పూడికతీత పేరుతో మైనింగ్
► తెలంగాణలో అనుమతుల కంటే లోతుగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు
► ఎన్జీటీకి నివేదించిన సీపీసీబీ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పూడికతీత, డ్రెడ్జింగ్ పేరుతో జరుపుతున్న ఇసుక తవ్వకాలు పూర్తిగా మైనింగ్ కిందికే వస్తుందని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)కు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నివేదించింది. ఇసుక అక్రమ తవ్వకాలపై గతంలో సీపీసీబీ సమర్పించిన నివేదిక అసమగ్రంగా ఉండటంతో ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం అదనపు నివేదికను సమర్పించిన సీపీసీబీ ప్రభుత్వ ఉల్లంఘనలను ట్రిబ్యునల్ దృష్టికి తీసుకొచ్చింది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో ఇసుక మేటలు మూడు మీటర్ల వరకు ఉంటే.. ఇసుక తవ్వకాలకు కూడా మూడు మీటర్ల వరకు అనుమతులిచ్చారని పేర్కొంది.
దిగువ మానేరు డ్యాంలో ఒక మీటరు లోతు తవ్వకాలకు అనుమతులు ఇవ్వగా దానికి విరుద్ధంగా 3.8 మీటర్ల వరకు తవ్వకాలు చేపట్టారని పేర్కొంది. స్థిరమైన ఇసుక తవ్వకాల నిర్వహణ మార్గదర్శకాల ప్రకారం ఇసుక తవ్వకాలు జరిపే ముందు... ముఖ్యంగా ముంపు ప్రాంతాల్లో పర్యావరణ సమతుల్యతపై అధ్యయనం జరిపించాలి. కానీ తెలంగాణలో ఈ నిబంధనలను పాటించకుండా ఇసుక తవ్వకాలను చేపడుతూ ఆన్‌లైన్‌లో అమ్ముకుంటున్నారని పేర్కొంది. గతంలో పూడికతీతకు, డ్రెజ్జింగ్‌కు ఎలాంటి పర్యావరణ అనుమతులు అవసరం లేదని లోక్‌సభలో కేంద్ర మంత్రి సమాధానం చెప్పారని, అయితే పూడికతీత పేరుతో ఇసుకను తవ్వేసి అమ్ముకుంటున్న నేపథ్యంలో ఇది మైనింగ్ కిందికే వస్తుందని పేర్కొంది.
మీ సమాధానం చెప్పండి..
ఇసుక అక్రమ తవ్వకాలపై ‘రేలా’ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను జస్టిస్ జావేద్ రహీమ్ నేతృత్వంలోని ట్రిబ్యునల్ మంగళవారం విచారించింది. సీపీసీబీ ఇచ్చిన నివేదికపై సమాధానం చెప్పాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది.