⇒ రాత్రి వేళ 2 - 6 డిగ్రీల తగ్గుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతున్నాయి. 2 నుంచి 6 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గు ముఖం పడుతుండటంతో చలి వాతావరణం నెలకొంది. గత 24 గంటల్లో మెదక్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీలకు పడిపోయింది. అక్కడ సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువగా నమోదైంది. ఆదిలాబాద్, హన్మకొండ, హైదరాబాద్, నిజామాబాద్ లలో 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికా ర్డయ్యాయి.
హన్మకొండలో సాధారణం కంటే ఏకంగా 6 డిగ్రీలు తక్కువగా నమోదైంది. హైదరాబాద్, ఖమ్మంలలో 4 డిగ్రీల చొప్పున, నిజామాబాద్, రామగుండంలలో 3 డిగ్రీల చొప్పున తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాచలం మినహా అన్నిచోట్లా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు ఒకట్రెండు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి.