హై టెంపర్ | High Temper | Sakshi
Sakshi News home page

హై టెంపర్

Published Sun, Feb 15 2015 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 9:19 PM

High Temper

క్రికెట్.. క్రికెట్.. క్రికెట్... ఇదీ ఇప్పుడు సిటీ హార్ట్‌బీట్. నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న ప్రపంచ కప్ రానే వచ్చింది. ఫైట్ మొదలైపోయింది. ఆతిథ్య జట్లు తొలిరోజు దుమ్ము లేపేశాయి.. ఓకే! ఇక అసలుసిసలు మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. మరి కాసేపట్లో చాంపియన్లు పులుల్లా కదన రంగంలోకి అడుగు పెట్టనున్నారు. పాక్‌తో హైటెంపర్ ఫైట్‌కు సై అంటున్నారు. తొలి మ్యాచ్‌లోనే మహా పోరాటం. విశ్వవిజేతలుగానే కాదు... ప్రపంచ కప్ పోరులో దాయాదులపై ఓటమి ఎరుగని ధీరులుగా ఘన చరిత్ర. దీన్ని తిరగరాయాలని భారత్ బాయ్స్ ఉబలాటపడుతుంటే... వారిని ఉత్సాహపరిచేందుకు యావత్ దేశం రెడీ అయిపోయింది. ఇక సిటీలో అయితే ఈ ఫీవర్ హైరేంజ్‌కు వెళ్లిపోయింది. కుర్రకారు అడ్డాలైన కాలేజీలు, క్లబ్‌లు, పబ్‌లు, మైదానాలే కాదు... ఉద్యోగస్తులు, సీనియర్ సిటిజన్లకు మీటింగ్ ప్లేసులైన రెస్టారెంట్లు, పార్కులు, థియేటర్లు, ఐటీ జోన్‌లు ‘క్రికెట్ బీట్’తో క్రేజీగా మారిపోయాయి. బిగ్‌స్క్రీన్‌లపై ఈ మజాను అందిస్తున్నాయి. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మొదలైనప్పటి నుంచీ... ఈ టెంపరేచర్ టాలీవుడ్‌ను మరింత షేక్ చేస్తోంది. తారలు ఎవరికి వారు మ్యాచ్‌లను ఫుల్‌రేంజ్‌లో ఎంజాయ్ చేసేందుకు ప్లానింగ్ చేసేసుకున్నారు. కప్ గెలిచే సత్తా ఎవరెవరికి ఏ స్థాయిలో ఉందో కూడా స్టాట్స్ సాక్షిగా ఎనలైజ్ చేసుకుంటున్నారు. సచిన్, సెహ్వాగ్, గంభీర్, యువరాజ్... గత సమరంలోని మెగాస్టార్లు ఎవరూ ఈసారి లేకపోయినా... కొండనైనా ఢీకొట్టే ధైర్యం ఉన్న ధోనీ, అతడికి కొండంత అండ విరాట్ ఉండగా భారత్‌కు ఈసారీ గెలుపు ఖాయమంటున్నారు తారలు.
 
నా బెస్ట్ ప్లేయర్ రోహిత్

భారత్ కుర్రాడనగానే ఠక్కున గుర్తొచ్చేది క్రికెట్టే. ఈ వరల్డ్ కప్‌లో నా ఓటు ధోనీ సేనకే. ఫేవరెట్ బ్యాట్స్‌మన్ రోహిత్‌శర్మ. ఈ టోర్నీలో శతకాలతో కీలకపాత్ర పోషిస్తాడనుకుంటున్నా. బౌన్సీ పిచ్‌లపై హడలెత్తించే ఆస్ట్రేలియా బౌలర్ మిషెల్ జాన్సన్‌కు సొంతగడ్డపై ఆడటం ప్లస్ పాయింట్. చిన్నప్పటి నుంచే క్రికెట్ ఆడుతున్నా. బేగంపేట హెచ్‌పీఎస్ అండర్-14 జట్టుకి ఆడా. ఆ అనుభవమే సీసీఎల్‌లో పనికొచ్చింది. మూడేళ్ల నుంచి ఆడుతున్న ఈ లీగ్‌లో ఈసారి 20 బంతుల్లోనే 50 పరుగులు చేశా. సీసీఎల్ ట్రోఫీ గెలుపుతో వరల్డ్‌కప్ నెగ్గినంత ఫీలింగ్.  
 - నిఖిల్
 
క్రికెట్ మన హక్కు

క్రికెట్‌ను చూడటం కంటే ఆడటానికే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తా. స్కూల్ డేస్ నుంచే క్రికెట్ ఆడుతున్నా. ఫ్రెండ్స్‌తో కలిసి గల్లీగల్లీలో బ్యాట్ పట్టుకొని బంతిని బాదేవాడిని. క్రికెట్‌ను మన హక్కుగా భావిస్తా. భారత క్రికెటర్లలో ధోనీ బాగా ఇష్టం. గత వరల్డ్‌కప్‌లో అతను వన్‌మ్యాన్ షోతో గెలిపించిన విజయాలు మరవలేనివి. ఈ ప్రపంచకప్‌లో టీమిండియా విజయం కష్టంగానే కనబడుతోంది. అయినా సమష్టి మంత్రం జపిస్తే విక్టరీ దరిచేరవచ్చు. బౌన్సీ పిచ్‌లున్న ఆసీస్‌లో ఆతిథ్య జట్టే బెస్ట్‌గా కనబడుతోంది.     
 - సందీప్ కిషన్
 
మనదే గెలుపు...

వరల్డ్‌కప్‌లో నేడు పాకిస్థాన్‌తో భారత్ ఆడే మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా. భారత్‌దే విజయం. రికార్డులు కూడా అదే చెబుతున్నాయి. నా ఫేవరెట్ కొహ్లీ. ఈ కప్‌లో అదరగొడతాడనుకుంటున్నా. నా స్నేహితులు 20 మంది భారత్, పాక్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా వెళ్లారు. కప్ కొట్టాలంటే ఇండియా బాగా కష్టపడాలి. ఐపీఎల్ మ్యాచ్‌ల అనుభవం మనకు కలిసొస్తుంది. మద్రాస్‌లో ఉన్నప్పుడు నేను రోడ్లపైనే క్రికెట్ ఆడేవాడిని. సిటీకి వచ్చాక ఫిల్మ్‌నగర్‌లో ఆడా. ఎంత బిజీగా ఉన్నా.. ఏడాదిలో కనీసం రెండు, మూడు మ్యాచ్‌లైనా ఆడుతుంటా.     
- అల్లరి నరేష్
 
కొహ్లీ సూపర్

క్రికెట్ అంటే చచ్చేంత ఇష్టం. వరల్డ్ కప్ మ్యాచ్‌లు టైమ్ చిక్కినప్పుడల్లా చూస్తా. అభిమాన జట్టు ఇండియా. ఫేవరెట్ ప్లేయర్ కొహ్లీ. కప్పు కొట్టే సత్తా భారత్‌కే ఉంది. మన ఆటగాళ్లు సమష్టి కృషితో కప్‌తో తిరిగివస్తారనుకుంటున్నా. మిగతా జట్లు కూడా పటిష్టంగానే కనబడుతున్నా మన యువమంత్రం ఫలిస్తే దానిముందు అవన్నీ హుష్‌కాకే. భారత్-పాక్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. రోజంతా టీవీ ముందే. స్కూలు, కాలేజీ స్థాయిల్లో ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా క్రికెట్ ఆడేదాన్ని. సీసీఎల్ టాలీవుడ్ టీమ్‌కు సపోర్‌‌ట చేశా.              
- రకుల్ ప్రీత్‌సింగ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement