మృతదేహానికి వైద్యం! | deadbody operation in Godavarikhani Govt hospital | Sakshi
Sakshi News home page

మృతదేహానికి వైద్యం!

Published Sat, Jan 24 2015 12:51 AM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM

మృతదేహానికి వైద్యం! - Sakshi

మృతదేహానికి వైద్యం!

కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో ఐదు రోజుల బాలింత వైద్యుల నిర్లక్ష్యం వల్ల మృతి చెందింది.

గోదావరిఖని ప్రభుత్వాస్పత్రి వైద్యుల నిర్వాకం
కోల్‌సిటీ(గోదావరిఖని): కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో ఐదు రోజుల బాలింత వైద్యుల నిర్లక్ష్యం వల్ల మృతి చెందింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలింతను పట్టించుకోని వైద్యులు తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఏకంగా మృతదేహానికి వైద్యం చేస్తున్నట్టు నటించారు. మృతురాలి భర్త చెన్నూరు రమేష్, తల్లి పోచమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. మల్హర్  మండలం తాడిచర్ల గ్రామంలో పాలేరైన రమేష్ భార్య అరుణ (23) రెండోసారి గర్భం దాల్చినప్పటి నుంచి ప్రతినెలా గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది.

ఈ నెల 18న ఆమెకు నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు అదే ఆస్పత్రిలో చేర్పించగా కవలలున్నట్లు గుర్తించిన వైద్యులు మరుసటిరోజు సిజేరియన్ చేశారు. కానీ కడుపులోనే ఒక పాప మృతి చెందగా, మరోపాప ఆరోగ్యంగా జన్మించింది. అయితే గురువారం ఉదయం నుంచి కళ్లు, చెవులు పనిచేయట్లేదని అరుణ చెబుతోందంటూ తల్లి పోచమ్మ, భర్త రమేష్ వైద్యుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదు. దీంతో అరుణ శుక్రవారం ఉదయం అపస్మారకస్థితికి చేరుకుని మృతిచెందింది.

విషయం తెలుసుకున్న వైద్యులు తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు అరుణ మృతదేహాన్ని ఆపరేషన్ థియేటర్‌కు తరలించి చికిత్స నాటకం ఆడారు. ఆ తర్వాత ఆస్పత్రిలోని ఓపీ విభాగం సమయం పూర్తయిన తర్వాత అరుణ చనిపోయిందని భర్త రమేష్‌కు తెలిపారు. ఇందులో వైద్యుల నిర్లక్ష్యం లేదని చెప్పి రమేష్ సంతకం తీసుకున్నారు. అరుణ మృతి వార్త తెలుసుకున్న తాడిచర్ల గ్రామస్తులు ఆస్పత్రికి చేరుకొని వైద్యులను నిలదీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement