గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ బలంగా ఉందని 2019 ఎన్నికల్లో విజయం ఖాయమని మాజీ పార్లమెంటు సభ్యుడు,
చింతపల్లి : గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ బలంగా ఉందని 2019 ఎన్నికల్లో విజయం ఖాయమని మాజీ పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్‌చార్జి మల్లు రవి అన్నారు. బుధవారం స్థానిక ఐబీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ మండల సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరై ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ కార్యకర్తలను మోసం చేసి పార్టీ ఫిరాయించిన నాయకులకు రానున్న రోజుల్లో ఓట్లేసిన ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జిల్లాపరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్, కాంగ్రెస్ మద్దతుతో విజయం సాధించిన సీపీఐ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌లపై గ్రామ స్థాయిలో పార్టీ కార్యకర్తలు వారిపై గుర్రుగా ఉన్నారన్నారు.
నాయకులు మోసం చేశారు కాని పార్టీ కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉంటుందన్నారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. కాంగ్రెస్ హయాంలో రెండు రూపాయలకు కిలో బియ్యంతో పాటు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ గృహాలు, విద్యార్థులకు స్కాలర్‌షిప్, 108, 104, ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీ రుణాలు తదితర పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. పార్టీలు ఫిరాయించిన నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
అనంతరం దేవరకొండ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ రమావత్ జగన్‌లాల్‌నాయక్ మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్‌యాదవ్, ఎం.డి. ఖలీల్, రావు నర్సింహారావు, శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్‌నర్సింహారెడ్డి, ఇంద్రారెడ్డి, తిరుపతయ్య, శ్రావణ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.