
మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి
సాక్షి, కొడంగల్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వంద స్థానాల్లో గెలుస్తుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కొడంగల్ ప్రజల ఆత్మగౌరవం కోసం తాను పోరాటం చేస్తున్నానని అన్నారు. బుధవారం పట్టణంలోని తన నివాసంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తల స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొడంగల్‌లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 30 వేల మెజారిటీతో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జనం తమవైపే ఉన్నారని పేర్కొన్నారు. అధికార పార్టీ దౌర్జాన్యాలకు ఎండగట్టాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కొడంగల్ ప్రజలు తనపై అపార నమ్మకం ఉంచారని, వారి నమ్మకాన్ని ఏనాడు వమ్ము చేయలేదన్నారు. మహాకూటమి వల్ల లాభమే తప్ప నష్టం లేదని తెలిపారు. అధికార పార్టీ నాయకులు డబ్బులతో ఓటర్లను కొనలేరని పేర్కొన్నారు. కొడంగల్ ప్రజల ఆత్మగౌరవమే తనకు ముఖ్యమన్నారు.
డాక్టర్ వైఎస్‌ఆర్‌కు పులివెందుల, చంద్రబాబుకు కుప్పం ఎలాగో తనకు కొడంగల్ నియోజకవర్గం అలాగేనని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి తెలియజేశారు. 2009లో 7 వేల మెజారిటీ, 2014లో 15 వేల మెజారిటీ వచ్చిందన్నారు. డిసెంబర్ 7వ తేదీ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. తాను కొడంగల్‌లో పర్యటించడం లేదని కార్యకర్తలు, నాయకులు బాధపడొద్దని హితవు పలికారు. రాష్ట్రంలో పర్యటించి అత్యధిక స్థానాలు సాధించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. కొడంగల్‌లోని 100 గ్రామాల్లో పర్యటించాలో.. లేకపోతే రాష్ట్రంలోని వంద నియోజకవర్గాల్లో పర్యటించాలో మీరే చెప్పండని ప్రజలను కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని టీఆర్‌ఎస్‌కు ఓట్లు ఎందుకు వేయాలని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. దళితులకు 3 ఎకరాల భూపంపిణీ ఏదని అడిగారు. టీఆర్‌ఎస్ ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇవ్వలేదని తెలిపారు. ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్లు అమలు చేయలేదని అన్నారు. సకల జనులు పోరాడితేనే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్ హయాంలో 5వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు.
గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొడంగల్ పౌరుషాన్ని వినిపించే గొంతు కావాలా.. కేసీఆర్ దొడ్లో పశువు కావాలో ప్రజలు ఆలోచించాలని కోరారు. కొడంగల్ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌కు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. 19న నామినేషన్ వేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఇంటి నుంచి ఇద్దరు చొప్పున నియోజకవర్గం నుంచి 50వేల మంది తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల బలం.. బలగం ఏంటో చూపించాలని కోరారు. మహాకూటమికి 100 సీట్లు వస్తాయని, తాము అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ఏపూరు కృష్ణారెడ్డి, శ్రీరాంరెడ్డి, శివరాజ్, విజయకుమార్, మహ్మద్‌యూసూఫ్, నందారం ప్రశాంత్, వెంకట్రాములు గౌడ్, వెంకట్‌రెడ్డి, సుభాష్‌నాయక్, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.