జిల్లా ప్రజలకు అండగా ఉంటాం
వైరా: జిల్లా ప్రజల కష్టసుఖాల్లో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, తాను తోడుగా ఉంటామని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం వైరాలోని శబరి గార్డెన్‌లో జరిగిన వైఎస్‌ఆర్‌సీపీ వైరా నియోజకవర్గ సమీక్ష సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి కార్యకర్తకు భరోసానిస్తామని, ప్రజా సమస్యలే ఎజెండాగా పనిచేస్తామని అన్నారు.
తెలంగాణలో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ ఉండదని విమర్శలు చేసిన వారికి ఖమ్మం జిల్లాలో మూడు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానాన్ని గెలిపించుకొని సత్తా చాటామని అన్నారు. తాము పార్టీలు మారుతున్నట్లు మీడియాలో వస్తున్న కథనాలు కేవలం దుష్ర్పచారమేనని విమర్శించారు. భగవంతుడి దీవెనలు, రాజన్న ఆశీస్సులతో ఇచ్చిన హామీలను నేరవేరుస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రతి పైసా ప్రజల కోసం ఖర్చు చేస్తామని, జిల్లాలో వైఎస్సార్‌సీపీ నూతన వరవడి సృష్టించేందుకు మదన్‌లాల్, శ్రీనన్నలు కృషి చేస్తారని ఈ సందర్భంగా అన్నారు.
ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తా..: మదన్‌లాల్
వైరా నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తానని, వైరాను ఐదేళ్లలో మోడల్ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానని ఎమ్మెల్యే బాణోతు మదన్‌లాల్ అన్నారు. గిరిజన గ్రామాల్లో సాగు, తాగునీటితో పాటుగా వ్యవసాయ ఆధార భూములకు చెక్‌డ్యాంల నిర్మాణం కోసం కృషి చేస్తానని అన్నారు.
పొంగులేటికి, మదన్‌లాల్‌కు ఘనసన్మానం..
ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైరా ఎమ్మెల్యే బాణోతు మదన్‌లాల్‌ను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మాన్మిం చారు. అనంతరం పొంగులేటి స్థానిక హరిహరసుత అయ్యప్ప క్షేత్రాన్ని సందర్శించారు. పార్టీ సమావేశంలో వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధికార ప్రతినిధులు నిరంజన్‌రెడ్డి, ఆకుల మూర్తి, వైరా జెడ్పీటీసీ బొర్రా ఉమాదేవి, వైరా, కొణిజర్ల, ఏన్కూరు, జూలూరుపాడు, కారేపల్లి మండలాల కన్వీనర్లు షేక్ లాల్‌మహ్మద్, రాయల పుల్లయ్య, నల్లమల్ల శివకుమార్, పొన్నెకంటి వీరభద్రం, రావూరి శ్రీనివాసరావు, నాయకులు గుమ్మా రోషయ్య, బొర్రా రాజశేఖర్, సూతకాని జైపాల్, తన్నీరు నాగేశ్వరరావు, ఇమ్మడి తిరుపతిరావు, పూర్ణకంటి నాగేశ్వరరావు, పాముల వెంకటేశ్వర్లు, తేలప్రోలు నర్సింహరావు, గరికపాడు సర్పంచ్ శీలం కరుణాకర్‌రెడ్డి, గుండ్రాతిమడుగు సర్పంచ్ అప్పం సురేష్, ధార్న శేఖర్, ధార్న రాజా తదితరులు పాల్గొన్నారు.