
కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న కేంద్రం: చాడ
కార్పొరేట్ శక్తులకు కేంద్ర ప్రభుత్వం కొమ్ముకాస్తోందని సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు.
హైదరాబాద్: కార్పొరేట్ శక్తులకు కేంద్ర ప్రభుత్వం కొమ్ముకాస్తోందని సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారమిక్కడ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక, మతోన్మాద చర్యలను నిరసిస్తూ ఇందిరా పార్కు నుంచి సుందరయ్య పార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ తాము అధికారంలోకొస్తే మంచి రోజులు వస్తాయని మోదీ చెప్పారని, అయితే అవి బడాబాబులకేనని స్పష్టమవు తోందన్నారు.
కోల్ ఇండియా ఓఎన్‌జీసీ వాటాలను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. కేంద్రం మెడలు వంచి తమ హక్కులను సాధించుకోవాలని, అవసరమైతే దేశవ్యాప్త ఉద్యమాన్ని నిర్వహిం చాలని పిలుపునిచ్చారు. సీపీఎం రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యుడు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ, విద్యారంగంలో కాషాయ మతాన్ని జొప్పిస్తున్నారని, భారత్‌ను హిందూరాజ్యం చేసేందుకు కుట్ర లు చేస్తున్నారని విమర్శించారు.
మతఘర్షణలు పెరగడంతో పాటు ఉపాధిహామీ పథకాలకు తూట్లు పొడుస్తున్నారన్నారు. కార్యక్రమంలో సీపీఐఎంఎల్ లిబరేషన్ నాయకుడు మూర్తి, ఎస్‌యూసీఐ నాయకుడు శ్రీధర్, ఆర్‌ఎస్పీ నాయకుడు జానకిరాము, ఎంసీపీఐయూ నాయకుడు ఉపేందర్‌రెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి డాక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.