జానాకు సవాల్! | Council poll: TRS decides to contest fifth seat | Sakshi
Sakshi News home page

జానాకు సవాల్!

Published Fri, May 22 2015 3:30 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

జానాకు సవాల్! - Sakshi

జానాకు సవాల్!

ఎమ్మెల్సీ కైవసానికి రంగంలోకి సీఎల్పీ నేత
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికలను సీఎల్పీ నేత కె.జానారెడ్డి సవాలుగా తీసుకుంటున్నారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి బయటకు పోవడం, పార్టీ నాయకత్వ వైఫల్యాలపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ ఎన్నికలపై జానా ప్రత్యేక దృష్టి సారించారు. పార్టీ అభ్యర్థిగా ఆకుల లలిత ఎంపికపై కొందరు పార్టీ నేతలు అసంతృప్తిని వెలిబుచ్చుతున్నందున ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. పార్టీ ఎమ్మెల్యేలందరితోనూ స్వయంగా మాట్లాడారు.

గత ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న సీపీఐ మద్దతు కోసం జానారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రయత్నించారు. రెండు రోజుల్లో జరిగే పార్టీ సమావేశంలో చర్చించి, సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. మొదటి ప్రాధాన్యతా ఓటుతో గెలుపొందాలంటే(మొత్తం సభ్యులు ఓటింగులో పాల్గొంటే) 18 ఓట్లు సరిపోతాయని, ఆ మేరకు కాంగ్రెస్‌కు బలముందని పార్టీ నేతలు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా అగ్రనేతలు జాగ్రత్తపడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన నలుగురు ఎమ్మెల్యేలపై అనుసరించాల్సిన వ్యూహంపై ఈ నెల 26న జరిగే సీఎల్‌పీ సమావేశంలో చర్చించనున్నారు. గురువారం నాటి భేటీలోనూ పలు అంశాలపై నేతలు చర్చించారు. అధికార టీఆర్‌ఎస్ ఐదుగురిని రంగంలోకి దించినా నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ గడువు పూర్తయ్యేదాకా వేచి చూడాలని భావిస్తున్నారు. ఈ నెల 25న ఉపసంహరణకు గడువు ముగియనుండటంతో మరుసటి రోజే(26న) సీఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు.

ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. కాగా, నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను గెలిపించుకోవడానికే బలం లేకున్నా అధికారంలో ఉన్నామనే అహంకారంతో టీఆర్‌ఎస్ బరితెగించి ఐదుగురిని బరిలో దింపిందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. అధికార టీఆర్‌ఎస్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేయాలని చూస్తోందని, అక్రమమార్గాల ద్వారా ఐదో స్థానాన్ని గెలుచుకోవాలని ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఓట్లు బహిరంగంగా వేయాలని, పార్టీ విప్‌ను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో పోరాడుతామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement