Laidar Survey
-
‘కాళేశ్వరం’ కోసం లైడార్ సర్వే
గణపురం : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సియానో కాంట్రాక్ట్ కంపెనీ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కోసం లైడార్ సర్వే చేపట్టింది. బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ హెలికాప్టర్ ద్వారా కాళేశ్వరం, దుమ్ముగూడెం, మేడిగడ్డ ప్రాంతాల్లో సర్వే చేయనుంది. ఈ మేరకు గురువారం సాయంత్రం హెలికాప్టర్ గురువారం సాయంత్రం చెల్పూరు శివారులోని కెటీపీపీలోని హెలిప్యాడ్‌లో దిగింది.హైదరాబాద్ నుంచి అధికారులు రావాల్సి ఉందని, శుక్రవారం సర్వే ఉంటుందని సమాచారం. ఆరు నెలల క్రితం కూడా ఇదే మాదిరిగా సర్వే చేశారు. -
సర్వే పూర్తయ్యాకే ప్రాణహిత నీటిపై నిర్ణయం
రంగారెడ్డికి నీరందించడంపై మంత్రి హరీశ్‌రావు వెల్లడి ‘పాలమూరు’ ద్వారా తక్కువ లిఫ్టులతో ఎక్కువ నీరిచ్చే అవకాశం కాంగ్రెస్ హయాంలో ఎనిమిదేళ్లలో కేవలం రూ. 26 కోట్ల పనులే చేశారు కాంగ్రెస్ నేతలపై మంత్రి ధ్వజం హైదరాబాద్: ప్రస్తుతం గోదావరి నదిపై కొనసాగుతున్న లైడార్ సర్వే పూర్తయ్యాక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా రంగారెడ్డి జిల్లాకు నీటిని అందించే విషయమై తుది నిర్ణయం తీసుకుంటామని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. ప్రాణహితపై ప్రస్తుతం రీ ఇంజనీరింగ్ జరుగుతోందని, సమగ్ర నివేదిక వచ్చాకే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ప్రతిపాదిత తుమ్మిడిహెట్టి బ్యారేజీ నుంచి రంగారెడ్డి జిల్లా వరకు సుమారు 690 కిలోమీటర్ల దూరం ఉందని, ఐదు లిఫ్టులు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అయితే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుతో 130 కిలోమీటర్ల దూరంనుంచి మూడు లిఫ్టులతోనే ఎక్కువ ఆయకట్టుకు నీరు ఇవ్వొచ్చని హరీశ్‌రావు వెల్లడించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుండటంతోపాటు ప్రాణహిత నీటిని చేవెళ్ల వరకు అందించాలని ఆందోళనలకు దిగుతున్న నేపథ్యంలో మంత్రి హరీశ్‌రావు దీనిపై చర్చిం చేందుకు జిల్లాకు చెందిన మంత్రి మహేందర్‌రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలతో జలసౌధలోని నీటి పారుదల శాఖ కార్యాలయంలో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు యాదన్న, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డిలు ఈ సమావేశానికి హాజరయ్యారు. డిజైన్ మార్పునకు గల కారణాలనుఈ సందర్భంగా మంత్రి జిల్లా నేతలకు వివరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, రంగారెడ్డి జిల్లాలో అదనపు ఆయకట్టుకు నీరిచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే, కాంగ్రెస్ నేతలు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ ఎనిమిదేళ్ల హయాంలో ఒక్క ఎకరమైనా భూసేకరణ చేయలేదు. జిల్లాలో ఉండే నాలుగు ప్యాకేజీల్లో రూ.4,200 కోట్లకు టెండర్లు పిలవగా కేవలం రూ.194 కోట్లను మాత్రమే ఖర్చు చేశారు. ఇందులోనూ పనులు చేసింది కేవలం రూ.26 కోట్లకే కాగా మిగతా మొత్తాలను మొబిలైజేషన్, సర్వేల పేరిట జేబుల్లో నింపుకున్నారు. ఎనిమిదేళ్లుగా ప్రాజెక్టును పట్టించుకోని సబితా ఇంద్రారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి వంటి నేతలకు ధర్నా చేసే నైతిక హక్కు లేదు’ అని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఆయకట్టుకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా 2.70 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా త్వరలోనే టెండర్లు పిలుస్తున్నామన్నారు. ‘మిషన్’ రెండో ఫేజ్ పనులకు సిద్ధం కండి మిషన్ కాకతీయ రెండో ఫేజ్ పనులను వచ్చే జనవరి నుంచి ఆరంభించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని, అప్పటిలోగా చెరువుల టెండర్లు, అగ్రిమెంట్లు పూర్తి చేయాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆ శాఖ అధికారులకు సూచించారు. మిషన్ కాకతీయ పనులపై సోమవారం మంత్రి జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. -
రెండేళ్లలో ప్రాణహిత తొలిదశ!
2017 ఖరీఫ్ నాటికి 2.50 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా కార్యాచరణ * కాళేశ్వరం నుంచి సిద్దిపేట వరకు పూర్తిచేసేలా ప్రణాళిక * కాళేశ్వరం-ఎల్లంపల్లి మధ్య సర్వే.. డిజైన్ పూర్తికాగానే పనుల ప్రారంభం * 2022లోగా మొత్తం ప్రాజెక్టును పూర్తిచేయాలనే లక్ష్యం * ఏటా రూ.4 వేల కోట్లపైన ఖర్చుచేస్తేనే పనుల పూర్తికి అవకాశం! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఏడు కరువు పీడిత జిల్లాలకు సాగు, తాగునీటి సదుపాయం కల్పించేందుకు ఉద్దేశించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు తొలిదశను రెండేళ్లలో పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా 2017 ఖరీఫ్ నాటికి రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కసరత్తు చేస్తోంది. మొత్తంగా 2022 నాటికి మొత్తం ప్రాజెక్టును పూర్తిచేసి... నిర్ణీత తాగు, సాగు లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికలను రూపొందిస్తోంది. ఇందుకోసం ఏటా బడ్జెట్లో రూ.4వేల కోట్లకు పైగా కేటాయించాలని భావిస్తోంది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు 2008లో అంకురార్పణ చేసిన విషయం తెలిసిందే. ప్రాణహితలో లభ్యతగా ఉండే 160 టీఎంసీల గోదావరి నీటితో సుమారు 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.38,500 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టగా... ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం పలు మార్పులు చేస్తోంది. ఈ ప్రాజెక్టును రెండు భాగాలుగా చేపడతామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. పాత డిజైన్ ప్రకారం ఉన్న తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి ఆదిలాబాద్ జిల్లా సాగు అవసరాలను తీరుస్తామని... కాళేశ్వరం దిగువన మేటిగడ్డ వద్ద మరో బ్యారేజీ నిర్మించి నీటిని ఎల్లంపల్లికి మళ్లించి దిగువ ప్రాంతాలకు నీటిని అందిస్తామని పేర్కొంది. మేటిగడ్డ-ఎల్లంపల్లి మధ్య పనులకు సంబంధించి మంగళవారం నుంచి ఆ ప్రాంతంలో లైడార్ సర్వే జరుగనుంది. ఈ ప్రక్రియను సెప్టెంబర్ చివరి నాటికి ముగించి డిజైన్‌కు తుదిరూపు ఇవ్వాలని భావిస్తోంది. డిజైన్ పూర్తవగానే ఇక్కడి పనులకు శ్రీకారం చుట్టనుంది. అప్పటివరకు వేగంగా ఎల్లంపల్లి దిగువ పనులను పూర్తిచేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలిచ్చింది కూడా. అయితే కొత్త డిజైన్‌తో అదనపు వ్యయం కలిపితే ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.44 వేల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు ప్రాజెక్టుకు రూ.9,290 కోట్ల మేర ఖర్చు జరిగింది. ఈ లెక్కన మరో రూ.35 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ ఏడాది బడ్జెట్లో రూ.1,515 కోట్లు కేటాయించగా.. ఇప్పటివరకు రూ.519.26 కోట్లు ఖర్చు చేశారు. కానీ ఈ ఖర్చంతా పాత బకాయిల చెల్లింపునకు వెచ్చించినవే. ఇకముందు అనుకున్న మేర లక్ష్యాలను చేరాలంటే ఏటా రూ.నాలుగైదు వేల కోట్ల వరకు వెచ్చించాల్సిందే. దీంతో నిధుల సమీకరణకు సర్కారు కసరత్తు చేస్తోంది. సిద్దిపేట వరకు తొలిదశ కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లి వరకు డిజైన్ పూర్తయిన వెంటనే పనులను మొదలుపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. నీటిని మేటిగడ్డ బ్యారేజీ నుంచి ఎల్లంపల్లికి, అక్కడి నుంచి మిడ్‌మానేరు మీదుగా సిద్దిపేటలో నిర్మిస్తున్న తడ్కపల్లి రిజర్వాయర్ వరకు తీసుకురావాలనేది తొలిదశ ప్రణాళికగా చెబుతున్నారు. ఈ తొలిదశ పరిధిలో ఉండే సుమారు 2.50 లక్షల ఎకరాలకు 2017 ఖరీఫ్ నాటికి నీరందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. రెండో దశలో 2018-19 నాటికి మరో నాలుగు లక్షల ఎకరాలు, 2022 నాటికి పూర్తిలక్ష్యాన్ని చేరుకునేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది.