
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో నిరాశలో ఉన్న బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపే చర్యలు ఊపందుకోవడం లేదు. మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా రాష్ట్ర పార్టీలో కొత్త స్ఫూర్తిని రగిలించాల్సిన ముఖ్యనేతలు, నాయకులు మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. రాష్ట్రం నుంచి ఆశించిన మేర పార్టీకి రాజకీయంగా ప్రోత్సాహం అందకపోవడంతో రాష్ట్ర బీజేపీ బలోపేతంపై జాతీయ పార్టీ నేతలు పెద్దగా దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు మొదలయ్యాయి. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఉన్నా, ఎన్నికల ఇన్‌చార్జిలను జాతీయ పార్టీ గతంలోనే నియమించినా పార్టీ బలోపేతం కావడం లేదని, విస్తరించడం లేదన్న వాదనలు పార్టీ వర్గాలే వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో బలం పుంజుకునేందుకు మంచి అవకాశంగా అందివచ్చిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ పార్టీ నేతలు ఎవరికివారే అన్నట్లుగా వ్యవహరించారన్న విమర్శలొచ్చాయి. పక్కా కార్యాచరణ చేపట్టడంలో ఇన్‌చార్జిలు విఫలమయ్యారంటూ కొందరు నాయకులు అంతర్గత సమావేశాల్లో వాపోయినట్టు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలకల్లా పార్టీ పరిస్థితిలో మార్పు వస్తుందని, జాతీయస్థాయిలో మాదిరిగానే ఇక్కడా మోదీ మంత్రం పనిచేస్తుందని ఆశిస్తున్నా, అది నెరవేరుతుందో లేదోఅన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
వ్యవహారాల ఇన్‌చార్జిదీ అదే దారి..
బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్న కృష్ణదాస్ పరిస్థితి కూడా అంతేనన్న విమర్శలు ఉన్నాయి. ఆయన కూడా చుట్టపుచూపుగా అప్పుడప్పుడు వచ్చి పోతారు తప్ప పార్టీ పరిస్థితిపై గట్టిగా రివ్యూ చేసింది, నేతలకు దిశానిర్దేశం చేసింది ఒక్కసారి కూడా లేదన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర పార్టీ నేతలను ఉత్సాహపరిచి కార్యక్రమాలను ముందుండి నడిపించిన సందర్భమే లేదని పలువురు నేతలు పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలకు నియమించిన ఇన్‌చార్జిలు మాత్రం ఎక్కువ సమయం ఇచ్చి పనిచేస్తున్నారని, తెలంగాణలోనే పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని పార్టీ సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జీగా కేంద్రమంత్రి, సీనియర్ నేత జేపీ నడ్డాను జాతీయ పార్టీ రాష్ట్రానికి పంపించింది. అయితే ఆయన వచ్చినా ఆశించిన స్థాయిలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రాలేదన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో నెలకొంది.
ఇన్‌చార్జిలు ఎవరు వచ్చినా..
రాష్ట్రంలో బీజేపీ వ్యవహారాలను చక్కదిద్దేందుకు, ప్రణాళిక ప్రకారం నడిపించేందుకు ఎవరు ఇన్‌చార్జీగా వచ్చినా ఏమీ చేయలేక పోతున్నారని, ఎవరిని నియమించినా రాష్ట్రానికి టైం ఇవ్వడం లేదన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో నెలకొంది. తాజాగా లోక్ సభ ఎన్నికల ఇన్‌చార్జిగా వచ్చిన అరవింద్ లింబావలి కూడా రాష్ట్రంలో పర్యటించడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పలు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌చార్జీలను బీజేపీ గత డిసెంబర్‌లోనే నియమించింది. అందులో భాగంగా తెలంగాణ ఇన్‌చార్జిగా కర్ణాటకకు చెందిన బీజేపీ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే అరవింద్ లింబావలిని గత డిసెంబర్ 26న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నియమించారు. ఆయనను నియమించి రెండు నెలలు కావస్తున్నా ఒక్కసారి రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చారే తప్ప ఇంతవరకు ఎలాంటి సమీక్షలు నిర్వహించలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆయన తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపి ముందుకు నడిపిస్తారని భావించారు. అయితే ఆయన ఇన్‌చార్జి అయ్యాక నెల రోజులకు గానీ రాష్ట్రానికి రాలేదని పార్టీ శ్రేణులే పేర్కొంటున్నాయి. ఈనెల 3వ తేదీన పదాధికారులు, కోర్ కమిటీ సమావేశంలో మాత్రం పాల్గొని వెళ్లిపోయారని, మళ్లీ ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి నెలకొందని కొంతమంది నేతలే పేర్కొంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంటు క్లస్టర్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, చేవెళ్ల పార్లమెంట్ క్లస్టర్ సమావేశాలు జరిగాయి. ఆ రెండింటికి కేంద్ర మంత్రులు రవిశంకర్‌ప్రసాద్, స్మృతి ఇరానీ వచ్చారు తప్ప లింబావలి మాత్రం రాలేదన్న విమర్శలు ఉన్నాయి. చివరకు ఈనెల 9వ తేదీన రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్ నిర్వహించినా దానికి హాజరు కాలేదు. దీంతో ఆయన రాష్ట్రానికి ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి నెలకొందని బీజేపీ నేతలే మాట్లాడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment