సాక్షి, హైదరాబాద్ : తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్ట్ చేపడితే.. ఈపాటికే ప్రజలకు ప్రాణహిత నీరు అందేదన్నారు కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 148 మీటర్ల ఎత్తుతో బ్యారజ్ నిర్మాణం చేపడితే.. రూ. 2 వేల కోట్లతో ప్రాజెక్ట్ పూర్తయ్యేదని పేర్కొన్నారు. మేడిగడ్డ వద్ద ఎంత ప్రవాహం ఉందో తుమ్మిడిహట్టి వద్ద కూడా అంతే ప్రవాహం ఉందని.. అదనంగా ఒక్క క్యూసెక్ కూడా లేదన్నారు.
ఎల్లంపల్లి బ్యారేజ్ ఇప్పటికే పూర్తయ్యిందని.. కాలువలు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు జీవన్ రెడ్డి. తుమ్మిడిహట్టి బ్యారేజ్ పూర్తయితే.. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వినియోగంలోకి వచ్చేదని పేర్కొన్నారు. అదే జరిగితే రూ. 38 వేల కోట్లతో 16.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందేదని తెలిపారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం కేవలం 1.40 లక్షల ఎకరాల ఆయకట్టు కోసం అదనంగా రూ. 45 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపుతుందని ఆరోపించారు. తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్ల వరకు నీటిని తరలించే సర్వే ఏమైందని ప్రశ్నించారు. మెడిగడ్డ, అన్నారం లిఫ్ట్‌ల భారం ప్రజలపై పడుతుందని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment