సర్వే పూర్తయ్యాకే ప్రాణహిత నీటిపై నిర్ణయం
రంగారెడ్డికి నీరందించడంపై మంత్రి హరీశ్‌రావు వెల్లడి
‘పాలమూరు’ ద్వారా తక్కువ లిఫ్టులతో ఎక్కువ నీరిచ్చే అవకాశం
కాంగ్రెస్ హయాంలో ఎనిమిదేళ్లలో కేవలం రూ. 26 కోట్ల పనులే చేశారు
కాంగ్రెస్ నేతలపై మంత్రి ధ్వజం
హైదరాబాద్: ప్రస్తుతం గోదావరి నదిపై కొనసాగుతున్న లైడార్ సర్వే పూర్తయ్యాక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా రంగారెడ్డి జిల్లాకు నీటిని అందించే విషయమై తుది నిర్ణయం తీసుకుంటామని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. ప్రాణహితపై ప్రస్తుతం రీ ఇంజనీరింగ్ జరుగుతోందని, సమగ్ర నివేదిక వచ్చాకే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ప్రతిపాదిత తుమ్మిడిహెట్టి బ్యారేజీ నుంచి రంగారెడ్డి జిల్లా వరకు సుమారు 690 కిలోమీటర్ల దూరం ఉందని, ఐదు లిఫ్టులు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అయితే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుతో 130 కిలోమీటర్ల దూరంనుంచి మూడు లిఫ్టులతోనే ఎక్కువ ఆయకట్టుకు నీరు ఇవ్వొచ్చని హరీశ్‌రావు వెల్లడించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుండటంతోపాటు ప్రాణహిత నీటిని చేవెళ్ల వరకు అందించాలని ఆందోళనలకు దిగుతున్న నేపథ్యంలో మంత్రి హరీశ్‌రావు దీనిపై చర్చిం చేందుకు జిల్లాకు చెందిన మంత్రి మహేందర్‌రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలతో జలసౌధలోని నీటి పారుదల శాఖ కార్యాలయంలో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు యాదన్న, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డిలు ఈ సమావేశానికి హాజరయ్యారు. డిజైన్ మార్పునకు గల కారణాలనుఈ సందర్భంగా మంత్రి జిల్లా నేతలకు వివరించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, రంగారెడ్డి జిల్లాలో అదనపు ఆయకట్టుకు నీరిచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే, కాంగ్రెస్ నేతలు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ ఎనిమిదేళ్ల హయాంలో ఒక్క ఎకరమైనా భూసేకరణ చేయలేదు. జిల్లాలో ఉండే నాలుగు ప్యాకేజీల్లో రూ.4,200 కోట్లకు టెండర్లు పిలవగా కేవలం రూ.194 కోట్లను మాత్రమే ఖర్చు చేశారు. ఇందులోనూ పనులు చేసింది కేవలం రూ.26 కోట్లకే కాగా మిగతా మొత్తాలను మొబిలైజేషన్, సర్వేల పేరిట జేబుల్లో నింపుకున్నారు. ఎనిమిదేళ్లుగా ప్రాజెక్టును పట్టించుకోని సబితా ఇంద్రారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి వంటి నేతలకు ధర్నా చేసే నైతిక హక్కు లేదు’ అని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఆయకట్టుకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా 2.70 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా త్వరలోనే టెండర్లు పిలుస్తున్నామన్నారు.
‘మిషన్’ రెండో ఫేజ్ పనులకు సిద్ధం కండి
మిషన్ కాకతీయ రెండో ఫేజ్ పనులను వచ్చే జనవరి నుంచి ఆరంభించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని, అప్పటిలోగా చెరువుల టెండర్లు, అగ్రిమెంట్లు పూర్తి చేయాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆ శాఖ అధికారులకు సూచించారు. మిషన్ కాకతీయ పనులపై సోమవారం మంత్రి జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.