ప్రజోపయోగ పనులపై జీఎస్టీ వద్దు | Do not use GST on public works: Itala | Sakshi
Sakshi News home page

ప్రజోపయోగ పనులపై జీఎస్టీ వద్దు

Published Sat, Sep 9 2017 3:02 AM | Last Updated on Sun, Sep 17 2017 6:36 PM

ప్రజోపయోగ పనులపై జీఎస్టీ వద్దు

ప్రజోపయోగ పనులపై జీఎస్టీ వద్దు

జీఎస్టీ కౌన్సిల్‌ భేటీలో ప్రతిపాదిస్తాం: ఈటల
- కుదరకుంటే 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని కోరతాం
హైదరాబాద్‌ వేదికగా నేడే కౌన్సిల్‌ 21వ సమావేశం
 
సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం చేపట్టే ప్రజోపయోగ పనులపై జీఎస్టీని రద్దు చేయాలని, లేదంటే దాన్ని ప్రస్తుతమున్న 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తూ సవరించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌ వేదికగా జరగనున్న జీఎస్టీ కౌన్సిల్‌ 21వ సమావేశంలో జీఎస్టీ అమలుతో రాష్ట్రంపై పడుతున్న ఆర్థిక భారాన్ని మరోసారి ప్రస్తావిస్తామన్నారు.

తెలంగాణలో ఏయే రంగాలపై ఆ ప్రభావముంది.. ఎంత నష్టం జరుగుతుందో అంచనాలు తయారు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలగకుండా పన్నుల విధానముండాలని తొలి నుంచీ చెబుతున్నామని, అందుకు అనుగుణంగానే కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఈసారి జరిగే సమావేశం తెలంగాణకు అనుకూలంగా ఉంటుందని మంత్రి ఈటల ఆశాభావం వ్యక్తం చేశారు. ఉదయం 11 గంటల నుంచి 5 గంటల వరకు జరిగే ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి, జీఎస్టీ కౌన్సిల్‌ చైర్మన్‌ అరుణ్‌ జైట్లీ సారథ్యం వహించనున్నారు. 
 
మూడు అంశాలను ప్రస్తావిస్తాం... 
‘‘పన్నుల విధానం అనుసరణీయంగా ఉండాలని తొలి నుంచీ చెబుతున్నాం. అం దుకే తెలంగాణ లేవనెత్తే డిమాండ్లను దేశం లోని చాలా రాష్ట్రాలు బల పరుస్తున్నాయి. నిర్మాణంలో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులు, గృహ, రహదారుల నిర్మాణంపై 12 శాతం జీఎస్టీ విధించడంతో తెలంగాణలోనే దాదాపు రూ. 9 వేల కోట్ల నష్టం రానుంది. అందుకే వాటిపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని కోరతాం. అంతర్రాష్ట్ర జీఎస్టీ (ఐజీఎస్టీ) నుంచి రాష్ట్రాలకు వాటా త్వరగా రావట్లేదు. పన్నుల్లో రాష్ట్రాల వాటా కూడా ఆలస్యమవుతోంది. ఆన్‌లైన్‌లో ఉన్న ఇబ్బందులను కూడా ఇందులో ప్రస్తావిస్తాం. జీఎస్టీ అమలుతో లాభమా నష్టమా అనేది వచ్చే నెలలో స్పష్టత వస్తుంది. ఐజీఎస్టీ ద్వారా తెలంగాణకు ఎంత ఆదాయం వస్తుందనేది ఇంకా తేలలేదు’’అని ఈటల వివరించారు. 
 
ఏర్పాట్లపై సమీక్ష... 
జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ హైదరాబాద్‌లో తొలిసారి జరుగుతుండటంతో ఈ సమావేశానికి అన్ని ఏర్పాట్లూ చేశామని, అతిథులకు ఇబ్బందుల్లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ఈటల చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఢిల్లీలో ఉన్నందున జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశ బాధ్యతలను ఈటలతోపాటు పర్యవేక్షిస్తున్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి హరీశ్‌రావు శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌తో ఏర్పాట్లపై చర్చలు జరిపారు. జీఎస్టీ భేటీ తర్వాత స్థానిక వ్యాపార, వాణిజ్య వర్గాలు వినతులను అరుణ్‌ జైట్లీకి సమర్పిస్తాయని ఈటల వివరించారు. జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశానికి ముందు అన్ని రాష్ట్రాల మంత్రుల సమావేశం జరుగుతుంది. రాష్ట్రాలవారీగా డిమాండ్లపై ఇందులో చర్చలు జరుగుతాయి. కౌన్సిల్‌లో అన్ని రాష్ట్రాలు తమ ప్రతిపాదనలు సమర్పిస్తాయి. ఎజెండాకు స్వీకరించిన అంశాలపై ఓటింగ్‌ సమయంలో ఒక్కో రాష్టం నుంచి ఒక్కరే పాల్గొంటారు. 
 
మధ్యేమార్గంగా కమిటీకి!
నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, పను లపై జీఎస్టీని తగ్గించాలన్న డిమాండ్‌పై కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటికే తొలుత 18% ఉన్న పన్నును గత కౌన్సిల్‌ సమావేశంలో 12 శాతానికి కుదించింది. అయినా రాష్ట్రం ఏకంగా పన్ను రద్దు చేయాలని లేదా 5 శాతానికి కుదించాలని ఒత్తిడి పెంచుతోంది. జీఎస్టీపై వివిధ రాష్ట్రాల ఫిర్యాదులపై ఏర్పాటు చేసిన కమిటీకి కేంద్రం ఈ అంశాన్ని అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విందు
జీఎస్టీ సమావేశంలో రాష్ట్రం తరఫున డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌తోపాటు ఉన్నతాధికారులు పాల్గొంటారు. సమావేశం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున జైట్లీ, వివిధ రాష్ట్రాల మంత్రులు, అతిథుల బృందానికి ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విందు ఇవ్వనున్నారు. సమావేశానికి వచ్చే అతిథులకు పోచంపల్లి చేనేత వస్త్రాలతోపాటు రాష్ట్ర పర్యాటక వివరాలు, చారిత్రక సాంస్కృతిక వైభవానికి అద్దంపట్టే జ్ఞాపికలను బహూకరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement