
తండ్రిని చంపిన కూతురు!
సేవలు చేయలేక.. ఉరేసి చంపింది
సంగారెడ్డి రూరల్ : ఓ కూతురు కన్నతండ్రినే పొట్టన పెట్టుకుంది. పక్షవాతంతో మంచాన పడ్డ తండ్రికి సేవ చేయడం ఇష్టంలేక మట్టుబెట్టింది. మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కలివేములకు చెందిన మహ్మద్ జహంగీర్(73)కు నలుగురు కూతుళ్లు. జహంగీర్‌కు ఇటీవలే పక్షవాతం వచ్చింది. తండ్రిని ఒక్కో కూతురు ఒక్కోనెల అతడి బాగోగులు చూసుకునేలా ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందంలో భాగంగా హత్నూర మండలం రుస్తుంపేటకు చెందిన చిన్న కూతురు షహనాజ్ తండ్రి జహంగీర్‌ను చూసుకోవడానికి కలివేములకు వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం ఆమె తన తండ్రి మెడకు చీరతో ఉరివేసి చంపింది.
ముందస్తు పథకంలో భాగంగా సదాశివపేటకు వెళ్లి వస్తానంటూ, తన తండ్రిని చూడాలని ఇరుగుపొరుగు వారితో చెప్పి వెళ్లింది. తిరిగి వచ్చిన షహనాజ్ తన తండ్రి మృతి చెందాడని రోదించడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. శవాన్ని పరిశీలించిన ఎస్‌ఐ ప్రసాద్‌రావు అనుమానంతో షహనాజ్‌ను విచారించగా, తన తండ్రి జహంగీర్‌ను తానే ఉరివేసి చంపినట్లు ఒప్పుకుంది.