స్పూఫింగ్‌తో ముంచేస్తున్నారు! | Cyber crime IN hyderabad | Sakshi
Sakshi News home page

స్పూఫింగ్‌తో ముంచేస్తున్నారు!

Published Fri, Oct 6 2017 1:03 AM | Last Updated on Fri, Oct 6 2017 9:43 AM

Cyber crime IN hyderabad

సాక్షి, హైదరాబాద్‌: బంజారాహిల్స్‌కు చెందిన డాక్టర్‌ ఫహీం రాయ్‌కు వచ్చిన బెదిరింపు ఫోన్‌ కాల్‌ తీవ్ర కలకలం రేపుతోంది. రూ.5 కోట్లు డిమాండ్‌ చేస్తూ ఫోన్లు చేసిన ఆగంతకుడు తొలుత వైద్యుడికే చెందిన మరో నంబర్, ఆపై ఓ రాజ్యసభ సభ్యుడు, మరో ఇద్దరు పోలీసు అధికారుల సెల్‌ నంబర్ల నుంచీ ఫోన్లు వస్తున్నట్లు చేయగలిగాడు.

ఇంటర్నెట్‌లో విరివిగా లభిస్తున్న కాల్‌ స్పూఫింగ్‌ సాఫ్ట్‌వేర్‌ వల్లే ఇలాంటివి సాధ్యమని సైబర్‌ క్రైమ్‌ నిపుణులు చెప్తున్నారు. ఇప్పటి వరకూ శత్రుదేశాల నిఘా సంస్థలు, ఉగ్రవాదులకే పరిమితమైన ఈ టెక్నాలజీని ఇప్పుడు నేరగాళ్లు, మోసగాళ్లు కూడా వినియోగించేస్తున్నారు. కాల్‌ స్పూఫింగ్‌కు మాత్రమే కాక మెయిల్‌ స్పూఫింగ్‌కు పాల్పడుతూ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల్ని బురిడీ కొట్టిస్తున్నారు. ఫహీం ఉదంతంపై కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు లోతుగా కూపీ లాగుతూ నిందితుల కోసం గాలిస్తున్నారు.


క్లోనింగ్‌ను తలదన్నుతూ..
ఒకప్పుడు సిమ్‌కార్డుల్ని క్లోనింగ్‌ చేసేవారు. అంటే మీ సిమ్‌కార్డును పోలినదాన్ని మరోటి సృష్టించి వినియోగించడం. దీనిద్వారా చేసే ఫోన్‌ కాల్స్‌ మీ నంబర్‌ నుంచే వెళ్తాయి. ఇలా చేయడానికి కచ్చితంగా సిమ్‌కార్డుకు సంబంధించిన ఇంటర్నేషనల్‌ మొబైల్‌ సబ్‌స్క్రైబర్‌ ఐడెంటిటీ(ఐఎంఎస్‌ఈ) నంబర్‌ తెలిసి ఉండాలి. దీన్ని తెలుసుకోవడం అందరికీ సాధ్యం కాదు.

అయినా అనేక సందర్భాల్లో సిమ్‌కార్డు క్లోనింగ్స్‌ చోటు చేసుకున్నాయి. దీనిని తలదన్నేలా అందుబాటులోకి వచ్చిందే స్పూఫింగ్‌. గతంలో ఫోన్‌ కాల్స్‌కే పరిమితమైన ఈ విధానం ఇప్పుడు ఈ–మెయిల్స్‌కు సైతం విస్తరించింది. ఏకంగా ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌(ఐపీ) అడ్రస్‌నూ స్పూఫ్‌ చేయగలుగుతున్నారు. కొన్నేళ్ల క్రితం సరదా కోసం ‘సాఫ్ట్‌ మేధావులు’రూపొందించిన ఈ సాఫ్ట్‌వేర్‌ ఇప్పుడు ఉగ్రవాదులు, అసాంఘిక శక్తులతో పాటు మోసగాళ్లుకూ వరంగా మారింది.


స్పూఫింగ్‌ చేస్తారిలా..
నిర్ణీత రుసుం తీసుకుని స్పూఫింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను అందించే వెబ్‌సైట్లు ఇంటర్నెట్‌లో అనేకం ఉన్నాయి. వాస్తవానికి ఇది ఇంటర్నెట్‌ ద్వారా చేసే కాల్‌. దీనిలోకి ఎంటరైన తర్వాత సదరు వ్యక్తి ఫోన్‌ నంబర్‌తో పాటు ఫోన్‌కాల్‌ను అందుకోవాల్సిన వ్యక్తిది, ఫోన్‌ రిసీవ్‌ చేసుకునేప్పుడు అతడికి సెల్‌ఫోన్‌లో ఎవరి నంబర్‌ డిస్‌ప్లే కావాలో కూడా పొందుపరుస్తారు.

ఇలాగే ఈ–మెయిల్‌ ఐడీ స్పూఫింగ్‌ వెబ్‌సైట్లలో మెయిల్‌ ఐడీలను రిజిస్టర్‌ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఓ వ్యక్తి ప్రముఖ కంపెనీ నుంచి కాల్‌ చేసినట్లు, ఈ–మెయిల్‌ పంపినట్లు మరో వ్యక్తిని బుట్టలో వేసుకోవచ్చు.


టోకరా వేస్తున్నారిలా
 సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్న మోసగాళ్లు నిరుద్యోగులకు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాల పేరుతో టోకరా వేస్తున్నారు. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నాయంటూ ప్రకటనలు జారీ చేసి నిరుద్యోగుల్ని ఆకర్షిస్తున్నారు. వారి బయోడేటా తదితరాలు సేకరించిన తర్వాత ఫోన్‌ ఇంటర్వ్యూ దగ్గర అసలు కథ మొదలవుతోంది. సదరు కంపెనీకి చెందిన ఫోన్‌ నంబర్‌కు స్పూఫింగ్‌ చేయడం ద్వారా వారే కాల్‌ చేసినట్లు సృష్టిస్తున్నారు.

ఉద్యోగార్థి అనుమానం వచ్చి ఆ నంబర్‌ ఎవరిదని ఆరా తీసినా ప్రముఖ కంపెనీకి చెందినదిగానే తేలుతుంది. ఆపై అదే కంపెనీ మెయిల్‌ ఐడీ, ఐపీ అడ్రస్‌ను స్పూఫ్‌ చేస్తున్న మోసగాళ్లు వాటి ద్వారా అపాయింట్‌మెంట్‌ ఆర్డర్, ఆఫర్‌ లెటర్‌ పంపిస్తున్నారు. ఆయా సంస్థల్లోని పెద్ద మనుషులతో తమకు సంబంధాలు ఉన్నాయని, వారి ద్వారానే బ్యాక్‌డోర్‌ ఎంట్రీలుగా ఉద్యోగాలు ఇప్పిస్తున్నామని మోసగాళ్లు చెపుతున్నారు.

దీంతో ఉద్యోగార్థులు నేరుగా ఆయా కార్యాలయాలకు వెళ్లి వివరాలు సరిచూసుకునే ధైర్యం చేయట్లేదు. దీంతో సదరు నిరుద్యోగి తనకు ఉద్యోగం వచ్చిందని భావించి మోసగాడు చెప్పిన బ్యాంక్‌ ఖాతాలో అడిగినంత జమ చేస్తున్నారు. ఇవి కూడా బోగస్‌ వివరాలతో ఓపెన్‌ చేసినవి కావడంతో వీటి ద్వారానూ మోసగాళ్లను పట్టుకునే అవకాశం లేదు. ఈ తరహాలో ఘరానా మోసాలతో నిరుద్యోగులను, సామాన్యుల్నీ నిండా ముంచే సైబర్‌ నేరగాళ్లు పొంచి ఉన్నారని సైబర్‌ క్రైమ్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement