రెండేళ్లలో ప్రాణహిత తొలిదశ! | Two years In Pranahitha First Step! | Sakshi
Sakshi News home page

రెండేళ్లలో ప్రాణహిత తొలిదశ!

Published Tue, Sep 1 2015 1:45 AM | Last Updated on Sun, Sep 3 2017 8:29 AM

రెండేళ్లలో ప్రాణహిత తొలిదశ!

రెండేళ్లలో ప్రాణహిత తొలిదశ!

2017 ఖరీఫ్ నాటికి 2.50 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా కార్యాచరణ
* కాళేశ్వరం నుంచి సిద్దిపేట వరకు పూర్తిచేసేలా ప్రణాళిక
* కాళేశ్వరం-ఎల్లంపల్లి మధ్య సర్వే.. డిజైన్ పూర్తికాగానే పనుల ప్రారంభం
* 2022లోగా మొత్తం ప్రాజెక్టును పూర్తిచేయాలనే లక్ష్యం
* ఏటా రూ.4 వేల కోట్లపైన ఖర్చుచేస్తేనే పనుల పూర్తికి అవకాశం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఏడు కరువు పీడిత జిల్లాలకు సాగు, తాగునీటి సదుపాయం కల్పించేందుకు ఉద్దేశించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు తొలిదశను రెండేళ్లలో పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

తద్వారా 2017 ఖరీఫ్ నాటికి రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కసరత్తు చేస్తోంది. మొత్తంగా 2022 నాటికి మొత్తం ప్రాజెక్టును పూర్తిచేసి... నిర్ణీత తాగు, సాగు లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికలను రూపొందిస్తోంది. ఇందుకోసం ఏటా బడ్జెట్‌లో రూ.4వేల కోట్లకు పైగా కేటాయించాలని భావిస్తోంది.
 
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు 2008లో అంకురార్పణ చేసిన విషయం తెలిసిందే. ప్రాణహితలో లభ్యతగా ఉండే 160 టీఎంసీల గోదావరి నీటితో సుమారు 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.38,500 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టగా... ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రభుత్వం పలు మార్పులు చేస్తోంది. ఈ ప్రాజెక్టును రెండు భాగాలుగా చేపడతామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. పాత డిజైన్ ప్రకారం ఉన్న తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి ఆదిలాబాద్ జిల్లా సాగు అవసరాలను తీరుస్తామని... కాళేశ్వరం దిగువన మేటిగడ్డ వద్ద మరో బ్యారేజీ నిర్మించి నీటిని ఎల్లంపల్లికి మళ్లించి దిగువ ప్రాంతాలకు నీటిని అందిస్తామని పేర్కొంది.

మేటిగడ్డ-ఎల్లంపల్లి మధ్య పనులకు సంబంధించి మంగళవారం నుంచి ఆ ప్రాంతంలో లైడార్ సర్వే జరుగనుంది. ఈ ప్రక్రియను సెప్టెంబర్ చివరి నాటికి ముగించి డిజైన్‌కు తుదిరూపు ఇవ్వాలని భావిస్తోంది. డిజైన్ పూర్తవగానే ఇక్కడి పనులకు శ్రీకారం చుట్టనుంది. అప్పటివరకు వేగంగా ఎల్లంపల్లి దిగువ పనులను పూర్తిచేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలిచ్చింది కూడా. అయితే కొత్త డిజైన్‌తో అదనపు వ్యయం కలిపితే ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.44 వేల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.

ఇప్పటి వరకు ప్రాజెక్టుకు రూ.9,290 కోట్ల మేర ఖర్చు జరిగింది. ఈ లెక్కన మరో రూ.35 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.1,515 కోట్లు కేటాయించగా.. ఇప్పటివరకు రూ.519.26 కోట్లు ఖర్చు చేశారు. కానీ ఈ ఖర్చంతా పాత బకాయిల చెల్లింపునకు వెచ్చించినవే. ఇకముందు అనుకున్న మేర లక్ష్యాలను చేరాలంటే ఏటా రూ.నాలుగైదు వేల కోట్ల వరకు వెచ్చించాల్సిందే. దీంతో నిధుల సమీకరణకు సర్కారు కసరత్తు చేస్తోంది.
 
సిద్దిపేట వరకు తొలిదశ
కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లి వరకు డిజైన్ పూర్తయిన వెంటనే పనులను మొదలుపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. నీటిని మేటిగడ్డ బ్యారేజీ నుంచి ఎల్లంపల్లికి, అక్కడి నుంచి మిడ్‌మానేరు మీదుగా సిద్దిపేటలో నిర్మిస్తున్న తడ్కపల్లి రిజర్వాయర్ వరకు తీసుకురావాలనేది తొలిదశ ప్రణాళికగా చెబుతున్నారు. ఈ తొలిదశ పరిధిలో ఉండే సుమారు 2.50 లక్షల ఎకరాలకు 2017 ఖరీఫ్ నాటికి నీరందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. రెండో దశలో 2018-19 నాటికి మరో నాలుగు లక్షల ఎకరాలు, 2022 నాటికి పూర్తిలక్ష్యాన్ని చేరుకునేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement