హైదరాబాద్: పొన్నాల అరెస్టును నిరసిస్తూ రాష్ర్టవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. పలు నియోజకవర్గ కేంద్రాల్లో ఆదివారం కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్న నిరసిస్తూ పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో శనివారం గాంధీభవన్ నుంచి రాజ్‌భవన్ వరకు ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ర్యాలీకి అనుమతిలేదని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు గాయలైన విషయం తెలిసిందే. ఈ స్థితిలో ఉన్న ఆయన్ను పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ.. శనివారమే తెలంగాణ శాసనసభ ప్రతిపక్షనేత కుందూరు జానారెడ్డి గోషా మహల్ పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేయగా.. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిజామాబాద్, అదిలాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని ప్రధాన పట్టణాలలో రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు.