సొంతూరికెళ్లి...వీధులన్నీ తిరిగి | COVID 19 Spreadding Hyderabad to City Outcuts | Sakshi
Sakshi News home page

సిటీ టు శివారు

Published Thu, Jul 23 2020 8:08 AM | Last Updated on Thu, Jul 23 2020 8:08 AM

COVID 19 Spreadding Hyderabad to City Outcuts - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటిదాకా కోర్‌ సిటీకి పరిమితమైన కరోనా వైరస్‌ ప్రస్తుతం శివారులోని రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సురక్షితంగా, ఎంతో ప్రశాంతంగా ఉన్న కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లు ప్రస్తుతం కరోనా వైరస్‌కు హాట్‌స్పాట్లుగా మారాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జూలై 22 వరకు 49259 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీటిలో 34139 పాజిటివ్‌ కేసులు కేవలం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే వెలుగుచూశాయి. ఇప్పటివరకు 438 మంది మృతిచెందగా, వీరిలో 359 మంది నగరవాసులే ఉన్నారు. పాతబస్తీలోని చార్మినార్‌ సహా సంతోష్‌నగర్, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, జియాగూడ, కార్వాన్, మెహిదీపట్నం, మలక్‌పేట్, వనస్థలిపురం, ముషీరాబాద్, రామంతాపూర్‌ తదితర సర్కిళ్లలో అత్యధిక పాజిటివ్‌ కేసులునమోదయ్యాయి. జియాగూడ మేకలమండి, సబ్జిమండి, బేగంబజార్, మాధన్నపేట్‌ మార్కెట్, మలక్‌పేట్‌ మార్కెట్‌ కేంద్రంగా నగరమంతా వైరస్‌ విజృంభించింది. జూన్‌ చివరి నాటికి కూడా శివారు ప్రాంతాల్లో పెద్దగా కేసులు నమోదు కాలేదు. ఆ తర్వాత వరుసగా కేసుల సంఖ్య పెరుగుతోంది. గతవారంతో పోలిస్తే ప్రస్తుతం సిటీలో కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ....శివారులో కొత్తగా వెలిసిన కాలనీలు, గెటేడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లలో ఇటీవల కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 

ర్యాపిడ్‌ టెస్టుల్లో 18 శాతం పాజిటివ్‌  
నగరంలో కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో కేసులను గుర్తించేందుకు ప్రభుత్వం జూలై 8 నుంచి ర్యాపిడ్‌ టెస్టులు ప్రారంభించింది. 86 ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 36720 మందికి పరీక్షలు నిర్వహించగా, వీరిలో 6198 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. తాజాగా బుధవారం 3742 మందికి పరీక్షలు నిర్వహించగా, 684 మందికి కరోనా సోకింది. నగరంలో తాజా పాజిటివ్‌ రేటు 18 శాతంగా నమోదవడం విశేషం. ఇదిలా ఉంటే తెలంగాణవ్యాప్తంగా ప్రతి పది లక్షల మందిలో 7327 మందికి పరీక్షలు నిర్వహించగా... టెస్టింగ్‌ శాంపిల్స్‌ సగటు పాజిటివ్‌ రేటు 17 శాతం నమోదవుతుండటం గమనార్హం.

సొంతూరికెళ్లి...వీధులన్నీ తిరిగి
లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన తర్వాత నగరంలో కేసుల సంఖ్య తగ్గకపోగా మరింత పెరిగింది. రోజుకు సగటున 1500 నుంచి 1800 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సాధారణ ప్రజలతో పాటు అనేక మంది వ్యాపారులు వైరస్‌ బారిన పడ్డారు. అప్జల్‌గంజ్, బేగం బజార్, సికింద్రాబాద్, మలక్‌పేట గంజ్‌ తదితర ప్రాంతాల్లోని వ్యాపారులు భయంతో స్వచ్ఛంద లాక్‌డౌ న్‌ ప్రకటించుకున్నారు. ఇదే సమయంలో తమిళనాడు తరహాలో హైదరాబాద్‌లో కూడా మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారన్న ప్రచారం జరిగింది. ఇప్పటికే ఉపాధి అవకాశాలు కోల్పోయి పనుల్లేక ఇంటి అద్దెలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఇకపై ఇక్కడ ఉండటం కంటే..సొంతూళ్లకు వెళ్లిపోవడమే ఉత్తమమని భావించారు. అప్పటి వరకు కోర్‌ సిటీలో ఉన్న వారు తమ ఇళ్లను ఖాళీ చేసి సిటీ శివారు ప్రాంత జిల్లాల్లోని సొంతూళ్లకు వెళ్లిపోయారు. వైరస్‌ లక్షణాలు లేకపోవడంతో వారు  మాస్కు లు ధరించకుండా...భౌతిక దూరం పాటించకుండా వివిధ వేడుకల పేరుతో బంధువుల ఇళ్లకు తిరిగారు. ఇదే సమయంలో క్రయ విక్రయాల పేరుతో శివారు జిల్లాల నుంచి సిటీకి రాకపోకలు పెరిగాయి. ఇక్కడి వారు అక్కడికి వెళ్లడం..అక్కడి వారు ఇక్కడికి వచ్చి పోవడం వల్ల వైరస్‌ శివారు ప్రాంతాలకు విస్తరించింది. ఇదే సమయంలో సిటీలో టెస్టుల సంఖ్య పెంచడం, వైరస్‌పై సిటిజన్లకు మరింత అవగాహన పెరగడం, అనివార్యమైతే తప్ప బయటకు రాకపోవడం, ఒకవేళ వచ్చినా విధిగా మాస్కు లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, ఇంట్లో చిన్న చిన్న చిట్కాలు పాటించి వైరస్‌ బారిన పడకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో   పదిహేను రోజులతో పోలిస్తే ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడానికి ఇదే కారణమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement