సాక్షి, మంచిర్యాల : నిరుద్యోగులు, ఉన్నత చదువులకు నోచుకోని యువతకు ఆసరాగా నిలవాలనే యోచనతో గత సర్కారు ప్రవేశపెట్టిన రాజీవ్ యువకిరణాల పథకం మనుగడపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎన్నికల ముందు ప్రారంభమైన ఈ పరిస్థితిపై ఇప్పటికీ స్పష్టత లేదు. తాజాగా తెలంగాణ సర్కారు ఈ పథకాన్ని కొనసాగిస్తుందో లేదో అనే సందేహాలు ఆశావహుల్లో వ్యక్తమవుతున్నాయి.
ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్(ఈజీఎంఎం), జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఏ), మెప్మా, ఉపాధి కల్పన, సాంకేతిక విద్యాశాఖ, మైనార్టీ వెల్ఫేర్ ద్వారా నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడంతోపాటు ఉపాధి చూపించే వారు. 2011లో నాటి ఆంధ్రప్రదేశ్ సీఎం కిరణ్ ‘రాజీవ్ యువకిరణాలు’ పథకాన్ని ఏర్పాటు చేస్తూ అందులో ఈజీఎంఎంను విలీనం చేశారు. మిగతా శాఖలను యువకిరణాలతో అనుసంధానం చేశారు. ఈ పథకం కింద మార్కెటింగ్, కంప్యూటర్ పరిజ్ఞానం వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చారు.
జిల్లాలో దాదాపు 40 శిక్షణా సంస్థలు సుమారు 8,300 మంది వరకు అర్హులకు ఈ పథకం కింద శిక్షణ అందజే శారు. ఒక్కో అభ్యర్థి శిక్షణకు సంస్థలకు రూ.3వేలు చెల్లించింది. ఇందులో డిగ్రీ స్థాయివారు నామమాత్రంగా ఉండగా పదో తరగతి, ఇంటర్ పూర్తి చేసిన వారే ఎక్కువగా ఉన్నారు. వీరిని పలు సంస్థలు వారిని ప్రారంభస్థాయి(ఎంట్రీ లెవల్) ఉద్యోగాల్లోకి తీసుకున్నాయి. అయితే ఈ ఉద్యోగులకు మూడు నుంచి నాలుగు వేల రూపాయలు మాత్రమే వేతనంగా చెల్లించేవారు. దీంతో ఈ ఉద్యోగాల్లోకి వెళ్లేందుకు యువతీ, యువకులు ఆసక్తి చూపించలేదు.
ఆది నుంచి గందరగోళమే..
యువకిరణాల పథకంలో శిక్షణ సమయం మొదలుకొని అభ్యర్థులకు ఉద్యోగాాలు కల్పించిన కంపెనీలు చెల్లించే వేతనం వరకు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. శిక్షణ కోసం అనుమతి పొందిన పలు కేంద్రాలు పూర్తి స్థాయిలో ఆయా సామర్థ్యాలను అభ్యర్థులకు నేర్పించకపోవడం, తప్పుడు వివరాలు సమర్పిస్తూ బిల్లులు పొందడం, ఉపాధి కల్పనకు వివిధ కంపెనీలతో మాట్లాడి ఉపాధి కల్పించకపోవడం, ఉద్యోగాలు కల్పించిన సంస్థల్లో వేతనాలు సరిపడా లేకపోవడం అనే అపప్రదను మూటగట్టుకున్నాయి.
మరోవైపు పనిగంటలు అధికంగా ఉన్నాయని, ఉద్యోగం ఇచ్చే సమయంలో తమకు చెప్పిన పని ఒకటైతే.. ప్రస్తుతం చేయిస్తున్నది మరోటని పలువురు ఆరోపించడం, అరకొర వేతనాలతో కష్టం అవుతోందని పేర్కొంటూ ఉద్యోగాలు వదిలివెళ్లిన ఉదంతాలు ఉన్నాయి. ఈ విధంగా వెనక్కువెళ్లిపోయిన వారు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నారు. మరోవైపు నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చిన కొన్ని సంస్థలకు ఇప్పటికీ సంబంధిత బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆయా సంస్థల ద్వారా శిక్షణ అందజేయడాన్ని నిలిపివేశారు. అదే సమయంలో బిల్లులు చెల్లించడం నిలిచింది. అయితే ఒప్పందం మేరకు వ్యవహరించనందుకే కొన్ని సంస్థల బిల్లుల చెల్లింపు నిలిపివేశామని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
త ్వరలో స్పష్టత?
ఉమ్మడి రాష్ట్రంలో అమలవుతున్న పథకాలపై సమీక్ష నిర్వహిస్తున్న తెలంగాణ సర్కారు ఇటీవల రాజీవ్ యువ కిరణాలపై దృష్టిసారించింది. ఈ పథకం నిర్వహణపై ఉపాధికల్పన శాఖ ఆధ్వర్యంలో ఇటీవల రాజధానిలో ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్హులకు శిక్షణ ఇచ్చేందుకు శిక్షణా సంస్థలతో చేసుకున్న ఒప్పందం 2015 వరకు ఉన్న విషయం ఈ సందర్భంగా చర్చకొచ్చింది. ఇదే విషయాన్ని తెలంగాణ సర్కారుకు తెలియజేయాలని అధికారులు భావిస్తున్నారు. కొత్త పరిశ్రమలు రానున్న నేపథ్యంలో అర్హులను తీర్చిదిద్దేందుకు ఈ పథకాన్ని పరిశీలించాలని సూచించినట్లు సమాచారం.
కిరణాలేవీ!
Published Thu, Aug 14 2014 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 11:50 AM
Advertisement