కరీంనగర్ : భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) తెలంగాణ రాష్ట్ర తొలి కార్యదర్శిగా జిల్లాకు చెందిన చాడ వెంకటరెడ్డి ఎన్నికయ్యారు. ఈనెల 7నుంచి 10వరకు ఖమ్మం జిల్లాలో జరిగిన రాష్ట్ర మహాసభల్లో మంగళవారం రాష్ట్ర శాఖకు నూతన కార్యవర్గాన్ని, కౌన్సిల్‌ను ఎన్నుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 జూన్ ఒకటిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నూతన కార్యదర్శులను అప్పటి రాష్ట్ర పార్టీ తాత్కాలిక కమిటీలను వేసి నియమించింది. తెలంగాణ రాష్ట్ర శాఖకు చాడ వెంకటరెడ్డిని తాత్కాలిక కార్యదర్శిగా జాతీయ సమితి నియమించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఏర్పాటు ఆనంతరం తొలిసారిగా ఖమ్మంలో నాలుగు రోజుల పాటు జరిగిన సీపీఐ మహాసభల్లో రాష్ట్ర పార్టీ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డిని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎన్.రామయ్య, టి.లక్ష్మణ్, బి.అశోక్, కర్రె భిక్షపతి, కూన శోభరాణి, గూడెం లక్ష్మి, పి.కేదారి, ఎం.నారాయణ ఎన్నికయ్యారు. రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులుగా ఎం.నారాయణ నియమితులయ్యారు.
అంచలంచెలుగా ఎదిగిన చాడ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన చాడ వెంకటరెడ్డి అనేక ఆటుపోట్లను ఎదుర్కొని అంచలంచెలుగా ఎదిగారు. చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన చాడ వెంకటరెడ్డి మొదట ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. అనంతరం గ్రామంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల వల్ల ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేశారు. రైతు సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంలో స్వగ్రామంలో ది హాలిక్ శ్రమజీవి సహకార సంఘాన్ని ఏర్పాటు చేసి కార్యదర్శిగా ఎన్నికయ్యూరు. సొసైటీని అభివృద్ధి పరిచి ఆదర్శంగా నిలిచారు.
1981లో రేకొండ గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1987 నుంచి వరుసగా మూడుసార్లు చిగురుమామిడి మండ పరిషత్ అధ్యక్షుడిగా, ఒకసారి జెడ్పీటీసీగా రాజకీయ పదవులను అలంకరించారు. అదే సమయంలో హుస్నాబాద్ తాలుకా సీపీఐ కార్యదర్శిగా మూడుసార్లు, సీపీఐ జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, జాతీయ సమితి సభ్యుడిగా కొనసాగుతూనే.. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి ఇందుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యూరు.
ఉమ్మడి రాష్ట్రంలో సీపీఐ శాసనసభా పక్షనేతగా అసెంబ్లీలో పార్టీ బాణిని బలంగా వినిపించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ పార్టీ ఆయనకు తగిన గుర్తింపునిచ్చి తెలంగాణ శాఖకు తాత్కాలిక కార్యదర్శిగా నియమించింది. చాడ తన మూడున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో హుస్నాబాద్ ప్రాంతంలో సీపీఐ పార్టీ ప్రతిష్టత కోసం, వరదకాలువ నిర్మాణం కోసం, ప్రజాసమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకున్నారు.
పలువురి హర్షం..
చాడ వెంకట్‌రెడ్డి సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పెండ్యాల అయిలయ్య, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొయ్యడ సృజన్‌కుమార్, సీపీఐ కరీంనగర్ సిటీ కార్యదర్శి పైడిపల్లి రాజు, నాయకులు సదాశివ, న్యాలపట్ల రాజు, మణికంఠరెడ్డి, సురేందర్‌రెడ్డి, గడిపె మల్లేష్, ఎలుగూరి రాంరెడ్డి, మాడిశెట్టి శ్రీధర్, మల్లారెడ్డి తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
సీపీఐ సారథిగా ‘చాడ’
Published Wed, Mar 11 2015 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 PM
Advertisement
Advertisement