సికింద్రాబాద్: ప్రయాణికుల దృష్టి మళ్లించి నగదు, నగలు ఎత్తుకెళ్తున్న ఓ ఘరానా ముఠా ఆట కట్టించారు గోపాలపురం పోలీసులు. నిందితుల నుంచి 105 తులాల బంగారు నగలు, 370 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర మండలం డీసీపీ ఆర్.జయలక్ష్మి, గోపాలపురం ఏసీపీ కె.శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం...
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, జూబ్లీబస్‌స్టేషన్ ప్రాంతాల్లో మహిళా ప్రయాణికుల నగల చోరీతో పాటు జేబు దొంగతనాలు ఎక్కువగా జరుగుతుండటంతో నిందితులను పట్టుకొనేందుకు ఉత్తర మండలం ఎస్‌ఐలు ఎంఎస్‌వీ కిషోర్, భాస్కర్‌రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పక్కా పథకం ప్రకారం రెక్కీ నిర్వహించిన ఈ బృందం.. రైల్వేస్టేషన్ ప్రాంతంలో సంచరిస్తున్న నిందితులు నలుగురినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది.
ఓల్డ్ అల్వాల్ సూర్యనగర్‌లో నివాసముండే ఆవుల గణేష్ అలియాస్ ఆకుల రాజు (40) పాత నేరస్తుడు. ఎనిమిదేళ్లుగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో దృష్టి మళ్లించి చోరీలు, జేబుదొంగతనాలు చేస్తున్నాడు. గతంలో పలుమార్లు జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదయ్యాడు. అనంతపురం జిల్లాకు చెందిన మరో నిందితురాలు దుర్గ (35) ఇదే తరహా నేరాలు చేస్తోంది. ఇటీవల బోయిన్‌పల్లి పోలీసులు దుర్గను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, జైలు నుంచి బెయిల్ విడుదలైన ఆవుల గణేష్ తన తరహాలోనే దోపిడీలకు పాల్పడే దుర్గతో పాటు అనంతపురం పట్టణానికి చెందిన గొల్ల సురేష్ (25), బలిజ ప్రశాంత్‌కుమార్ (28)తో కలిసి ముఠాను ఏర్పాటు చేశాడు. రద్దీగా ఉండే బస్సుల్లో ప్రయాణిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. మహిళల వద్ద దుర్గ అపహరించిన నగలను గణేష్ బృందం బయటికి తరలిస్తుంది.
గణేష్ బృందం మహంకాళి, గోపాలపురం, మార్కెట్, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, కార్ఖానా, బొల్లారం పోలీస్‌స్టేషన్ల పరిధిలోని బస్టాప్‌ల్లో చోరీలకు పాల్పడింది. నలుగురినీ అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి కిలో 50 గ్రాముల (105 తులాలు) బంగారు ఆభరణాలు, 370 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
దొంగల ముఠాకు చెక్
Published Thu, Oct 23 2014 12:33 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 PM
Advertisement