రెండు కర్రలు తాకడంతో శ్రావ్యంగా వినిపించే శబ్దం.. చీమల వరుస కదిలినట్లుగా లయబద్ధంగా సాగే ఆ నృత్యం.. కళ్లు మిరుమిట్లు గొలిపేలా ఒకే రంగు వస్త్రాలతో మహిళల కదలికలు.. వెరసి కోలాటం.. ఆ ఆట ఇటీవలి కాలంలో ఎంతో ఆదరణ సంపాదించుకుంది. అధ్యాత్మిక కార్యక్రమమైనా.. పెళ్లి తంతు అయినా.. ఉత్సవాలు జరుగుతున్నా.. ఆ కోలాటం ఉంటే ఎంతో ఆకర్షణీయంగా మారుతోంది. ప్రస్తుతం ఎవరు కార్యక్రమం చేసినా కోలాటం ఉండేలా చూసుకుంటున్నారు. ఒకానొకప్పుడు పల్లెల్లో మాత్రమే కనిపించిన ఈ నృత్యం ఇప్పుడు పట్టణాలకు, మహానగరాలకు పాకి ఆహూతులను అలరిస్తోంది.
సాక్షి, పాల్వంచ : రెండు కర్రలతో సందడి చేసే కోలాట నృత్యం పాత తరంలో పల్లెల్లో మాత్రమే కనిపించేంది. నాటి సంప్రదాయ నృత్యం ప్రస్తుతం పట్టణాల్లోనూ క్రేజ్‌ను సొంతం చేసుకుంటోంది. ఆధ్యాత్మిక కార్యాక్రమాలు ఎక్కడ జరిగినా అక్కడ కోలాట నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. ఎంతో కనువిందు చేసేలా కోలాట నృత్యాలు ఆడుతుంటే నిల్చుని చూస్తుండి పోతాం. దైవ కార్యక్రమాలను మరింత శోభాయమానంగా మార్చుతుంటాయి. పాదం పాదం కలుపుతూ చేతుల్లోని కోలాట కర్రలను కొడుతూ (శబ్దం చేస్తూ) వారు చేసే ప్రదర్శన ఎంతో హృత్యంగా ఉంటుంది.
ఇలాంటి కోలాట కార్యక్రమాలకు ప్రసిద్ధిగా మారింది పాల్వంచలోని తిరుమల తిరుపతి దేవస్థానం వారి హరే శ్రీనివాస కోలాట భజన మండలి. పాల్వంచ కొత్తగూడెం, విజయవాడ, శ్రీశైలం, భద్రాచలం, చిన్నతిరుపతి, పెద్దతిరుపతితో పాటు పలు ఆధ్యాత్మిక దేవాలయాల ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల్లో ఈ కోలాట బృందం తమదైన శైలిలో నృత్య ప్రదర్శనలు ఇస్తూ పలువురి మన్ననలు పొందుతోంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు. ఉచితంగా పలువురికి శిక్షణ ఇస్తున్నారు.
కోలాటంలో అందెవేసిన చేయి
2012లో పాల్వంచ వర్తక సంఘ భవనంలో సత్తుపల్లికి చెందిన అచ్యుత వాణి అనే శిక్షకురాలి వద్ద బేర శ్రీలక్ష్మి శిక్షణ తీసుకుని అనతి కాలంలోనే అనేక ప్రదర్శనలు ఇస్తూ ప్రాచుర్యం పొందారు. కోలాట నృత్యాల్లో మాలిక, రౌండ్ మాలిక, దేవుడి చుట్టూ ప్రదర్శన చేసి మాల వేయడం, కవ్వాయి, ఎదురుదండ, ప్రార్థన కోపు, గణపతి కోపు, నాగిని కోపు, కృష్ణుడి కోపు, హారతి కోపు, జడ కోపు, లోపలి దండ, పడవకోపు, అర్ధచక్రం, పునర్‌ఆహ్వానం, బెండు కోపు, బిందెల కోపు, లక్ష్మి కోపు, దుర్గమ్మ కోపు, విష్ణుచక్రం కోపు, భూమాతకు హారతి తదితర సుమారు 30 రకాల నృత్యాలు చేస్తున్నారు.
గతంలో గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైన కోలాటంపై నేడు పట్టణవాసులు సైతం మక్కువ చూపిస్తున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ ఆటను ఆడేందుకు ఆసక్తి కనబరుస్తుండటం గమనార్హం. 2014 నుంచి శ్రీలక్ష్మి పాత పాల్వంచ, పెద్దమ్మ తల్లి ఆలయం, శ్రీరామాలయ భజన మందిరంలో పలు కోలాట బృందాలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 200 మందిని ఈ నృత్యంలో తీర్చిదిద్దారు.
ఆధ్యాత్మిక సేవలో..
తిరుపతిలో రథసప్తమి, బ్రహోత్సవాలు, భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వెంకటేశ్వరస్వామి కల్యాణం, రథయాత్రలు, శివరాత్రి, దసరా, వినాయకచవితి తదితర సందర్భాలతో పాటు ఎలాంటి దైవ సేవ కార్యక్రమాలు ఉన్నా కోలాట ప్రదర్శనలు ఇస్తుంటారు.
కురుస్తున్న ప్రశంసలు
నృత్య ప్రదర్శనలు ఇస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు బేర శ్రీలక్ష్మి. 2017లో పాత పాల్వంచలో గజ్జ పూజ సందర్భంగా రెండు సార్లు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చేతుల మీదుగా సన్మానం పొందారు. టీచర్స్‌డే నాడు వాసవీక్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక సత్కారం పొందారు. ఈ ఏడాది భద్రాచలంలో జాతీయస్థాయి ‘ఆట’అవార్డును అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment