'వైఎస్ఆర్ చొరవతోనే హైదరాబాద్‌కు గోదావరి జలాలు' | Congress leaders perform special puja for Godavari water | Sakshi
Sakshi News home page

'వైఎస్ఆర్ చొరవతోనే హైదరాబాద్‌కు గోదావరి జలాలు'

Published Sat, Nov 28 2015 7:54 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

Congress leaders perform special puja for Godavari water

మేడ్చల్ (రంగారెడ్డి జిల్లా) : దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కలల పండి నేడు నగరానికి గోదావరి జలాలు వస్తున్నాయని మాజీ హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని ఘనాపూర్ క్షేత్రగిరిపై గోదావరి జలాలకు శనివారం జిల్లా కాంగ్రెస్ నాయకులు పూజలు నిర్వహించారు. పైప్‌లైన్,సంపుల పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కోటి 40లక్షల జనాభా గల హైద్రాబాద్ నగరంలో నగరవాసులు త్రాగడానికి నీరు సరిపోక ఇబ్బందులు పడుతుంటే నాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ దూరదృష్టితో నగర వాసుల దాహార్తి తీర్చడానికి తాను చేపట్టిన సుజల స్రవంతి పథకమే నేటి గోదావరి జలాలన్నారు.

2008 సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి దివంగతనేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూ.3720 కోట్ల వ్యయాన్ని వెచ్చించి 2009 సంవత్సరంలో సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారని అన్నారు. మరోవైపు క్రిష్ణా ఫేజ్-2 కొరకు వెయ్యి కోట్లు వెచ్చించి నగరానికి కొంతమేర నీటిని తీసుకొచ్చినప్పటికి గోదావరి జలాలు నగరానికి వస్తేనే నగరవాసులకు పూర్తి స్థాయిలో నీరు అందించగలమని, రాబోయే కాలంలో నీటి ఇబ్బందులు పూర్తిగా తీరుతాయని భావించి కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేపట్టిందన్నారు. తర్వాత ముఖ్యమంత్రులుగా ఉన్న రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు సైతం ఆ దిశగా అడుగులు వేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో రాష్ట్రంలోని ప్రజలకు మేలు చేసేందకు ఎన్నో శాశ్వత పథకాలు ప్రవేశపెట్టామని అందుకు నిదర్శనమే గోదావరి జలాలు అన్నారు.

సుజల స్రవంతి పథకం 90 శాతం పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పూర్తి అయ్యాయని టీఆర్‌ఎస్ ప్రభుత్వం 10శాతం పనులు చేసి తామే నగరవాసుల దాహార్తిని తీరుస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ నగర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. గోదావరి జలాలు నగరానికి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని టీఆర్‌ఎస్ ప్రభుత్వం చెప్పగలదా అని ప్రశ్నించారు. నగరంలోనూ తాము చేపట్టిన అభివృద్ది పనులనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు తాము చేసినట్టు చెప్పుకుంటుందని, కేవలం రానున్న గ్రేటర్ ఎన్నికల కోసమే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పథకాలకు, అభివృద్ది పనులకు తమ పేరు చేర్చుకుని గొప్పలు చెప్పుకుంటుందని ఆమె మండిపడ్డారు.

క్షేత్రగిరిపై గోదావరి జలాలకు కాంగ్రెస్ నేతల పూజలు

ఘనాపూర్ క్షేత్రగిరిపై గోదావరి జలాల సంపు వద్ద శనివారం జిల్లా కాంగ్రెస్ నాయకులు గోదావరి జలాలకు పూజలు నిర్వహించారు.సర్వమత ఆచారాల్లో పూజలు చేశారు.అంతకుముందు క్షేత్రగిరి వేంకటేశ్వర స్వామి దర్శనము చేసుకుని పూజల్లో పాల్గొన్నారు.కాంగ్రెస్ నాయకుల పూజల సందర్బంగా క్షేత్రగిరిపై దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి పథకాలతో కూడిన ఫ్లెక్సీలను నాయకులు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలంగౌడ్, భిక్షపతి యాదవ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు నందికంటి శ్రీధర్, ఉద్దమర్రి నర్సింహా రెడ్డి, లక్ష్మారెడ్డి, అనిల్, రవియాదవ్, శామీర్‌పేట జెడ్పీటీసి బాలేశ్, మేడ్చల్ మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు భవాని, మేడ్చల్, శామీర్‌పేట మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వరదారెడ్డి, క్రిష్టారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement