
ఇక ఇంటింటి సర్వే...
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సంక్షేమ పథకాలు పక్కదారి పట్టకుండా... అర్హులకే అందేలా చూసేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. లబ్ధిదారుల ఎంపికను సరికొత్త రీతిలో చేపట్టేందుకు, అవినీతి, ఆరోపణలకు తావులేకుండా చూసేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇంటింటి సామాజిక ఆర్థిక పరిస్థితులపై సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే సర్కారు వద్ద పూర్తిస్థాయి సమాచారం ఉన్నప్పటికీ.. తాజాగా సరైన లబ్ధిదారుల ఎంపిక కోసం మరోమారు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టేందుకు సిద్ధమవుతోంది.
అయితే ఈ ప్రక్రియ కేవలం ఒకరోజులోనే పూర్తిచేయాలని సర్కారు భావిస్తోంది. ఈమేరకు జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. 2011 జనగణన ప్రకారం జిల్లా జనాభా 52.93 లక్షలు. అదేవిధంగా జిల్లాలో 15.12 లక్షల ఇళ్లున్నాయి. ప్రస్తుతం జిల్లా జనాభా 63 లక్షలున్నట్లు అంచనా. ఇందులో గ్రామీణ ప్రాంతంలో దాదాపు 16 లక్షల జనాభా ఉండగా, పట్టణ ప్రాంతంలో 44 లక్షలు, మున్సిపాలిటీల పరిధిలో 3 లక్షలు జనాభా ఉన్నట్లు అధికారుల ప్రాథమిక గణాంకాలు చెబుతున్నాయి.
దీంతో ఈ జనాభాను కవర్ చేస్తూ రెండ్రోజుల్లో సర్వే పూర్తి చేయాలంటే జిల్లాలో 30,241 మంది సిబ్బంది అవసరం. ప్రస్తుతం జిల్లాలో 12వేల మంది టీచర్లుండగా, మరో 4వేల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులున్నారు. అదేవిధంగా ఇతర శాఖలకు సంబంధించి మరికొందర్ని ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేయనున్నట్లు తెలుస్తోంది.
సూక్ష్మస్థాయిలో పరిశీలన..
తాజాగా సర్కారు చేయాలని భావిస్తున్న సర్వే ప్రక్రియ... అన్నిరకాల సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఖరారు చేసేవిధంగా ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ ఫథకాల వల్ల కేవలం తెలంగాణ వారికే ప్రయోజనం చేకూరాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ సర్వే ఫలితాలు కీలకం కానున్నాయి. సర్వేతో బోగస్‌ల ఏరివేతతో పాటు స్థానికత అంశాన్ని కీలకంగా పరిశీలించనున్నారు.
అయితే ఇంతటి కీలకమైన సర్వే ప్రక్రియను ఒకరోజులో పూర్తిచేయాలనుకోవడంపై పలు సందేహాలు నెలకొంటు న్నప్పటికీ అధికారులు మాత్రం ధీమాగా ఉన్నారు. గతంలో 2011 జనగణన, 2012-13లో నిర్వహించిన సామాజిక, ఆర్థిక సర్వే, ఇటీవల చేపట్టిస ఆర్థిక సర్వే వివరాలను ఇందులో తీసుకుని వీటిని సరిపోల్చుతూ సర్వే చేస్తే సులభతరమవుతుందని చెబుతున్నారు. అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయలేదు.
ఆగస్టు మొదటివారంలో ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. అనంతరం క్షేత్రస్థాయిలో సిబ్బందిని రంగంలోకి దింపే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.