మృత్యు గంటలు మధ్యాహ్నం 3–6 | Dead bells timing's is afternoon 3-6 | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 25 2017 3:04 AM | Last Updated on Thu, Aug 30 2018 4:15 PM

Dead bells timing's is afternoon 3-6 - Sakshi

సాక్షి, తెలంగాణ డెస్క్‌: దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం మధ్యాహ్నం పూటే జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వ తాజా గణాంకాలు వెల్లడించాయి. 2016లో దేశంలోమొత్తం 4,80,652 రోడ్డు ప్రమాదాలు జరిగితే.. అందులో 85,834(18 శాతం) ప్రమాదాలు మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటలలోపే జరిగాయని కేంద్ర రహదారులు, హైవేల మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. దేశంలో 2005–2016 మధ్య కాలంలో సుమారు 15,50,098 మంది రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయారని ఈ నివేదిక వెల్లడించింది. 2016లో ప్రతి రోజు 1,317 ప్రమాదాలు(ప్రతి గంటకు 55) నమోదయ్యాయని, మొత్తం ప్రమాదాల్లో 1,50,785 మంది ప్రాణాలు కోల్పోయారని(ప్రతి గంటకు 17 మంది లేదా ప్రతి మూడు నిమిషాలకు ఒక మరణం), 4,94,624 మంది క్షతగాత్రులు అయ్యారని పేర్కొంది. ఈ మరణాల్లో 25 శాతం లేదా 38,076 మంది 25 నుంచి 35 ఏళ్ల వయసు మధ్యవారేనని తెలిపింది. మధ్యాహ్నం తర్వాత ఎక్కువ ప్రమాదాలు జరిగేది సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్యనే అని ఈ నివేదిక వెల్లడించింది. 2016లో 6 నుంచి 9 మధ్యలో 84,555 ప్రమాదాలు నమోదయ్యాయని చెప్పింది. 2016లో దేశంలో జరిగిన మొత్తం ప్రమాదాల్లో 35 శాతం మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య జరిగినవే. 

డ్రైవర్‌ తప్పిదాల వల్లే.. 
రోడ్డు ప్రమాదాలకు అతి ప్రధాన కారణం డ్రైవర్‌ తప్పిదాలే. 2016లో నమోదైన మొత్తం ప్రమాదాల్లో 84 శాతం లేదా 4,03,598 ప్రమాదాలకు కారణం ఇదే. మొత్తం మరణాల్లో 80 శాతం లేదా 1,21,126 మరణాలు డ్రైవర్‌ తప్పిదం వల్లే సంభవించాయి. డ్రైవర్‌ తప్పిదాల్లో మితిమీరిన వేగమే ప్రమాదాలకు కారణం. మొత్తం 4,03,598 ప్రమాదాల్లో 66 శాతం లేదా 2,68,341 ప్రమాదాలు ఓవర్‌ స్పీడ్‌ వల్లే జరిగాయి. దీని వల్ల 73,896 మంది లేదా 61 శాతం ప్రాణాలు కోల్పోయారు. 2016లో నమోదైన మొత్తం ప్రమాదాల్లో 34 శాతం లేదా 1,62,280 ప్రమాదాలు టూవీలర్స్‌ వల్లే జరిగాయి. అంటే ప్రతి గంటకు 19 ద్విచక్ర వాహన ప్రమాదాలు నమోదయ్యాయి. వీటిలో 52,500 మంది(రోజుకు 144 మంది.. గంటకు ఆరుగురు) ప్రాణాలు కోల్పోయారు.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement