విద్యుదాఘాతంతో ఒకరి మృతి
దుబ్బాక: అక్కా చెల్లెళ్లకు ఇష్టదైవమైన బతుకమ్మ పూల కోసం అన్నాదమ్ములు చేను, చెలకల్లోకి వెళ్లారు. తీసుకొచ్చిన పూలతో బతుకమ్మను పేర్చడానికి అక్కా చెల్లెళ్లు సిద్ధమవుతున్నారు. మరి కాసేపట్లో గ్రామ చావిడిలో బతుకమ్మలను పెట్టి హుషారుగా, సంతోషంగా ఆడి, పాడడానికి సిద్ధమవుతున్న ఆడపడుచులకు పిడుగు లాంటి వార్త వచ్చింది.
కొండంత పండుగ వేళ.. పేదింట్లో విషాదం అలుముకున్న సంఘటన దుబ్బాక మండలం గంభీర్‌పూర్‌లో బుధవారం జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... కొరిపాక రవి(28) నిరుపేద రజక కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇటీవల తన తండ్రి ఆశయ్య, నాయనమ్మ రాజవ్వలు మరణించారు. వీరు చనిపోయి ఏడాది కూడా పూర్తి కాలేదు. ఇంట్లో బతుకమ్మ, దసరా పండుగలు చేయకపోవడంతో అత్తారింటికి వెళ్లడానికి ఉదయమే స్నానం చేశాడు. ఉతికిన డ్రాయర్, బనియన్‌లను ఇంటిపై ఉన్న వైరుకు ఆరబెట్టేందుకు వెళ్లాడు. అదే వైరుకు ఇంటికొచ్చే సర్వీసు(విద్యుత్) వైర్ ఉందన్న విషయాన్ని గమనించలేక పోయాడు. తడి బట్టలు వేయడంతోనే విద్యుత్ షాక్ తగిలి రవి అక్కడికక్కడే మృతి చెందాడు.మృతుడు రవికి భార్య మానస, ఏడాదిన్నర కూతురు రేష్మిత, వృద్ధురాలైన తల్లి పోశవ్వ ఉన్నారు. తమ్ముడు మహిపాల్ బతుకు దెరువు కోసం సౌదీ దేశం వెళ్లాడు.
ఏడాది లోపే ముగ్గురు మృతి
కొరిపాక పోశవ్వ ఇంట్లో ఏడాది లోపే ముగ్గురు మృతి చెందడం పలువురిని కంటతడి పెట్టించింది. ఇంటికి పెద్ద దిక్కయిన రవితో పాటు ఆమె భర్త ఆశయ్య, అత్త రాజవ్వలు ఏడాది లోపే మరణించడం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమ ఇంట్లో బతుకమ్మ పండుగ పనికి రాకపోవడంతో భార్య మానస, కూతురు రేష్మితలను వారి అమ్మగారింటికి మూడు రోజుల క్రితం పంపించాడు. బతుకమ్మ, దసరా పండగలను పురష్కరించుకుని అత్తగారింటికి వెల్దామనుకున్న రవి ఇలా కరెంట్ షాక్‌తో మరణించడంపై తల్లి పోశవ్వ రోదనలు ఆపడం ఎవరి తరం కాలేదు. ప్రమాదవశత్తు కరెంట్ షాక్‌తో మృతి చెందిన రవి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ చేపూరి పరుశరాములు గౌడ్, బానాల శ్రీనివాస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
పండుగ వేళ.. పేదింట్లో విషాదం
Published Thu, Oct 22 2015 12:14 AM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM
Advertisement