ప్రమాదకరంగా హైదరాబాద్
నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారి
ప్రాణాలు మింగుతున్న వేగం
పెరుగుతున్న ప్రమాదాలు
భయాందోళనలో ప్రయాణికులు
కనిపించని సూచిక బోర్డులు
అతివేగం, వాహన చోదకుల నిర్లక్ష్యం నిండుప్రాణాలను బలిగొంటోంది. హైదరాబాద్ - నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారిపై గత నెల రోజుల నుంచి రోడ్డు ప్రమాదాల సంఖ్య అధికమయ్యింది. రహదారిపై ఎక్కడో ఒక చోట నిత్యం చోటుచేసుకుంటున్న ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళన కలిగిస్తున్నాయి. వాహనచోదకుల అతివేగం కుటుంబాల్లో విషాదం నింపుతోంది. వారి కుటుంబాలను రోడ్డున పడేస్తుంది. ఇంట్లో నుంచి వెళ్తే తిరిగి వచ్చేదాకా ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
- చింతపల్లి
నిత్యం వందల సంఖ్య లో లారీలు, ఆటో లు, బస్సులు, ప్రైవేట్ వాహనాల రాకపోకలతో హైదరాబాద్ - నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారి రోజు రో జుకు రద్దీగా మారుతోంది. ప్రైవేట్ వాహనాల చోదకులు రోడ్డుపై నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతుండటమే ప్రమాదాలకు కారణమని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ప్రమాదాలన్నింటికీ అతి వేగమే కారణమని స్పష్టమవుతోంది. గత నెల మండలంలోని తక్కెళ్లపల్లి వద్ద పెళ్లి లారీ బోల్తా కొట్టిన సంఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృత్యువాత పడగా 32మందికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం గత నాలుగు రోజుల వింజ మూరు చైతన్యభారతి పాఠశాల సమీపంలో లారీ, డీసీఎం అతివేగంతో ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో డీసీఎం డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా లారీడ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రెండు వాహనాలు అతి వేగంగా ఢీకొట్టుకోవడంతో లారీ, డీసీఎం క్యాబిన్లలో డ్రైవర్లు చిక్కుకుపోవడంతో సుమారు రెండు గంటలపాటు పోలీసులు శ్రమించి మృతదేహాన్ని, క్షతగాత్రుడిని బయటకు తీశారు. ఈ సంఘటన చూస్తే వాహనాలు ఎంత వేగంగా వస్తున్నాయో అర్థమవుతుంది.
ఇటీవల జరిగిన కొన్ని ప్రమాదాలు
మండలంలోని రోటిగడ్డతండాకు చెందిన పెళ్లి లారీ తక్కెళ్లిపల్లి గ్రామ శివారు వద్ద అతి వేగంతో వచ్చి బోల్తా కొట్టడంతో లారీలో ఉన్న ఇద్దరు మృత్యువాత పడగా 32 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
రాష్ట్ర రహదారిపై వింజమూరు సమీపంలో లారీ, డీసీఎం ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో ఒకరు మృత్యువాతపడగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
వెంకటంపేట వద్ద ఇటుకలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడటంతో ట్రాక్టర్‌పై వస్తున్న ఆరుగురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి.
చింతపల్లి మైసమ్మ దేవాలయం సమీపంలో కల్వర్టు వద్ద అదుపు తప్పి డీసీఎం బోల్తా కొట్టడంతో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
వింజమూరు సమీపంలో డీసీఎం, లారీ ఢీకొట్టిన సంఘటన మరుసటి రోజు వాహనాలు రోడ్డుపైనే ఉండటంతో హైదరాబాద్ వైపు నుంచి చింతపల్లి వస్తున్న ఓ వ్యక్తి ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి.
చింతపల్లి పెట్రోల్‌బంక్ సమీపంలో రెండు బైక్‌లు ఢీకొట్టుకొవడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
మండల పరిధిలోని మాల్ వెంకటేశ్వరనగర్‌లో రెండు బైక్‌లు ఢీకొట్టుకోవడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
సూచిక బోర్డులు ఏవీ ?
హైదరాబాద్ - నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారి సింగిల్ రోడ్డు కావడంతో ఇరుకుగా ఉంది. దీనికి తోడు వాహనాలు మితిమీరిన వేగంతో వెళ్తున్నాయి. ఈ కారణంగా ప్రమాదాలు అధికంగా సంభవిస్తున్నాయని వాదనలు ఉన్నాయి. మండలంలోని నసర్లపల్లి, వెంకటంపేట, కొక్కిరాల గౌరారం, వింజమూరు శివారు, చింతపల్లి పెట్రోల్‌బంక్, విరాట్‌నగర్, చైతన్యభారతి పాఠశాల, ప్రశాంతపురితండా, మదనాపురం, పోలేపల్లి గేటుల వద్ద ప్రమాదకరంగా మూలమలుపులు ఉన్నప్పటికీ అధికారులు వేగనిరోదక సూచిక బోర్డులను ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. అధికారులు స్పందించి సామర్థ్యానికి మించి ప్రయాణికులను తీసుకెళ్తున్న వాహనాలను తనిఖీ చేస్తూ రహదారులపై వేగనిరోదక సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తే ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
రోజు రోజుకూ పెరుగుతున్న ప్రమాదాల సంఖ్య
హైదరాబాద్ - నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారిపై రోజు రోజుకూ ప్రమాదాలు పెరుగుతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు చోటు చేసుకుంటుండడంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రమాదాలు అరికట్టాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో గమ్య స్థానాలకు చేరుతామా లేదా అన్న పరిస్థితి నెలకొందని ప్రయాణికులు వాపోతున్నారు. రాష్ట్ర రహదారి మరమ్మతులకు గురికావడంతో అక్కడక్కడా గుంతలు ఏర్పడి, నూతనంగా కొన్ని రోజుల క్రితం చేపట్టిన త్రీ ఫేజ్ సాగర్ నీటి పైప్‌లైన్ పనుల కారణంగా రోడ్డు అధ్వానంగా మారింది. కొన్ని చోట్ల రోడ్డు బాగా ఉన్నా వాహనాలు మితిమీరిన వేగంగా వస్తుండటంతో ప్రమాదాలు పెరిగిపోతున్నాయని పలువురు పేర్కొంటున్నారు.
గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు సరిగ్గా లేకపోవడంతో మండలంలో ప్రైవేట్ వాహనాల సంఖ్య అధికమవుతుంది. భద్రత కరువైన ఈ వాహనాలలో ప్రయాణిస్తూ ప్రజలు ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. దీని కారణంగా రహదారులు అధ్వానంగా మారడంతో పాటు ప్రైవేట్ వాహనాలు సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కించుకుంటున్నారు. పంచాయతీరాజ్ అధికారులు రహదారులకు మరమ్మతులకు నిర్వహించకపోగా ఆర్టీఏ అధికారులు వాహనాలు తనిఖీ చేయడంతో ప్రమాదాలు పెరగడానికి కారణమవుతున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదాలు సంభవించిన సందర్భాలలో హడావుడి చేస్తున్న అధికారులు తర్వాత నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండటంతో అమాయకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని పలువురు పేర్కొంటున్నారు.
రుధిరదారి..!
Published Thu, May 21 2015 12:52 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement