వ్యవస్థల బాగు కోసమే విప్లవాత్మక నిర్ణయాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి వ్యవస్థా బాగుపడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శుక్రవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో విప్‌లు గొంగిడి సునితా, గంప గోవర్ధన్, మరికొందరు పార్టీ ఎమ్మెల్యేలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పంచాయతీరాజ్ స్థానిక సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్ల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలను పెంచుతూ కేసీఆర్ చేసిన ప్రకటన వారిలో ఆనందం నింపిందన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్లకు కేబినెట్ హోదా ఉన్నా తక్కువ వేతనం ఉన్నందుకే వారికీ పెంచారని వివరించారు. అభివృద్ధిలో ఈ వర్గాలను భాగస్వాములను చేయడంతోపాటు గ్రామీణ పాలనను బలోపేతం చేసేందుకు వేతనాల పెంపుదల నిర్ణయం తీసున్నట్లు ఆయన తెలిపారు.
షబ్బీర్ ఆరోపణలు అవగాహనారాహిత్యం: ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి
మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ గురువారం నిజామాబాద్ జిల్లాలో ప్రారంభించిన చెరువు పనులపై ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ విమర్శలు గుప్పించడంపై ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి మండిపడ్డారు. పనుల టెండర్‌ను అంచనా వ్యయం కంటే ఎక్కువకు ఖరారు చేశారన్న షబ్బీర్ ఆరోపణలను తోసిపుచ్చారు. ఈ చెరువు పనులకు 12.3 శాతం మైనస్‌తో టెండరు ఖరారైందని, కానీ షబ్బీర్ మాత్రం కనీసం అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. షబ్బీర్ విద్యుత్‌శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కనీసం సొంత డివిజన్‌కు కూడా న్యాయం చేయలేకపోయారని విమర్శించారు. పైగా హైదరాబాద్‌కు ఇన్‌చార్జిగా ఉండి దందాలు, సెటిల్‌మెంట్లకు పాల్పడ్డారన్నారు.