పత్తికి దెబ్బే..! | Cotton Cultivation Slow In Khammam | Sakshi
Sakshi News home page

పత్తికి దెబ్బే..!

Published Mon, Sep 16 2019 12:22 PM | Last Updated on Mon, Sep 16 2019 12:23 PM

Cotton Cultivation Slow In Khammam - Sakshi

సాక్షి, కొత్తగూడెం: ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి వర్షాలు ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ ఒకింత ఎక్కువగా కురవడంతో జిల్లాలో అన్ని పంటలను సాధారణ విస్తీర్ణం కన్నా అధికంగానే రైతులు సాగు చేస్తున్నారు. వరి, మొక్కజొన్న, పెసర, నూనెపంటలు, ఇతర ఆహార, వాణిజ్య పంటలు వందశాతం కంటే మించి పండిస్తున్నారు. వీటన్నింటికీ ప్రస్తుత వర్షాలతో ఇబ్బంది లేకున్నా.. పత్తి పంటకు మాత్రం కొంతమేరకు నష్టం వాటిల్లుతోంది. జిల్లాలో సాధారణ పత్తి సాగు విస్తీర్ణం 46,475 హెక్టార్లు కాగా, ఈ సీజన్‌లో 46,524 హెక్టార్లలో సాగుచేశారు. అయితే పత్తి రైతులకు ఈ సీజన్‌లో వరుసగా దెబ్బలు తగిలాయి. సీజన్‌ ప్రారంభంలో అరకొర వర్షాలు కురవడంతో వెంటవెంటనే రెండు సార్లు పత్తి గింజలు నాటారు.

కొందరు రైతులు మూడోసారి కూడా వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత వర్షాలు ముఖం చాటేయడంతో అవి మొలవలేదు. కొద్ది రోజులకు వర్షం కురవడంతో మళ్లీ విత్తనాలు వేశారు. ఈ క్రమంలో కొన్ని మండలాల్లో నకిలీ విత్తనాల కారణంగా రైతులు నష్టపోయారు. తరువాత వర్షాలు సమృద్ధిగా కురవడంతో చివరలో నాటిన గింజలు మొలిచాయి. అయితే ఆలస్యంగా ప్రారంభమైన వర్షాలు జిల్లాలో సాధారణం కన్నా ఎక్కువగా కురవడంతో పత్తిపంటపై కొంతమేరకు ప్రభావం చూపుతోంది. వరుసగా కురుస్తున్న వర్షాలతో చాలాచోట్ల మోకాళ్ల ఎత్తులోనే పత్తిపంట ఎర్రబారింది. ఆకు ముడత వస్తోంది. వర్షాలు ఎక్కువగా పడుతుండడంతో పత్తి చేలల్లో భారీగా కలుపు పెరిగి మొక్క ఎదుగుదలపై ప్రభావం పడుతోంది.

మరోవైపు కొమ్మతొలుచు పురుగు, గులాబీరంగు పురుగు, పిండినల్లి తెగులు ఆశిస్తున్నాయి. దీంతో మొక్క పెరుగుదలపై ఆశలు లేకుండా పోతోందని రైతులు అంటున్నారు. ఇక రైతులు నాటిన విత్తనాలకు సంబంధించి బీటీ ప్రభావం 100 రోజులు మాత్రమే ఉంటుంది. ఆ వ్యవధి కూడా దాటిపోతుండడంతో పెరుగుదల అంతగా ఉండదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మొదట్లో ముఖం చాటేసిన వర్షాలు తరువాత ఎక్కువగా కురుస్తుండడంతో పత్తి దిగుబడిపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఇక జిల్లాలో కురిసిన వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో గోదావరి గత నెలరోజుల కాలంలో నాలుగుసార్లు ఉధృతంగా ప్రవహించింది. దీంతో గోదావరి పరీవాహక ప్రాంత మండలాల్లో పత్తి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో అనుకున్నంత స్థాయిలో పత్తి దిగుబడి వచ్చే అవకాశం లేదని రైతులు అంటున్నారు.  

మిగితా పంటలకు ఢోకా లేదు.. 
ఈ ఖరీఫ్‌లో వర్షాలు బాగా కురవడంతో పత్తి మినహా మిగిలిన పంటలకు మాత్రం ఎలాంటి ఢోకా లేదు. ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం సాధారణ విస్తీర్ణంలో వివిధ పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ప్రధానంగా వరి, మొక్కజొన్న, పెసర, పత్తి, చెరకు, ఇతర ఆహార పంటలు 100 శాతం సాగులో ఉన్నాయి. జిల్లాలో వరి, పత్తి పంటల వైపు రైతులు మొగ్గు చూపారు. వరి సాధారణ విస్తీర్ణం 43,334 హెక్టార్లు కాగా 43,577 హెక్టార్లలో (109 శాతం), పత్తి 46, 475 హెక్టార్లకు 46,524 హెక్టార్లలో సాగవుతున్నాయి.

ఈ రెండింటి  తరువాత మొక్కజొన్న వైపు రైతులు మక్కువ చూపారు. ఈ పంట సాధారణ విస్తీర్ణం 6,304 హెక్టార్లు కాగా, 8,398 హెక్టార్లలో (133 శాతం) సాగు చేస్తున్నారు. పెసర 227 హెక్టార్లకు 233 హెక్టార్లతో 103 శాతం, ఇతర నూనె పంటలు 6,531 హెక్టార్లకు 6,644 హెక్టార్లు (102 శాతం), ఇతర ఆహార పంటలు 7,986 హెక్టార్లకు 7,999 హెక్టార్లలో సాగు   చేస్తున్నారు. ఇతర ఆహారేతర పంటలు 7,490 హెక్టార్లకు గాను 7,580 హెక్టార్లలో సాగవుతున్నాయి.  

ఎర్రబడి పూత రాలుతోంది 
నెలరోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పత్తి ఎర్రబడి పూత రాలిపోతోంది. కలుపు పెరిగి చెట్లు ఎదగటం లేదు. వర్షాల కు తెగుళ్లు ఎక్కువయ్యా యి. పూత, కాత సమయంలో అధిక వర్షాలతో పంటకు నష్టం జరుగుతోంది. 
– యారం వెంకటరెడ్డి, రెడ్డిపాలెం 

దిగుబడి సక్రమంగా రాదు 
వర్షాలతో పత్తి ఎదుగుదల లేకుండా పోయింది. మొక్కలు ఎర్రబడి పూత రాలిపోతోంది. ఇప్పటికే ఎరువులు, పురుగు మందులకు పెట్టుబడి ఎక్కువగా పెట్టాం. వర్షాలకు పత్తి దెబ్బతింది. దిగుబడులు బాగా తగ్గుతాయని భయంగా ఉంది.
– యడమకంటి నర్సింహారెడ్డి, నాగినేనిప్రోలు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement