
బుధవారం రాత్రి 10 గంటలు బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్... అప్పుడే పని ముగించుకున్న హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్... ఇంటికి బయలుదేరడానికి సిద్ధం కావడంతో రెడీ అయిన వాహన శ్రేణి... తన వెహికిల్‌ను వదిలి కాలినడకన అంబర్‌పేట్‌లోని ఇంటికి వెళ్లిన సీపీ... దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ ‘పాదయాత్ర’లో అనేక కీలకాంశాలు తన దృష్టికి వచ్చాయని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు.
సాక్షి, సిటీబ్యూరో: రవితేజ హీరోగా నటించిన ‘ఇడియట్’ సినిమా గుర్తుందా..? అందులో పోలీసు కమిషనర్ పాత్ర పోషించిన ప్రకాష్‌రాజ్ బాధ్యతలు స్వీకరించడానికి వచ్చిన రోజు రాత్రి నగరంలో మారువేషంలో తిరుగుతూ కొన్ని లోపాలను గుర్తిస్తారు. నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ సైతం బుధవారం రాత్రి దాదాపు ఇదే పని చేశారు. కమిషనర్ కార్యాలయం నుంచి ఆయన తన ఇంటి వరకు గంటన్నరపాటు కాలినడకనే వెళ్లారు.
సాధారణ దుస్తుల్లో బయటకు...
బుధవారం రాత్రి 10 గంటలకు తన కార్యాలయం నుంచి బయలుదేరిన సమయంలో కొత్వాల్ అంజనీకుమార్ సాధారణ దుస్తుల్లో ఉన్నారు. నీలిరంగు ట్రాక్, ఎర్రరంగు టీషర్ట్‌తో పాటు స్పోర్ట్ షూస్ ధరించి, ఓ చేతిలో తన సెల్‌ఫోన్‌తో బయలుదేరారు. ఈయనకు దాదాపు 100 మీటర్ల దూరంలో సఫారీ దుస్తుల్లో ఉన్న గన్‌మెన్ అనుసరించగా...అర్ధగంట గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆయన కాన్వాయ్ వెంట వెళ్ళింది. బషీర్‌బాగ్ నుంచి హిమాయత్‌నగర్, నారాయణగూడ, తిలక్‌నగర్, ఛే నంబర్, శ్రీ రమణ థియేటర్, అంబర్‌పేట్ మీదుగా దాదాపు ఆరు కిలోమీటర్లు నడిచిన కొత్వాల్ రాత్రి 11.30 గంటల ప్రాంతంలో సెంట్రల్ పోలీసు లైన్స్‌లో ఉన్న తన ఇంటికి చేరుకున్నారు. మార్గమధ్యంలో కొందరు చిరు వ్యాపారులతోనూ ఆయన ముచ్చటించారు. అత్యధికులు సాధారణ దుస్తుల్లో, నడుచుకుంటూ వస్తున్న పోలీసు కమిషనర్‌ను గుర్తించలేదు.
మందుబాబులు... ట్రాఫిక్ ఇబ్బందులు...
ఈ మార్గంలోని పరిస్థితులను గమనించాలనే ఉద్దేశంతో ‘పాదయాత్ర’ చేసిన కొత్వాల్ ముఖ్యంగా రెండు ఇబ్బందుల్ని గుర్తించారు. నారాయణగూడ, కాచిగూడ ఠాణాల పరిధుల్లో ఉన్న రెండు వైన్‌షాపుల వద్ద ఆ సమయంలోనూ భారీగా జనం ఉన్నారు. వీరిలో కొందరు మద్యం ఖరీదు చేసుకుని రోడ్లపై వాహనాలు ఆపి తాగుతూ కొత్వాల్‌కు కనిపించారు. మరికొందరు మద్యం సీసాలు తీసుకుని రాంగ్‌రూట్స్‌లో దూసుకుపోతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆయన పరిశీలించారు. వీటికి తోడు ఆ సమయంలోనూ రహదారులపై పాదచారులు ఎక్కువగా ఉంటున్నారని సీపీ దృష్టికి వచ్చింది. అయితే రాత్రివేళ కావడంతో వాహనాలు వేగంగా దూసుకుపోతున్నాయి. దీంతో కొన్ని జంక్షన్లతో పాటు కీలక ప్రాంతాల్లో రోడ్డు దాటేందుకు పాదచారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని కొత్వాల్ గ్రహించారు.
ఆ ఇద్దరిపై తీవ్ర ఆగ్రహం...
ఈ ‘పాదయాత్ర’ మార్గంలోని రెండు ఠాణాలకు చెందిన అధికారులపై నగర పోలీసు కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మద్యం దుకాణాలు ఉన్న చోట్ల గస్తీ సక్రమంగా లేదని, ఆ కారణంగానే మందుబాబులు రెచ్చిపోతున్నారని అభిప్రాయపడినట్లు సమాచారం. గురువారం ఉదయం జరిగిన టెలీకాన్ఫరెన్స్‌లో అంజనీ కుమార్ తన ‘వాక్ ఆన్ స్ట్రీట్స్’ అనుభవాన్ని జోనల్ డీసీపీలతో పాటు ఇతర ఉన్నతాధికారులకు పంచుకున్నారు. తన దృష్టికి వచ్చిన లోపాలను ఆయా విభాగాలు, జోన్లకు చెందిన అధికారులతో స్పష్టం చేశారు. తక్షణం వాటిని సరిదిద్దాలంటూ ఆదేశించారు. ‘దాదాపు గంటన్నర పాటు నడుస్తూ ఇంటికి చేరుకున్నా. దీని వల్ల నాకు అనేక విషయాలు తెలిశాయి. వాటిపై అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. నగర ప్రజల భద్రత, ప్రశాంత జీవనమే మా ప్రధాన లక్ష్యం’ అని అంజనీ కుమార్ ‘సాక్షి’తో అన్నారు.
లిఫ్ట్ కావాలా.. కారు పంపాలా...
కొత్వాల్ సాబ్ వాకింగ్‌లో ఉండగా గుర్తించిన వారు అతి తక్కువే ఉన్నారు. అలా ఆయన్ను గుర్తుపట్టిన వారు వెనుక వస్తున్న సిబ్బంది వద్దకు వెళ్ళి ఏం జరుగుతోందని ఆరా తీశారు. కొందరు ద్విచక్ర వాహనచోదకులు అయితే లిఫ్ట్ కావాలేమో అడగాలంటూ సిబ్బందిని కోరారు. ఇంకొందరు ఆయన వాహనం చెడిపోయినందుకు నడుస్తున్నారని భావించారు. దీంతో తమ వాహనాలు ఇస్తామని, లేదా మరో కారు ఏర్పాటు చేస్తామంటూ ఆఫర్లు కూడా ఇచ్చారు. అయితే వీటిపై స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment