సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులపై అధికార టీఆర్‌ఎస్ పార్టీ నేతలు పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలో మూడు మార్కెట్ కమిటీలకు పాత పాలక వర్గాన్నే కొనసాగిస్తూ మార్కెటింగ్ శాఖ కమిషనరేట్ నుంచి మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
బోథ్, ఆసిఫాబాద్, ఇచ్చోడ మార్కెట్ కమిటీలకు గతంలో చైర్మన్లుగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఎం.సత్యనారాయణ, ఎండీ మునీర్ అహ్మద్, జి.తిరుమలగౌడ్‌కు బాధ్యతలు అప్పగించాలని ఆయా కమిటీల పర్సన్ ఇన్‌చార్జీలకు ఆదేశాలందాయి. ప్రస్తుతం బోథ్, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీలకు పర్సన్ ఇన్‌చార్జిగా వరంగల్ డిప్యూటీ డెరైక్టర్, ఇచ్చోడ మార్కెట్ కమిటీ పర్సన్ ఇన్‌చార్జిగా ఆదిలాబాద్ అసిస్టెంట్ డెరైక్టర్ కొనసాగుతున్నారు. తాజా ఉత్తర్వుల మేరకు పాత చైర్మన్లకు మార్కెట్ కమిటీ బాధ్యతలు అప్పగించనున్నారు.
రెండు రోజుల్లో ఈ మార్కెట్ కమిటీలు కాంగ్రెస్ నేతలతో కూడిన పాలకవర్గం కొలువుదీరనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 11 మార్కెట్ కమిటీలకు పాత పాలకవర్గాలనే పునరుద్ధరించారు. ఇందులో భాగంగా జిల్లాలో ఈ మూడు మార్కెట్ కమిటీలు ఉన్నాయి.
మరో పది మార్కెట్ కమిటీలు కూడా..
గత ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ సర్కారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మార్కెట్ కమిటీల పాలకవర్గాలను రద్దు చేస్తూ ఆగస్టు మాసంలో ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇందులో భాగంగా జిల్లాలోని 14 మార్కెట్ కమిటీల పాలకవర్గాలు రద్దయ్యాయి. మొదటగా బోథ్, ఆసిఫాబాద్, ఇచ్చోడ మార్కెట్ కమిటీల చైర్మన్లు కోర్టును ఆశ్రయించారు.
వీరి అభ్యర్థనను పరిశీలించిన కోర్టు ఈ మేరకు ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేసింది. ఈ ముగ్గురితోపాటు మరో ఐదు మార్కెట్ కమిటీల చైర్మన్లు కూడా ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. మిగిలిన ఐదు మార్కెట్ కమిటీల చైర్మన్లు కూడా కోర్టును ఆశ్రయించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో మొత్తం 17 మార్కెట్ కమిటీలు ఉండగా, నాలుగు కమిటీలు ఖాళీగా ఉండేవి.
టీఆర్‌ఎస్ నేతల ఆశలు గల్లంతు..
ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులపై టీఆర్‌ఎస్ పార్టీ నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయా నియోజకవర్గాలకు చెందిన ద్వితీయ శ్రేణి నేతలు ఈ పదవుల కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు పదవులను కేటాయించేలా చూడాలని స్థానిక ఎమ్మెల్యేలపై అన్ని రకాలుగా ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఈ మార్కెట్ కమిటీ పాలకవర్గాలను భర్తీ చేసేందుకు గతంలో పెద్ద ఎత్తున కసరత్తు చేసింది.
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ పాలకవర్గాల నియామకాల్లో రిజర్వేషన్లను కూడా అమలు చేయాలని భావించింది. దీంతో ఆయా సామాజిక వర్గాల నేతలు ఈ పదవులను ఆశించారు. తీరా ఇప్పుడు పాత పాలకవర్గాలనే కొనసాగిస్తూ ఆదేశాలు జారీ కావడంతో ఈ నేతల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు దక్కాలంటే పాత చైర్మన్‌ల పదవి కాలం ముగిసేవరకు వేచి ఉండక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పాత వారికే పగ్గాలు
Published Thu, Nov 27 2014 2:50 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement