జగిత్యాల: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అగ్రికల్చర్ లీడర్‌షిప్–2017 కేంద్ర పురస్కారం వరించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని సీఎల్పీ ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. ఆదివారం జగిత్యాలలో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో పెట్టుబడులు లేక పంటలకు గిట్టుబాటు ధర లభించక, పంట రుణాలు అందక, రుణ మాఫీ జరగక వ్యవసాయ రంగం కుదేలైందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ సీఎం కేసీఆర్‌ను కేంద్ర పురస్కారానికి ఎంపిక చేయడాన్ని పరిశీలిస్తే దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కేంద్ర వ్యవసాయ విధానం అమలు తీరు ఎలా ఉందో అర్థమవుతోందని విమర్శించారు.
సాగుకు పెట్టుబడులు, పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం ప్రధానాంశాలని, పంటకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ఒకవేళ గిట్టుబాటు ధర తక్కువగా ఉంటే బోనస్ ప్రకటించి ఆ వ్యత్యాసాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదన్నారు. వరికి క్వింటాల్‌కు రూ.3వేలు కల్పించాలని, పప్పు దినుసులు, పసుపు, మిర్చి పంటలకు రూ.10వేల గిట్టుబాటు ధర కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం పరిగణనలోకి తీసుకోకపోవడం బాధాకరమన్నారు.
ఖరీఫ్ ప్రారంభమై రెండున్నర నెలలు పూర్తవుతున్నా ఇప్పటికీ 30శాతానికి మించి రైతులకు పంట రుణం అందలేదన్నారు. నాడు రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. 2004–2009 వరకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో వ్యవసాయ రంగం స్వర్ణయుగాన్ని తలపించిందన్నారు. రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు, సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు రూ.5వేల ప్రోత్సాహకం, పప్పుదినుసులకు రూ.200, వరికి రూ.50 బోనస్ కల్పించి రైతులకు భరోసా ఇచ్చారని జీవన్‌రెడ్డి చెప్పారు.
వైఎస్ హయాం స్వర్ణయుగం: జీవన్‌రెడ్డి
Published Sun, Aug 20 2017 8:24 PM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM
Advertisement