స్పూఫ్ అప్ | spoof up | Sakshi
Sakshi News home page

స్పూఫ్ అప్

Published Wed, Mar 11 2015 11:42 PM | Last Updated on Sat, Sep 2 2017 10:40 PM

స్పూఫ్ అప్

స్పూఫ్ అప్

ఇప్పుడంతా క్రికెట్ మ్యేనియా. క్లబ్, కాలేజీ, ఆఫీసు, ఇల్లు, వాకిలి... అన్నీ ఆట స్థలాలే! బౌలింగ్ యాక్షన్లు... బ్యాటింగ్ రీప్లేలు... స్కోరింగ్ టాపిక్స్... మ్యాచ్ ప్రిడిక్షన్స్... టోటల్‌గా క్రికెట్ ప్రపంచ కప్‌కు ఎడిక్ట్ అయిపోయారు సిటీవాసులు. ఇంట్లో టీవీ... లేదంటే ఇంటర్‌నెట్... వర్కింగ్ ప్లేస్‌లో ల్యాప్‌టాప్... ఏదీ కుదరకపోతే చేతిలో మొబైల్... మొత్తానికి ఏదో రకంగా ఫుల్‌ప్లెడ్జ్‌డ్‌గా క్రికెట్‌కు కనెక్ట్ అయిపోతున్నారు. ఈ టెంపరేచర్‌కు తగ్గట్టు టీవీలో యాడ్సూ రెడీమేడ్‌గా వచ్చేస్తున్నాయి.

భారత్ మ్యాచ్‌కు ముందు ప్రత్యర్థి జట్టుపై వ్యంగాస్త్రాలతో ప్రసారమవుతున్న ఈ స్పెషల్ ప్రకటనలు ఫ్యాన్స్‌ను సూటిగా చేరి తెగ పాపులర్ అయిపోతున్నాయి. వీటి ఇన్‌స్పిరేషన్‌తో అభిమానులూ చెలరేగిపోతున్నారు. యూట్యూబ్ బేస్‌గా స్టాట్స్, సెటైర్స్ థీమ్స్‌గా కుప్పలుతెప్పలు ‘స్పూఫ్స్’ సృష్టించేసి లక్షల్లో హిట్స్ సాధించేస్తున్నారు.
 ..:: హనుమా
 
గాడ్జెట్ విప్లవం ప్రభావమనుకున్నా... అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమనుకున్నా... క్రికెట్‌కు పాపులారిటీ పెరిగిందనుకున్నా... మొత్తానికి ఈసారి ప్రపంచకప్‌కు ఎప్పుడూ లేనంత క్రేజ్ వచ్చేసింది. మ్యాచ్ టైమ్‌లోనే కాదు... ముందు... తరువాత కూడా ఆట టాపిక్కే వినిపిస్తోంది. ఫ్యాన్స్‌కు మరింత కనెక్ట్ అయ్యేందుకు భారత్- పాక్ హైటెంపో మ్యాచ్ ముందే ఓ ప్రకటన సంచలనం రేపింది. వరల్డ్ కప్‌లో భారత్‌పై గెలిచిన రికార్డు పాక్‌కు లేదు.

ఈ నేపథ్యంలో తీసిన యాడ్ ఇది. ఓ పాక్ అభిమాని... తమ జట్టు ఈసారన్నా విజయం సాధించకపోతుందా... సంబరాలు చేసుకోకపోతామా అని ఆశగా క్రేకర్స్ బాక్స్‌తో సహా టీవీ ముందు కూర్చుంటాడు. చివరకు పాక్‌కు పరాభవమే మిగులుతుంది. పాపం అతగాడు మళ్లీ నిరాశతో కుంగిపోతాడు. దీనికి వ్యూవర్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఇక్కడి నుంచే ‘స్పూఫ్స్’ ఊపందుకున్నాయి. దీనికి కౌంటర్‌గా పాక్ అభిమానులు ఓ వీడియో రిలీజ్ చేశారు. పాక్ విజయాలన్నింటినీ ఏకరవు పెడుతూ భారత్, జట్టు సభ్యులను ఎండగడుతూ వేసిన వ్యంగాస్త్రం ఇది.
 
రెస్పాన్స్ అదుర్స్...
ఇక దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు స్టార్ స్పోర్ట్స్‌లో ‘మౌకా మౌకా’ ప్రకటన టెంపోను తారస్థాయికి తీసుకెళ్లింది. ప్రపంచ కప్‌లో భారత్ ఎన్నడూ దక్షిణాఫ్రికాపై గెలవలేదు. ఈ యాంగిల్‌లో... ప్రొటీస్ ఆటగాళ్లు భారత అభిమాని తలుపు తట్టి, ఈసారి చాన్స్ మీది కావచ్చు అంటూ క్రేకర్స్ బాక్స్ ఇచ్చి వెళతారు.

సెటైరికల్‌గా ఉండే ఈ యాడ్‌కు అంతే రేంజ్‌లో రెస్పాన్స్ ఇచ్చారు ఇండియన్ యంగ్‌స్టర్స్. ప్రొటీస్ ఇంత వరకు కప్ గెలవలేదనే యాంగిల్‌లో, వారి లోటుపాట్లను తవ్వే స్టాట్స్‌తో యౌవనిక్ అనే కుర్రాడు రెస్పాన్స్ వీడియోను యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. అందులో సీన్ రిపీట్! భారత ఆటగాడు టపాసుల పెట్టెను దక్షిణాఫ్రికా జట్టుకు ఇచ్చే సీన్ ఇది. ఇప్పటి వరకు రెండున్నర మిలియన్ల మంది పైగా ఈ వీడియో వీక్షించారు.
 
మౌకాపే చౌకా...

భారత్- యూఏఈ మ్యాచ్ ముందు వచ్చిన ‘మౌకా పే చౌకా’ యానిమేటెడ్ వీడియో కూడా తక్కువ గిలిగింతలేం పెట్టలేదు. టీవీ ముందున్న ప్రొటీస్ అభిమానులు ఓటమి తరువాత తమ జట్టు చొక్కా చించేస్తారు. ఈలోగా విరాట్ కొహ్లీ తలుపుతట్టి వారికి టీమిండియా జర్సీ ఇచ్చి వెళతాడు. అది ధరించిన సదరు ఫ్యాన్స్... ఇండియాకు జేజేలు కొడతారు.

తలుపు చాటు నుంచి ఇదంతా చూసిన యూఏఈ కెప్టెన్ చెమటలు పట్టి కుంగిపోతాడు. మరో స్పూఫ్‌లో... కెప్టెన్ బతిమాలుతున్నా భారత్‌తో ఆడేందుకు యూఏఈ ఆటగాళ్లు ససేమిరా అంటారు. ఇంతలో ఇండియన్ చైల్డ్ ఫ్యాన్స్... తలుపు తట్టి వారి ముందే ఓ పాలిథిన్ బ్యాగ్‌లో గాలి ఊది ఠాప్ అని పేల్చేసి పగలబడి నవ్వుకుంటూ వెళ్లిపోతారు.
 
ఐర్లాండ్‌నూ వదల్లేదు...
 వెస్టిండీస్‌పైనా సెటైరికల్ వీడియోలు నడిచాయి. ఇక ఐర్లాండ్‌తో మ్యాచ్‌కు ఈ వైరల్ బాగా ముదిరిపోయింది. ఓ స్పూఫ్‌లో... పాక్ కెప్టెన్ మిస్బా ఉల్‌హక్ చాయ్ కలుపుతుంటే... స్టార్ ఆటగాడు షాహిద్ అఫ్రిదీ పెరట్లో ఇండియా ఆటగాళ్ల డ్రెస్సులు ఉతుకుతుంటాడు. కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్న ధోనీకి మిస్బా చాయ్ అందిస్తాడు. తరువాత ఇద్దరూ కలసి భారత్‌కు జయమంటూ జేజేలు పలుకుతారు. రాబోయే జింబాబ్వే మ్యాచ్‌కూ వ్యంగాస్త్రం మొదలైపోయింది. ఐర్లాండ్ ఆటగాడితో కలసి మ్యాచ్ చూస్తుంటాడు జింబాబ్వే కెప్టెన్.

కాలింగ్ బెల్ మోగుతుంది. డోర్ తీస్తే... ఇండియన్స్. మాకు రావల్సిన పార్శిల్ మీకు వచ్చిందంటూ వారి రూమ్‌లో ఉన్న క్రేకర్స్ బాక్స్‌ను చూపిస్తారు. కావాలనే తమ డ్రెస్సింగ్ రూమ్‌లో దాచుకున్న సదరు ఆటగాళ్లు.. సెలైంట్‌గా బాక్స్‌ను ఇచ్చేస్తారు. అలాగే విరాట్‌పై సెటైర్స్‌లో అనుష్క, ఆమిర్‌ను మిక్స్ చేసిన వీడియోలూ తెగ పేలాయి. వీటిల్లో చాలావరకు ట్యూబ్‌లో మిలియన్‌కు పైనే హిట్స్ వచ్చాయంటే... వీటికి ఏ స్థాయిలో ఆదరణ ఉందో చెప్పక్కర్లేదేమో! తెలుగువన్.కామ్ లోకూడా ‘అతడు’ పేరుతో వరల్డ్ కప్ స్పూఫ్ రిలీజ్ అయింది.

స్పూఫ్స్, క్రికెట్‌, సిటీప్లస్,

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement