను ఆయన ఒక్కటి చేసి ప్రజాపోరాటాలు నిర్మించారు. భూపోరాటాలతో నిజాం సర్కార్‌ను గడగడలాడించిన కేవల్ కిషన్, స్వాతంత్య్రం అనంతరం కూడా తనపంథాను మార్చుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతూనే కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో చురుకైన నాయకుడిగా పనిచేశారు.
దున్నేవాడికే భూమి అంటు పేదలకు భూములు పంచిపెట్టారు.అలాగే కార్మికుల కోసం అనేక పోరాటాలు చేశారు. పోరాటాల్లో భాగంగా గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను చైతన్యం చేస్తు పాలకులకు శత్రువుగా మారిన కేవల్ కిషన్‌ను అప్పటి పాలకులు రోడ్డు ప్రమాద రూపంలో హత్యచేశారని ప్రజలు నమ్ముతున్నారు. 1960 డిసెంబర్ 26న మాసాయిపేటలో కార్యకర్తల సమావేశం నిర్వహించిన తన సహచరుడు లక్ష్మయ్యతో కలిసి సైకిల్ మోటార్‌పై మెదక్ వస్తుండగా లారీతో ఢీకొట్టి ఆయనను అడ్డు తొలగించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఆయన కమ్యూనిస్టుగా దేవుడిని నమ్మేవారో లేదో కాని ఇక్కడి ప్రజలు మాత్రం ఆయన ప్రమాదానికి గురై తుది శ్వాస విడిచిన మెదక్‌చేగుంట ప్రధాన రహదారి పొలంపల్లి చౌరస్తాలో గుడి నిర్మించి ఆయన ప్రతిమకు పూజలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న ఇక్కడ జరిగే జాతరకు పరిసర ప్రాంత ప్రజలు హాజరై తమ నాయకుడిని స్మరించకుంటారు. పేదల కోసం సొంత ఆస్తులను పంచిపెట్టి ఆయన పలువురికి ఆదర్శంగా నిలిచారు.
దొరలు,జమిందారుల ఆగడాలను ఎదుర్కొని నిజాం నవాబుల పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఆయన చరిత్రను నేటికి పల్లే ప్రజలు పాటల రూపంలో పాడుకుంటారు.అప్పట్లో పుట్టిన బిడ్డలకు కిషన్, కిషనమ్మ అంటూ పేర్లు పెట్టుకొనేవారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో కేవల్ కిషన్ సతీమణి అనందబాయి మెదక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. విశాఖ ఉక్కుపరిశ్రమ కోసం తన పదవికి రాజీనామా చేసి భర్త దారిలోనే నడుస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీలు సీపీఎం, సీపీఐగా అవతరించినప్పటికీ వారు కేవల్ కిషన్‌ను ఆదర్శంగా తీసుకుంటారు. సంగారెడ్డిలో నిర్మించిన పార్టీ కార్యాలయాలకు కేవల్ కిషన్ భవన్‌గా నామకరణం చేసి గౌరవించారు.