
ఓఆర్‌ఆర్‌లో సైకిల్ ట్రాక్ !
సాక్షి, హైదరాబాద్ : నగరానికే తలమానికమైన ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)లో ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేసే దిశగా హైదరాబాద్ మహానగరపాలిక అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) అడుగులు వేస్తోంది. నార్సింగ్ నుంచి కొల్లూరు వరకు దాదాపు 12 కిలోమీటర్ల మేర సైకిల్ ట్రాక్‌ను నిర్మించ నుంది. ఓఆర్‌ఆర్ మెయిన్ క్యారేజ్, సర్వీస్ రోడ్డు మధ్యలో ఉన్న 25 మీటర్ల ఖాళీ స్థలంలో 6 నుంచి 8మీటర్ల వెడల్పుతో ఈ ట్రాక్‌ను ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించనుంది.
సైకిలిస్టులు సేద తీరేలా జంక్ష న్‌ల వద్ద బెంచ్‌లు కూడా ఏర్పాటు చేయనుంది. హెచ్‌ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు ఈ మార్గంలో పర్యటించిన తర్వాత ఈ సైకిల్ ట్రాక్ ఆలోచన పట్టాలెక్క నుంది. గతంలో నార్సింగ్ నుంచి ఎదుల నాగులపల్లి వరకు దాదాపు 50 కిలోమీటర్ల వరకు సైకిల్ ట్రాక్ నిర్మిద్దామని అనుకున్నా వ్యయం ఎక్కువ కావడంతో పనులను అటకెక్కించేశారు. ఈసారి అలా కాకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నారు.
నార్సింగ్ నుంచి కొల్లూరు వయా కోకాపేట మార్గంలో ఎక్కువగా ఐటీ ఉద్యోగులే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. ఐటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో వందలాది సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉండటంతో వేలల్లో ఉద్యోగులు కార్లు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో వస్తున్నారు. దీంతో కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. దీనికితోడు ఎలాంటి శారీరక శ్రమ లేకపోవడంతో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని ఓఆర్‌ఆర్‌లో సైకిల్ ట్రాక్ అందుబాటులోకి తీసుకురావాలన్న మంత్రి కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగా హెచ్‌ఎండీఏ అధికారులు చర్యలు తీసుకుం టున్నారు.
నార్సింగ్ నుంచి కొల్లూరు వరకు ఐటీ ఉద్యోగులు సైకిల్‌పై కార్యాలయాలకు వచ్చేలా ప్రోత్సహించడంతో పాటు ఉదయం, సాయంత్రం వేళలో సైక్లింగ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఐటీ ఉద్యోగులు కొల్లూరులో వాహనాలు ఆపేందుకు పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసే అంశంపై దృష్టి సారించారు. హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్, హైదరాబాద్ సైక్లింగ్ క్లబ్‌ల సహకారంతో వీలైతే సైక్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి అద్దె ప్రాతిపదికన సైకిల్ ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. నెదర్లాండ్‌లోని సైక్లింగ్ ట్రాక్‌ల తరహాలో ఇక్కడ కూడా సైక్లింగ్ వసతులను అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నామని, సాధ్యమైనంత తొందరగా ఈ పనులు చేస్తామని ఓఆర్‌ఆర్ సీజీఎం ఆనంద్ మోహన్ తెలిపారు.