వస్తువుల చేర్పుపై రాష్ట్రాలను సంప్రదించాలి
జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి ఈటల
సాక్షి, న్యూఢిల్లీ: జూలై నుంచి దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు కానున్న నేపథ్యంలో ఇప్పటికే నిర్దేశించిన శ్లాబుల్లో వస్తువుల చేర్పుపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను సంప్రదించాలని మంత్రి ఈటల రాజేందర్ కోరారు. శనివారం ఢిల్లీలో జరిగిన 11వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీజీఎస్టీ, ఎస్‌జీఎస్టీ చట్టాలకు సంబంధించి అన్ని రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని, కేంద్రపా లిత ప్రాంతాల విషయంలో కొన్ని అంశాలపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర, న్యాయ అధికారులు ఈ చట్టాలపై సమగ్ర విధానాలను రూపొందించారన్నారు.
తీర ప్రాంత జలాల్లో 12 నాటికల్ మైళ్ల దూరంలో జరిగే రవాణాపై అధికారాన్ని రాష్ట్రాలకే వదిలేయడంపై కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందన్నారు. జీఎస్టీ అమలుతో ఎక్కువ మంది అర్హులైన వారు పన్ను పరిధిలోకి వస్తారని, ఒకే దేశం–ఒకే పన్ను విధానం అమలవుతుండడంతో ఇక సరిహద్దుల్లో చెక్‌పోస్టులు తొలగించుకోవచ్చన్నారు. వస్తుసేవల రవాణాపై తనిఖీలు నిర్వహించడానికి రాష్ట్రాల కు అధికారాలు ఇవ్వాలని కోరామన్నారు. ఈ నెల 16న జరిగే తదుపరి కౌన్సిల్ సమావేశంలో పెండింగ్‌లో ఉన్న వివిధ అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పూర్తి ఏకాభిప్రాయం కుదురుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.