ఇంతింతై.. అన్నట్టుగా రాష్ట్రం అప్పు అంతకంతకూ పెరిగిపోతోంది. కార్పొరేషన్ల పేరుతో తెస్తున్న రుణాలకు అంతూపొంతూ ఉండటం లేదు. ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చిన రూ. 70 వేల కోట్ల వారసత్వ అప్పుతో కలుపుకుంటే తెలంగాణ మొత్తం అప్పు సుమారు రూ.2 లక్షల కోట్లకు చేరింది. మరోవైపు రుణాల వడ్డీ మోతెక్కిపోతోంది. ఈ ఏడాది వడ్డీ కింద ప్రభుత్వం దాదాపు రూ.11,138 కోట్లు చెల్లించనుంది. వ్యవసాయానికి పెట్టుబడి పథకం నేపథ్యంలో వచ్చే ఏడాది కూడా అప్పులు తప్పేలా లేవు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై అప్పుల భారం అంతకంతకూ పెరిగిపోతోంది! రాష్ట్రం ఏర్పడే నాటికి వారసత్వంగా వచ్చిన రూ.70 వేల కోట్ల అప్పు నాలుగేళ్లలో మూడింతలకు చేరువైంది. మొత్తంగా తెలంగాణ రుణభారం ఇంచుమించు రూ.2 లక్షల కోట్లకు చేరింది. తొలి ఏడాది రూ.9 వేల కోట్ల పైచిలుకుతో మొదలైన రుణ ప్రస్థానం.. రెండో ఏడాది రూ.18 వేల కోట్లు, మూడో ఏడాది రూ.35 వేల కోట్లకు చేరింది. నాలుగో ఏడాది 2017 డిసెంబర్ నాటికే రూ.24 వేల కోట్ల రుణం తీసుకుంది. దీంతో వారసత్వంగా వచ్చిన అప్పుతో కలిపి మొత్తం అప్పు సుమారు రూ.1.56 లక్షల కోట్లకు చేరింది. వీటికి తోడు విద్యుదుత్పత్తి, పంపిణీని మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్రం అమల్లోకి తెచ్చిన ఉదయ్ పథకంలో చేరడంతో రూ.8,923 కోట్ల డిస్కంల అప్పు ప్రభుత్వ ఖజానాకు బదిలీ అయింది. కార్పొరేషన్ల పేరుతో అప్పులు తెచ్చేందుకు ముందునుంచీ ప్రభుత్వం ఉత్సాహం చూపడంతో రుణభారం తడిసి మోపెడైంది. ఈ ఏడాది మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు, డబుల్ బెడ్‌రూం ఇళ్లకు వివిధ బ్యాంకుల నుంచి దాదాపు రూ.65 వేల కోట్ల అప్పులు తీసుకుంది. వీటిలో కొన్నింటిని ఖర్చు చేయగా.. ఇంకొన్ని మంజూరు దశలో ఉన్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వ రుణభారం రూ.2 లక్షల కోట్లకు చేరింది.
కార్పొరేషన్ల పేరుతో..
కేంద్రం నిర్దేశించిన ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట పరిధిలోకి లోబడే రాష్ట్రాలు రుణాలు తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర జీఎస్‌డీపీలో 3.25 శాతం మేరకు రుణాలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణను గుర్తించిన కేంద్రం గతేడాది మరో 0.25 శాతం రుణ సమీ కరణకు వెసులుబాటు కల్పించింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.26 వేల కోట్ల మేర అప్పు తెచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీలను విక్రయించింది. వీటితోపాటు కార్పొరేషన్ల పేరుతో అదనంగా తెచ్చిన అప్పులు పెరిగాయి. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి రాకుండా ప్రభు త్వం.. కార్పొరేషన్ల పేరుతో అప్పులు తెచ్చింది. మిషన్ భగీరథ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా తెలంగాణ స్టేట్ వాటర్ గ్రిడ్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. తొలిసారిగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కూడా కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్, పాలమూరు రంగారెడ్డి, లిఫ్ట్ ఇరిగేషన్ అథారిటీ ఈ కోవలోనివే.
కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్‌కు ఈ ఏడాది రూ.24 వేల కోట్లు అప్పు తెచ్చింది. కొత్తగా తుపాకులగూడెం, దేవాదుల, సీతారామ ప్రాజెక్టులకు రుణాలు తెచ్చేందుకు దేవాదుల కార్పొరేషన్ ఏర్పాటుకు ఫైల్ సిద్ధం చేసింది. ఇంటింటికీ తాగునీటిని అందించే మిషన్ భగీరథకు రూ.44 వేల కోట్ల అంచనా వ్యయం అవుతుందని లెక్కలేసిన ప్రభుత్వం.. ఇప్పటివరకు బడ్జెట్ నుంచి ఈ పథకానికి నిధులను కేటాయించలేదు. బడ్జెటేతర నిధులు తెస్తున్నామంటూ అప్పులతోనే 90 శాతం పనులు పూర్తి చేసింది. చివరి ఏడాది రుణ సంస్థలకు ప్రభుత్వ వాటా చెల్లించాల్సి ఉంటు ందని, దీంతో వచ్చే ఏడాది మిషన్ భగీరథ నిధుల సమీకరణ ఇబ్బందిగా మారుతుందన్న అభిప్రాయాలున్నాయి. డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా హడ్కో ద్వారా దాదాపు రూ.10 వేల కోట్ల రుణం తీసుకుంది. కార్పొరేషన్ల పేరుతో రుణ సంస్థల నుంచి అప్పులు తీసుకుంటే భవిష్యత్తులో రాష్ట్ర ఖజానాకే ముప్పు వస్తుం దని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులకు తీసుకుంటున్న రుణం ఖర్చు చేయటమే తప్ప.. పన్నులు, బిల్లుల రూపంలో ప్రభుత్వానికి తిరిగి వచ్చేదేమీ ఉండదని అభిప్రాయపడుతున్నారు. కార్పొరేషన్ రుణాలకు పూచీకత్తు ఇచ్చినందుకు వీటన్నింటినీ భవిష్యత్తులో ప్రభుత్వమే తిరిగి కట్టాల్సిన పరిస్థితి తలెత్తనుంది.
వడ్డీల మోత..
ఇప్పటిదాకా చేసిన అప్పులు, వాటిపై వడ్డీలకు ప్రభుత్వం ఏటా రుణ వాయిదాలు చెల్లిస్తోంది. ఈ ఏడాది దాదాపు రూ.11,138 కోట్ల రుణ వాయిదాలు చెల్లించనుంది. తొలి నాలుగేళ్లలో రైతుల రుణమాఫీకి నిధుల్ని సమీకరించేందుకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చిన ప్రభుత్వం.. వచ్చే ఖరీఫ్ నుంచి వ్యవసాయ పెట్టుబడి పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఏటా దాదాపు రూ.12 వేల కోట్ల నిధులు ఈ పథకానికి అవసరం కావటంతో వచ్చే ఏడాది సైతం అప్పులు తీసుకోక తప్పని పరిస్థితి అనివార్యంగా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment