ముల్తాన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 127 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ నిర్దేశించిన 251 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్ చేతులెత్తేసింది. పాక్ స్పిన్నర్లు సాజిద్ ఖాన్ (15-3-50-5), అబ్రార్ అహ్మద్ (11.3-2-27-4), నౌమన్ అలీ (10-1-42-1) చెలరేగడంతో విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 123 పరుగులకే కుప్పకూలింది.
విండీస్‌ను గెలిపించేందుకు అలిక్ అథనాజ్ (55) విఫలయత్నం చేశాడు. విండీస్ ఇన్నింగ్స్‌లో క్రెయిగ్ బ్రాత్‌వైట్ (12), మికైల్ లూయిస్ (13), టెవిన్ ఇమ్లాచ్ (14), కెవిన్ సింక్లెయిర్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. కీసీ కార్తీ 6, జస్టిన్ గ్రీవ్స్ 9, కవెమ్ హాడ్జ్, మోటీ, వార్రికన్ డకౌటయ్యారు.
ఏడేసిన వార్రికన్
విండీస్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జోమెల్ వార్రకన్ (18-3-32-7) స్పిన్ మాయాజాలం దెబ్బకు పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 157 పరుగులకే ఆలౌటైంది. గుడకేశ్ మోటీ ఓ వికెట్ తీయగా.. ఇద్దరు పాక్ ఆటగాళ్లు రనౌట్ అయ్యారు. పాక్ ఇన్నింగ్స్‌లో షాన్ మసూద్ (52) టాప్ స్కోరర్ కాగా.. ముహమ్మద్ హురైరా 29, బాబర్ ఆజమ్ 5, కమ్రాన్ గులామ్ 27, సౌద్ షకీల్ 2, మహ్మద్ రిజ్వాన్ 2, సల్మాన్ అఘా 14, నౌమన్ అలీ 9, సాజిద్ ఖాన్ 5, ఖుర్రమ్ షెహజాద్ డకౌటయ్యారు.
పాక్ స్పిన్నర్ల మాయాజాలం
అంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 137 పరుగులకే కుప్పకూలింది. నౌమన్ అలీ (11-2-39-5), సాజిద్ ఖాన్ (12-0-65-4), అబ్రార్ అహ్మద్ (1.2-1-6-1) విండీస్ నడ్డి విరిచారు. విండీస్ ఇన్నింగ్స్‌లో 10, 11వ నంబర్ ఆటగాళ్లు వార్రికన్ (31 నాటౌట్), జేడన్ సీల్స్ (22) మాత్రమే 20కి పైగా పరుగులు చేశారు. బ్రాత్‌వైట్ (11), కెవిన్ సింక్లెయిర్ (11), మోటీ (19) రెండంకెల స్కోర్లు చేయగా.. మికైల్ లూయిస్ (1), కీసీ కార్తీ (0), కవెమ్ హాడ్జ్ (4), అలిక్ అథనాజ్ (6), జస్టిన్ గ్రీవ్స్ (4), టెవిన్ ఇమ్లాచ్ (6) సింగిల్ డిజిట్ స్కోర్లకే టపా కట్టేశారు.
రాణించిన షకీల్, రిజ్వాన్
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 230 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (84), మహ్మద్ రిజ్వాన్ (71) అర్ద సెంచరీలు సాధించి పాక్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో షాన్ మసూద్ 11, ముహమ్మద్ హురైరా 6, బాబర్ ఆజమ్ 8, కమ్రాన్ గులామ్ 5, సల్మాన్ అఘా 2, నౌమన్ అలీ 0, సాజిద్ ఖాన్ 18, ఖుర్రమ్ షెహజాద్ 7 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో వార్రికన్, జేడన్ సీల్స్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. కెవిన్ సింక్లెయిర్ 2, మోటీ ఓ వికెట్ దక్కించుకున్నారు.
ఈ గెలుపుతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో పాక్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ ఇదే వేదికగా జనవరి 25 నుంచి ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment