సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంలో రాజ్యాంగ నిబంధనలకు లోబడి తప్పనిసరిగా మంత్రివర్గ విస్తరణ జరగాలని, రాజ్యాంగ పరిరక్షుడిగా కనీసం 12 మంది మంత్రులు నియమితులయ్యేలా చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్‌కుమార్ రాష్ట్ర గవర్నర్‌ను కోరారు. ఈ మేరకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు మంగళవారం ఆయన లేఖ రాశారు. ప్రభుత్వంలో సీఎంతో కలిపి 15 శాతం మంది కన్నా మంత్రులు ఎక్కువ ఉండరాదని, 12 శాతం కన్నా తక్కువ ఉండొద్దని రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(1ఏ) చెబుతోందని, ఆర్టికల్ 163(1) ప్రకారం ముఖ్యమంత్రిసహా మంత్రులంతా గవర్నర్ విధులకు సహాయంగా ఉండడంతోపాటు సలహాలివ్వాలని స్పష్టంగా ఉందని, అయినా సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని బే«ఖాతరు చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణలో మొత్తంం 33 శాఖలు, 298 ఆర్గనైజేషన్లు ఉన్నాయని, అయినా సీఎంకు తోడు కేవలం ఒక్కమంత్రి మాత్రమే ప్రమాణం చేశారని, ఆయనకు కూడా నాలుగు శాఖలే కేటాయించారని తెలిపారు. 33 శాఖల్లోంచి సమాచారం తెప్పించుకోవడం, సమీక్షలు జరపడం కేవలం ముఖ్యమంత్రి, హోంమంత్రి వల్ల కాదని తెలిపారు. 2014 తర్వాత ఐదేళ్లపాటు సుస్థిరపాలన కొనసాగుతుందని భావించి ప్రజలు నమ్మకంతో ఓట్లేసి టీఆర్‌ఎస్‌కు పట్టం కడితే అకస్మాత్తుగా ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో 9 నెలల పాలన కుంటుపడిందని, ఇప్పుడు పంచాయతీ, తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీలు, ఆ తర్వాత ఎంపీ ఎన్నికలు, అనంతరం మున్సిపల్ ఎన్నికలు.. ఇలా ఏడాదంతా ఎన్నికల కోడ్ అమల్లో ఉండే పరిస్థితుల్లో కనీసస్థాయిలో మంత్రులు లేకుండా పాలన ఎలా జరుగుతుందని ఆ లేఖలో ప్రశ్నించారు. రాజ్యాంగ పరిరక్షకుడిగా వెంటనే స్పందించి రాష్ట్రంలో కనీసం 12 మంది మంత్రుల నియామకం జరిగేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆయన ఆ లేఖలో గవర్నర్‌ను కోరారు.
గవర్నర్ వత్తాసు పలుకుతున్నారు...
ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతుంటే రాష్ట్ర గవర్నర్ వాటికి వత్తాసు పలుకుతున్నారని శ్రవణ్ ఆరోపించారు. మంగళవారం గాంధీభవన్‌లో పార్టీ అధికార ప్రతినిధులు చరణ్‌కౌశిక్ యాదవ్, నిజాముద్దీన్ కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. శాసనభలో గవర్నర్ ప్రసంగం ప్రజల మనోభావాలకు అనుగుణంగా లేదని, ప్రభుత్వం ఏది చెబితే అదే వేదంగా నడుచుకుంటున్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ చెప్పినట్టు చేయడం, వారికి కొమ్ముకాయడం గవర్నర్ వ్యవస్థను దిగజారుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను విడవకుండా 1,000 సర్పంచ్ స్థానాలను గెలిపించిన నాయకులు, కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలిపారు. ఆర్థిక, అంగబలాలతో ప్రభుత్వం బెదిరించినా పెద్ద ఎత్తున సర్పంచ్ స్థానాలు గెలుచుకోవడం చూస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ అర్థమవుతుందన్నారు. ఈవీఎంల హ్యాకింగ్ నిజమేనని నిపుణులు తేల్చిన నేపథ్యంలో వచ్చే ఎన్నికను బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment