కొత్త చరిత్రకు శ్రీకారం చుడదాం | CPM Mahasabha ends in Hyderabad | Sakshi
Sakshi News home page

కొత్త చరిత్రకు శ్రీకారం చుడదాం

Published Thu, Mar 5 2015 1:35 AM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

బుధవారం హైదరాబాద్లోని నిజాం కాలేజి గ్రౌండ్స్లో జరిగిన సీపీఎం బహిరంగ సభ వేదికపై ఆ పార్టీ నాయకులు, ఆ సభకు హాజరైన పార్టీ కార్యకర్తలు - Sakshi

బుధవారం హైదరాబాద్లోని నిజాం కాలేజి గ్రౌండ్స్లో జరిగిన సీపీఎం బహిరంగ సభ వేదికపై ఆ పార్టీ నాయకులు, ఆ సభకు హాజరైన పార్టీ కార్యకర్తలు

కమ్యూనిస్టులకు పునర్వైభవం తీసుకొద్దాం
బహిరంగ సభలో పార్టీ శ్రేణులకు సీపీఎం పిలుపు
అరుణ వర్ణమైన నిజాం కాలేజీ గ్రౌండ్
ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలని ఏచూరి పిలుపు
రాష్ర్టంలో బలమైన ప్రత్యామ్నాయంగా మారతాం
అన్ని శక్తులను కలుపుకొని ప్రజల్లోకి వెళ్తామన్న తమ్మినేని
60 మందితో రాష్ర్ట కమిటీ, 13 మందితో కార్యదర్శివర్గం ఏర్పాటు
ముగిసిన పార్టీ తెలంగాణ తొలి మహాసభలు
 
సాక్షి, హైదరాబాద్: నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని, వారసత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేటి తెలంగాణ రాష్ర్టంలో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాలని, కమ్యూనిస్టులకు పునర్వైభవం తీసుకురావాలని పార్టీ శ్రేణులకు పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది. సమస్యలపై ప్రజా ఉద్యమాల నిర్మాణమే శరణ్యమని పేర్కొన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు, సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేలా ఉద్యమాలు చేపట్టేందుకు ప్రతిజ్ఞ చేయాలన్నారు.

వామపక్షాలు, ప్రగతిశీల శక్తులు, సామాజిక శక్తులు, అణగారిన వర్గాలు, సంస్థలను కలుపుకొని రాష్ర్టంలో రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా  మారాల్సిన అవసరముందని సూచించారు. సీపీఎం రాష్ర్ట తొలి మహాసభల ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ మైదానంలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభ అరుణ వర్ణాన్ని సంతరించుకుంది. పార్టీ ముఖ్య నేతలంతా ఈ సభకు హాజరయ్యారు.
 
కమ్యూనిస్టులకు ఆదరణ పెరుగుతోంది: సీతారాం ఏచూరి
రాష్ట్రంలో వామపక్షాలకు వస్తున్న ఆదరణను చూస్తుంటే తెలంగాణలో క మ్యూనిస్టులకు పూర్వవైభవం వస్తుందన్న నమ్మకం కలుగుతోందని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి అన్నారు. ఇందుకు అన్ని సమస్యలపై ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయడమే పార్టీ ముందున్న ఏకైక కర్తవ్యమని పేర్కొన్నారు. ప్రజలకిచ్చిన హామీలను రాష్ర్ట ప్రభుత్వం నిలుపుకోకపోవడం, ప్రజా సమస్యలు, ఇతర అంశాలపై ఈ మహాసభల్లో చర్చించామని, వీటిపై ప్రజా ఉద్యమాలను బలపరచాలని పార్టీ నిర్ణయించిందని ఏచూరి తెలిపారు.

ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ, దేశ సెక్యులర్ విలువలకు తూట్లు పొడుస్తూ, ప్రజలపై ఆర్థిక  భారాన్ని మోపుతున్న ఎన్డీయే సర్కారుకు ‘హనీమూన్ పీరియడ్’ ముగియకుండానే ఢిల్లీ ఎన్నికల్లో, రాజ్యసభలో ఎదురుదెబ్బలు తగిలాయన్నారు.
 
అన్ని శక్తులను కలుపుకొని పోతాం: తమ్మినేని వీరభద్రం

వామపక్ష, లౌకిక, సామాజిక, ప్రగతిశీల శక్తులను ఏకం చేసి రాష్ర్టంలో బలమైన ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని సీపీఎం రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. కొత్త రాష్ర్టంలో సవాళ్లను అధిగమించేందుకు సమష్టిగా కృషి చేస్తామన్నారు. రాష్ర్టంలో రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ విధానాలను బట్టి ఉద్యమాలను రూపొందించుకునే సత్తా పార్టీకి ఉందన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్షాలు బలపరిచిన ప్రభాకర్‌రెడ్డిని గెలిపించేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని తమ్మినేని పిలుపునిచ్చారు.
 
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం విషయంలో సీఎం కేసీఆర్ వైఖరిని తెలియజేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంపై వీరోచితంగా పోరాడి హక్కులు, నిధులను సాధించుకోవాలే తప్ప కాళ్లపై పడి తాబేదార్లలా బేరసారాలు చేయడం మంచిదికాదన్నారు. రాజకీయ అవకాశవాదాన్ని రాష్ర్ట ప్రజలు సహించరన్నారు. వాస్తు బాగా లేదని, అందుకే పనులు చేయడం లేదని కేసీఆర్ చెప్పడం పిచ్చి పరిపాలనగా ఉందని తమ్మినేని విమర్శించారు.
 
 సమగ్ర తెలంగాణ కోసం పోరాడుదాం: బీవీ రాఘవులు
ప్రజలందరికి కూడు, గూడు, విద్య, ఉద్యోగం, వైద్య అవకాశాలు కల్పించే సమగ్ర తెలంగాణ కోసం పోరాడుదామని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ తెస్తానంటుంటే ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన స్వర్ణాంధ్రప్రదేశ్ గుర్తుకువస్తుందన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ చెస్తానన్న చంద్రబాబు చివరికి సారాంధ్రప్రదేశ్‌గా, రైతు ఆత్మహాత్యల ప్రదేశ్‌గా మార్చారని వ్యాఖ్యానించారు.
 
చంద్రబాబు సింగపూర్ అంటూ.. కేసీఆర్ బంగారు తెలంగాణ  అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాగా, దొరల రాజ్యం పోయిందనుకుంటే, కొత్త దొరలు వస్తున్నారని.. వారికి కూడా నైజాం నవాబుకు గోరి కట్టినట్లుగానే తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని తెలంగాణ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం పిలుపునిచ్చారు. మీడియాపై అంక్షలు విధించడం అప్రజాస్వామికమని సీనియర్ నేత ఎస్. వీరయ్య విమర్శించారు.
 
ఈ సభలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గపూర్, ఇతర నేతలు కూడా ప్రసంగించారు. అంతకుముందు సుందరయ్య విజ్ఞానకేంద్రం నుంచి నిజాం కాలేజీకి ‘ఎర్రసేన కవాతు(రెడ్‌షర్ట్ వాలంటీర్స్)’ పేరుతో ర్యాలీ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభా వేదికపై ప్రజానాట్య మండలి కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
 
 
రాష్ట్రకార్యదర్శిగా మళ్లీ తమ్మినేని
 సీపీఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం తిరిగి ఎన్నికయ్యారు. 60 మంది సభ్యులతో రాష్ట్ర కమిటీ, 13 మందితో రాష్ట్ర కార్యదర్శివర్గం ఏర్పాటైంది. రాష్ర్ట విభజన ప్రకటన తర్వాత గత ఏడాది ఫిబ్రవరిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా వచ్చే మూడేళ్లకు పార్టీ కార్యదర్శిగా తిరిగి ఆయనే ఎన్నికయ్యారు. ఇక గతంలో రాష్ర్ట కమిటీలో 41 మంది సభ్యులుండగా, ప్రస్తుతం వారిలో ఆరుగురిని తప్పించి మరో 25 మందిని కొత్తగా చేర్చారు. కాగా, ఈ పదవుల కోసం మొత్తం 61 మంది పోటీపడటంతో ఎన్నిక అనివార్యమైంది. గతంలో ఖమ్మం ఎంపీ సీటుకు పోటీచేసిన ధర్మా ఈసారి రాష్ట్రకమిటీకి పోటీచేసి ఓటమి పాలయ్యారు. 

రాష్ట్రకమిటీ నుంచి తప్పించిన వారిలో సారంపల్లి మల్లారెడ్డి(సెక్రటేరియట్ సభ్యుడు), లంక రాఘవులు, సామినేని రామారావు, సోమయ్య, పీఎస్‌ఎన్ మూర్తి, మెట్టు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. సారంపల్లి మల్లారెడ్డిని రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్‌గా నియమించే అవకాశముందని పార్టీవర్గాల ద్వారా తెలుస్తోంది. గత కమిటీలో ఉన్న ఏడుగురు సెక్రటేరియట్ సభ్యుల్లో(సారంపల్లిని మినహాయించి) ఎస్.వీరయ్య, చెరుపల్లి సీతారాములు, జి.నాగయ్య, చుక్కరాములు, నంద్యాల నర్సింహారెడ్డి, సున్నం రాజయ్యను కొత్త కమిటీలోనూ కొనసాగించారు.
 
 కొత్తగా పోతినేని సుదర్శన్, టి.జ్యోతి, బి.వెంకట్, జూలకంటి రంగారెడ్డి, జి.రాములు, డీజీ నరసింహారావు రాష్ట్ర కార్యదర్శివర్గంలోకి ఎన్నికయ్యారు. ప్రత్యేక ఆహ్వానితులుగా మల్లు స్వరాజ్యం, కె.వెంకటయ్య, పి.రాజారావు, పీఎస్‌ఎన్ మూర్తి, పి.సోమయ్య నియమితులయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement