తనివితీరా ఏడుద్దాం | Crying Club in Hyderabad Good For Health Cause | Sakshi
Sakshi News home page

తనివితీరా ఏడుద్దాం

Published Mon, Dec 16 2019 7:32 AM | Last Updated on Mon, Dec 16 2019 7:32 AM

Crying Club in Hyderabad Good For Health Cause - Sakshi

ఇట్స్‌ టైం ఫర్‌ క్రై

నవ్వు నాలుగు విధాలా చేటు అని పెద్దలు అంటే ఏడుపు ఎన్నో విధాల రైటు అని ఆధునికులు అంటున్నారు.రోజువారీ పనుల్లో పడి మనంభావోద్వేగాలను అణచేసుకుంటున్నాం.. మరెన్నో మర్చిపోతున్నాం. అలాగే తనివితీరా ఏడవడం కూడా మర్చిపోతున్నాం అంటున్న హెల్తీ క్రైయింగ్‌ క్లబ్‌... నగరవాసులకు ఏడవడం నేర్పిస్తోంది. ఏడిస్తే పోయేదేం లేదు అనారోగ్యం తప్ప అని నచ్చచెబుతోంది. 

సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్‌లోని గుజరాతి సేవా మండల్‌ ప్రాంగణంలో ఒక ఆడిటోరియం... కొన్ని రోజుల క్రితం ఓ ఆదివారం దాదాపు 600 మంది పోగయ్యారు. కాసేపటి తర్వాత అందరూ ఒక్కపెట్టున ఏడుపు లంకించుకున్నారు. కాసేపు తనివిదీరా ఏడ్చాక ఒకరివైపు ఒకరు ఆప్యాయంగా చూస్తూ నవ్వుకున్నారు. కాసిన్ని స్నాక్స్‌ తిని ముచ్చట్లు చెప్పుకుని నిష్క్రమించారు. చూసేవారికి వీరి వ్యవహారం తేడాగా అనిపించవచ్చు గానీ... ఏడవడం రాకపోవడమే తేడా అని వీరు అంటున్నారు తెలంగాణలోని తొలి క్రైయింగ్‌ క్లబ్‌ నిర్వాహకులు.  

నవ్వుతో పాటూ ఏడుపూ ముఖ్యమే...
ఆల్వేస్‌ బీ చీర్‌ఫుల్‌ లాఫర్‌ అండ్‌ క్రైయింగ్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో ఇకపై  నెలకోసారి ఇలాగే ఏడుస్తాం అని నిర్వాహకుల ప్రకటించారు. మనసారా నవ్వలేని వారికి నవ్వుల్ని నేర్పేందుకు, నవ్వించేందుకు లాఫర్‌ క్లబ్స్‌ ఎలాగైతే పుట్టుకొచ్చాయో... అలాగే క్రైయింగ్‌ క్లబ్స్‌ కూడా ఊపిరిపోసుకున్నాయి. లాఫ్టర్‌ క్లబ్స్‌ 1990 ప్రాంతం నుంచే మన దేశంలో అడుగుపెట్టి ఇప్పుడు నగరవాసుల జీవితంలో భాగంగా మారిపోయాయి.  జీవితంలోని చిన్న చిన్న ఆనందాలను కూడా పంచుకోవాలనే సందేశం ఇస్తూ లాఫర్‌ క్లబ్స్‌ వస్తే... నిరాశ, నిస్పృహలు కూడా జీవితంలో భాగమేనని పంచుకుంటే పోయేవేనని చెబుతూ ఈ క్రైయింగ్‌ వ్యాయామాలకు శ్రీకారం చుట్టాం అని సూరత్‌వాసి ఈ క్లబ్స్‌కు శ్రీకారం చుట్టిన కమలేష్‌ మసాలావాలా అంటున్నారు.

ఏడుపు...ఆరోగ్యానికి మదుపు
ఈ క్రైయింగ్‌ అనేది పలు ఆరోగ్యకర లాభాలను అందిస్తుందని వైద్యులు అంటున్నారు. ‘‘ఈ సెషన్‌ పూర్తయ్యాక మనసుకు చాలా నిశ్చింతగా తేలికగా అనిపించింది. ఈ అనుభవం ప్రపంచం నుంచి నన్ను దూరంగా తీసుకెళ్లింది’’ అని సెషన్‌లో పాల్గొన్న సత్యరాజ్‌ చెప్పారు.  ‘‘ఏడుపు వల్ల మనసు మాత్రమే కాదు కళ్లు, కన్నీటి వాహికలు శుభ్రపడతాయి. సాధారణ కంటి సమస్యలకు వాడే ఐడ్రాప్స్‌కి ఇది మేలైన ప్రత్యామ్నాయం. అందుకే కనీసం నెలకు ఒకసారైన తనివిదీరా కళ్లమ్మట నీళ్లు పెట్టుకోమని నేను నన్ను సంప్రదించేవారికి చెబుతుంటా’’ అంటున్నారు అదే సెషన్‌కి హాజరైన ఆప్తమాలజిస్ట్‌ డా. ఎ. సాయిబాబా గౌడ్‌. అలాగే... మానసిక వైద్యులు చెబుతున్న ప్రకారం... ఒంటరిగా కంటే... సామూహికంగా తన బాధను అందరితో కలిసి తీర్చుకోవడం వల్ల తమ నష్టాలను,కష్టాల నుంచి సేదతీరడానికి అవకాశం ఎక్కువ. 

ఇలా...ఏడుస్తారు...

ఒక ప్రాంగణంలోకి అందరూ చేరాక... ఓ ఐదు నిమిషాల ధ్యానం తర్వాత ఈ సెషన్‌ ప్రారంభం అవుతుంది. మొదటగా... ప్రేమించిన వారిని కోల్పోవడం కావచ్చు లేదా ఆఫీసులో వచ్చిన చిన్న సమస్య కావచ్చు.. తమ జీవితంలోని ఏదైనా సరే కష్టం, నష్టాన్ని గుర్తు తెచ్చుకోవాలని హాజరైన వారిని నిర్వాహకులు కోరుతారు. అది  నిమిషాల్లోనే కనీసం 20 మంది లీడింగ్‌ మెంబర్స్‌ అనేవారు ఏడవడం ప్రారంభిస్తారు. కాసేపట్లోనే ఆ మూడ్‌ అందర్నీ కమ్మేస్తుంది. కళ్లమ్మట నీరు కారుస్తూ ఉండేవారు కొందరైతే కాస్త గట్టిగానే ఏడుపు లంకించుకునేవారు మరికొందరు. నిర్వాహకుల సూచనలకు అనుగుణంగా నెమ్మదిగా ఒక్కొరొక్కరుగా ఆ మూడ్‌ నుంచి బయటకు వస్తారు. అందరూ వచ్చాక మరో 5 నిమిషాల పాటు నిశ్చలంగా ఎవరి ఆలోచనల్లో వారు మునిగిపోయి కాసేపటికి తేరుకుంటారు. అలా క్రైయింగ్‌ సెషన్‌ ముగుస్తుంది. 

చక్కని వ్యాయామం..
ఈ క్రైయింగ్‌ అనేది అత్యంత సహజమైన భావోద్వేగం. ఏడవడం అనేది సిగ్గుపడాల్సిన పని కాదు. మనసులో బాధ ఉన్నా పైకి ఏడవలేకపోతేనే సిగ్గుపడాలి. ఏడవడం వల్ల శరీరంతో పాటు మనసుకూ చక్కని వ్యాయామం అందుతుంది. మనమంతా మరచిపోతున్న కన్నీరు పెట్టుకోవడం అనేది సాధన చేసైనా సరే అలవర్చుకోవాలని చెప్పడమే మా క్రైయింగ్‌ క్లబ్‌ ఉద్దేశ్యం.  –కమలేష్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement