సాక్షి, మహబూబ్‌నగర్: కాంగ్రెస్ శ్రేణులు కన్నెర్రచేశాయి. సచివాలయం, ఛాతీ ఆస్పత్రిని తరలింపునకు నిరసనగా పీసీసీ ఆధ్వర్యంలో గాంధీభవన్ నుంచి చేపట్టిన ర్యాలీని అడ్డుకోవడం పట్ల ప్రభుత్వ తీరును ఖండిస్తూ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆదివారం జిల్లావ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు జిల్లాకేంద్రంలోని పాలమూరు చౌరస్తాలో కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు.
డీసీసీ అధ్యక్షుడు ఓబేదుల్లా కొత్వాల్, మునిసిపల్ చైర్‌పర్సన్ రాధాఅమర్, ముత్యాలప్రకాష్ తదితర ముఖ్యనేతలు పాల్గొన్నారు. నాగర్‌కర్నూల్‌లో నగర పంచాయతీ చైర్మన్ వంగ మోహన్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు మణెమ్మతోపాటు 30 మంది కార్యకర్తలు నిరసనలో పాల్గొన్నారు. తిమ్మాజిపేట మండలంలో పార్టీ శ్రేణులు నిరసన తెలిపాయి. గద్వాలలో కాంగ్రెస్ నేతలు డీకే బంగ్లా నుంచి ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానిక వైఎస్‌ఆర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మునిసిపల్ చైర్‌పర్సన్ పద్మావతి, వైస్ చైర్మన్ శంకర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సలాం ప్రభుత్వ పాలనాతీరుపై నిప్పులు చెరిగారు. మక్తల్ నియోజకవర్గంలో మక్తల్, ఆత్మకూరులో ఆందోళనలు జరిగాయి.
సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. వనపర్తి పట్టణంలోని రాజీవ్‌చౌక్‌లో కాంగ్రెస్ నేతలు రాస్తారోకో నిర్వహించారు. పెద్దమందడిలో పార్టీ మండలాధ్యక్షుడు ఐ.సత్యారెడ్డి నేతృత్వంలో ధర్నా చేపట్టారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ, ఆమనగల్లు మండల కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. షాద్‌నగర్ పట్టణ ముఖ్యకూడల్లతో పాటు కొత్తూరు మండల కేంద్రంలో ఆ పార్టీ శ్రేణులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. అచ్చంపేటలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ నేతృత్వంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. కొడంగల్ నియోజకవర్గం కోస్గి, మద్దూరు, బొంరాస్‌పేట మండలాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకోలు చేపట్టారు. కొల్లాపూర్‌లో కొందరు నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. దేవరకద్రలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి డోకూరు పవన్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ధర్నా నిర్వహించారు.
కాంగ్రెస్ కన్నెర్ర
Published Mon, Feb 9 2015 2:55 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement