'అవినీతి వల్లే జగదీశ్ రెడ్డి శాఖ మార్పు'
తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా గతంలో పనిచేసిన జగదీశ్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారని, అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన శాఖను మార్చారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆరోపించారు. రెండు దఫాలుగా కాలేజీలకు విడుదల చేసిన రూ. 1,360 కోట్ల ఫీజు రీయింబర్స్మెంటు నిధుల్లో మంత్రి జగదీశ్ రెడ్డి, టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి 5 శాతం చొప్పున కమీషన్లు తీసుకున్నారని తీవ్రంగా ఆరోపించారు.
దీనిపై విచారణకు ఆదేశిస్తే.. ఈ వ్యవహారంలో జరిగిన మొత్తం అవినీతిని తాము నిరూపిస్తామని పొన్నం ప్రభాకర్, సంపత్ కుమార్ తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ నుంచి సంపాదించిన నిధులతో కోళ్లఫారాలలో ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేశారని, అలాంటి 200 ఇంజనీరింగ్ కళాశాలలను కేసీఆర్ రద్దు చేశారని చెప్పారు. అయితే.. కేవలం కాలేజీల రద్దుతోనే సరిపెట్టేసిన సర్కారు.. వాటికి అనుమతులు ఇచ్చిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని పొన్నం ప్రభాకర్, సంపత్ కుమార్ ప్రశ్నించారు.